2869* వ రోజు ....           31-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

చల్లపల్లి శ్రమదానోద్యమంలో 2869* వ నాడు.

          అది గురువార (31.8.23) మయింది. వేకువ 4:20 - 6.08 మధ్యస్త సమయమయింది. ఉన్న కార్యకర్తలు 21 మందీ సన్ ఫ్లవర్ కాలనీ (గంగులవారిపాలెం వీధి నుండి) రోడ్డునే ఎంచుకొని –

1) రెండు ప్రక్కల మురుగు కాల్వల్నీ, బాటకు దక్షిణ ఉత్తర దిశల్నీ దృష్టి పెట్టారు.

కత్తుల - దంతెల పనులే ప్రధానంగా నడిచిన ఈ నాటి శ్రమ విశేషాలు :

- అదేంటో గాని, కృష్ణానది పాయలాగా రెండుగా మారిన డ్రైను గట్ల మీద అడవిలా పెరిగిన చెట్లూ, వాటి కల్లుకొన్న పిచ్చి తీగలూ ముందిద్దరు నరుక్కుంటూపోతుంటే –

- 2 చెట్ల మీదికి ఎక్కి, ఇద్దరు వాటి కొమ్మల పనిపట్టుతుండగా...

- నలుగురు దంతెల - డిప్పల వాళ్లు సదరు వ్యర్థాల్ని, పుల్లల్నీ - ఎండుటాకుల్నీ ఊడ్చి - ఏరి ఎత్తి ట్రాక్టర్ లో నింపుతుండగా..

- కాలనీ రోడ్డు కిరువైపులా నలుగురు చొప్పున బాట పైకి వస్తున్న ముళ్ల - పిచ్చి మొక్కల్ని తొలగిస్తూపోతుండగా

 - ఐదారుగురు దక్షిణం వైపు ఖాళీ స్థలంలో పడి ఉన్న ఎండుకొమ్మల్ని అవసరమ్మేరకు ముక్కులు చేసి, ట్రక్కులోకి ఎక్కిస్తుండగా....

          అందులో బారు మొద్దొకదాన్ని నలుగురతికష్టమ్మీద లాక్కొచ్చి, డ్రైను దక్షిణం కొసన సిమెంటు రోడ్డుకు రక్షణగా అమర్చగా....

          నేటి ప్రయత్నాలు చాల వరకు విజయవంతమైనవి. మొత్తమ్మీద నిన్న, నేటి శ్రమదానంతో ఈ ప్రాంతానికొక క్రొత్త ఆకృతి వచ్చింది. ఇక్కడి 3 స్థలాల యజమానులకూ ఆ సంగతీ తెలియనే లేదు!

          కాఫీల అనంతరం తాడంకి ఆనందరావనే ట్రస్టు కార్మికుడు తొలిమారు నినదించిన ఊరి శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలతో 6.25 కు నేటి కార్యక్రమం ముగిసింది!

          రేపటి వేకువ మనం కలిసి శ్రమించవలసిన చోటులో పెద్దగా మార్పు లేదు - గంగులవారిపాలెం బాటలోని మాజీ DSP గారి ఇంటి పరిసరంలోనే!

          అంజలించుట సముచితమే గద!

ఎవ్వరీ బస్ ప్రాంగణానికి ఇంత పసిమిని తెచ్చిపెట్టిరొ

కంపు గొట్టే ఊరి నెల్ల సుగంధ భరితం చేసి చూపిరొ

అష్ట రహదార్లన్ని పూలతొ అందగించిరో పొందుపరచిరొ

అట్టి శ్రామిక స్వచ్ఛ వీరుల కంజలించుట సముచితమే గద!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   31.08.2023.