2875* వ రోజు ....           08-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

2875* వ ప్రయత్నం కూడ గంగులపాలెం వీధి యందే!

          మరొక శ్రావణ శుక్రవారం - 8.9.23 నాటి వీధి బాధ్యత సైతం మరీ వేకువ 4.11 కే మొదలై - 6.12 దాక కొనసాగింది. నేటి 26 మంది పారిశుద్ధ్య ప్రయత్నీకుల్లో నలుగురు ట్రస్టు సంబంధీకులూ, అదనంగా పాగోలు ప్రముఖులొకరు!

          ఏ పూటైనా కార్యకర్తల ఉత్సాహానికి కొరత లేదు గాని, ఒకప్పటి నరక ప్రాయమైన దుస్థితి గుర్తున్నందువల్లా, అందుకు పూర్తి భిన్నంగా ఊరి వీధులన్నిటికీ ఇప్పుడు తలమానికమైనందుచేతా, ఈ వీధిని సంస్కరించడంలో కొందరి ఉత్సాహమే వేఱు! ముఖ్యంగా సెల్ఫీ పాయింట్ దగ్గర 2 పెద్ద చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్న సందడి!

          అంత పచ్చదనాన్నీ, నీడనీ పంచుతున్న చెట్ల కొమ్మల్ని రంపంతో, గొడ్డలితో శిక్షించవలసి రావడం బాధాకరమే గాని, పైన కరెంటు తీగలనందుకొనే ప్రమాదం వల్ల అది తప్పలేదు!

          కనీసం డజను మందికి ఈ వేకువ సమయమంతా ఆ 2 చెట్లతోనే సరిపోయింది. పెద్ద కొమ్మల్ని తగు పరిమాణంలో నరికి, రెమ్మల్ని వేఱు చేసి, అన్నిటినీ గుట్టలుగా పేర్చడంలో ఇద్దరు స్త్రీ కార్యకర్తలకూ భాగస్వామ్యమున్నది.

          ఇక్కడికి కాస్త దూరంగా ఒక ఖాళీ స్థలంలో గడ్డి - పిచ్చి చెట్లూ విజృంభిస్తుంటే చూడలేని 7 గురు కార్యకర్తలు కనీసం సగభాగంలో కష్టించి, చూడముచ్చటగా రూపొందించారు.

          అక్కడికింకా దక్షిణంగా ఒక వ్యాపారీ, ఒక విశ్రాంత ఉద్యోగి ఉమ్మడి ప్రయత్నంతో ఒక సందు మలుపు శుభ్రపడింది.

          బాటకు తూర్పున - అంటే కొలిమి మేస్త్రి గారి పాలకేంద్రం వద్ద బోగన్ విలియా పూల - ముళ్ల చెట్ల కొమ్మల్ని పొందికగా మార్చే నలుగురి పని కొంచెం నెమ్మదిగా జరిగి, విజయవంతమైనది!

          గంగులవారిపాలెం వీధికి చెందిన - ఇంతకు ముందు పాల్గొంటున్న శాయి – భవఘ్ని నగర్ చైతన్యవంతులెందుకో గాని ఈ ఉదయం రాలేదు!

          నడుమ కొన్ని రోజులాగినా, సుమారు నెలరోజులుగా ఈ కిలోమీటరు పైగా వీధి సంస్కరణ నేటితో ఒక కొలిక్కి వచ్చింది.

          6.30 సమయంలో అందుకు మరొక సందర్భం కలిసొచ్చింది. అదేమంటే – విజయా/ వివేకానంద విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ శివప్రసాదు గారి తల్లిగారి సంవత్సరీకమూ, దానికి సార్ధమైన గుర్తింపు చర్యగా స్వచ్చోద్యమ ప్రోత్సాహకంగా 25000/- విరాళమూ, మధ్యాహ్య విందుకు కార్యకర్తల కాహ్వానమూ!

          ఒక స్వచ్చోద్యమాభిమాని శ్రీమతి మండవ జానకి, మేరీలాండ్, USA (పెదప్రోలుకు చెందిన “డా. మండవ శాయి” గారి కుమార్తె) ఈరోజు 25,000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేసినందుకు కృతజ్ఞతాభివందనాలు.  

తొమ్మిదేళ్ల శ్రమదానోద్యమ ఫలితంగా చల్లపల్లిలో

1) కాలుష్యం అదుపులోకొచ్చింది.

2) పచ్చదనం బాగా పెరిగింది.

3) స్వచ్ఛ కార్యకర్తల సంఖ్యే ఎక్కడ వేసిన గొంగళి అక్కడున్నట్లున్నది.

          రేపటి వేకువ మన తొలి కలయిక బందరు రహదారిలోని SBI దగ్గరనే!

          కృషికి పరాకాష్టలు,

ముప్పది వేలకు పైగా మొక్కలెవరి ప్రణాళికలు,

క్రిక్కిరిసిన పూలెవ్వరి కృషికి పరాకాష్టలు,

ఏడెనిమిది రహదారుల వెంట పూలవనములు –

చూసి తప్ప నమ్మలేని చోద్యము లీ చర్యలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.09.2023.

యార్లగడ్డ శివప్రసాదు గారి విరాళం
డా. మండవ శాయి గారు