2870* వ రోజు ....           01-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

2870* వ వేకువ గ్రామ పారిశుద్ధ్య శ్రమలీలలు!

            శ్రావణ శుక్రవారపు - అనగా ఫస్టెంబరు (1-9-23) బ్రహ్మకాలంలో - మరీ 4.16 నుండే ఆ లీలలు మొదలైనవి! 26 మందికి ఈ బురద, మురికి పనుల్లో ప్రమేయమున్నది! భౌతికంగా కాకున్నా - బెజవాడ నుండీ, దావణగెరె నుండీ కనెక్టికట్ (USA) తది తర చోటుల నుండీ ఈ 50 పని గంటల కృషికి మద్దతున్నది! వివిధ రాజకీయ పక్షాల వర్గాల - అధికారుల సౌజన్యం కూడ ఉన్నది!

            ఎందరెందరి సహకారం లేకుండ - దాతల ఆశీర్వచనాల్లేకుండ మాటసాయాల్లేకుండగనే ఈ తొమ్మిదేళ్ల శ్రమ ప్రణాళిక కొన్ని ఎదురు దెబ్బలు తట్టుకొని - కాల వైపరీత్యాలుదాటుకొని - ఇంత పెద్ద గ్రామాన్ని ఈ రీతిగా మార్చగలిగిందా?

            ఈ కార్యకర్తలంటే సామాజిక బాధ్యతా వ్యసనపరులనుకొందాం, మూడో కంటికి తెలీకుండ ఈ ఉద్యమానికి గుప్త ఆర్థిక దాన వ్యసనపరులూ, ప్రత్యక్షంగా కాకున్నా వాట్సప్ ద్వారా ప్రోత్సహించే సజాతీయ పక్షుల సంగతేమిటి?

            40 గంటలుగా మోకాలి నెప్పి భరిస్తున్న ఒక 67 ఏళ్ల మహిళా కార్యకర్త, ఎక్కడో కోమలా నగర్నుండి చీకట్లో జాగ్రత్తగా వచ్చి, చాతనైనంత కష్టిస్తున్న 68 ఏళ్ల భారీకాయుడూ, 3-4 కిలోమీటర్ల దూరం పొరుగూళ్ల నుండి వచ్చి మరీ చల్లపల్లి మెరుగుదలకు పాటుబడే రైతు పెద్దలూ - వాళ్ల స్ఫూర్తీ గమనార్హాలు కావా?

            కార్యకర్తల ఈ నాటి పని వివరాలేవనగా, అవి నిన్నటి వలెనే. ఇంచుమించు అవే 3 చోట్ల 2 రోడ్లలో జరిగినవి:

            విద్యుత్ శాఖ వారు గతంలో నరికి వదిలేసిన 2 పెద్ద ఎండు చెట్ల ఖండనమూ, అందుగాను ఇద్దరు కత్తుల వారూ, మర రంపం వారిద్దరూ, దంతె/ చీపురు మనుషులూ గంటన్నరకు పైగా శ్రమ! క్రింద డ్రైన్ లో మురుగు నిలిచింది గాని ఇప్పుడా చిట్టడవి తొలగిపోయి ఆ స్థల మెంత క్రొత్తగా - శుభ్రంగా ఉన్నదో చూడండి!

            సన్ ఫ్లవర్ కాలనీ బాట 2 ప్రక్కలా అసహ్యంగా పెరిగిన పనికి మాలిన మొక్కలూ, గడ్డీ అదృశ్యమయిన వంటే - ఏడెనిమిది మంది చెమట చిందించడవేం కారణం!

            గంగులవారిపాలెం బాటలో మార్జిన్లో విరబూసిన గడ్డి పూలను వదిలేసి ఇద్దరు రైతు కార్యకర్తలు పిచ్చి మేడి, పురుగుడు చెట్ల పనిబట్టారు.

            అక్కడికి ఉత్తరంగా కత్తెర్లు, కొడవళ్లతో 3గ్గురు రోడ్డు వైపుకు పెరుగుతున్న బోగన్ విలియా పూల చెట్ల కొమ్మల్ని అవసరానుసారంగా తొలగిస్తేనే గదా - ఈ బాట మరింత ఆహ్లాదకరంగా మారింది?

            గతంలో మనం చెప్పుకొన్నట్లు చివర 20 నిముషాల పాటు చెత్త లోడింగు ఎప్పుడైనా చూడదగ్గ పనే!

            6.25 కు నేటి కృషి సమీక్షా సమయంలో మనసారా 3 మార్లు గ్రామ స్వచ్ఛ - సుందర భవితవ్యాన్ని నినదించినదీ. వివేకానంద వాణిని ప్రస్తావించినదీ అడపా గురవయ్య:

            రేపటి ఒక అతిథి రాకనూ, SRYSP విద్యా సంస్థ వద్ద శనివారం నాటి మన పని స్థల నిర్దేశమునూ చేసినది డాక్టర్ DRK.

            నిజం నిగ్గు తేలుస్తది!

సకల జనులు తమ వైఖరి సమర్థించుకోజూతురు

పైగా ఇతరుల పనులకు తాటాకులు కట్టగలరు

కాలం అందరినీ ఒక కంటన కనిపెడుతుంటది

నింపాదిగా ఏనాటికొ నిజం నిగ్గు తేలుస్తది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.09.2023.