2876* వ రోజు ....           09-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

స్ధిరవారం వేకువ సుస్థిర శ్రామిక యజ్ఞం! @2876*

9.9.23 - బ్రహ్మముహుర్తాన అది 4.15 నుండి 6.10 దాక నిర్విఘ్నంగా - కనీసం 3 చోట్ల

1) గంగులవారిపాలెం వీధిలో భవఘ్నినగర్,

2) SRYSP సంస్థ ప్రహరీ వెలుపల,

3) పంటకాల్వ వంతెన మొదలు మూల్పూరి ఉద్యానముల దాక

    స్వచ్ఛ సుందర పతాకం రెపరెపలాడింది.

          సదరు పతాకధారులు 24+6 మంది - చివరి సంఖ్య ట్రస్టు ఉద్యోగులది! ఇప్పటికీ సగం ఊరికి అంటీ ముట్టని ఈ వీధి పారిశుద్ధ్యంలో 14 ఏళ్ల విద్యార్ధిని నుండి 84 ళ్ల వైద్యుని దాక వివిధ వయస్కుల భాగస్వామ్యం!

          “మీరు సమాజంలో లబ్ద ప్రతిష్టులు, బట్టలు నలక్కుండ ఉద్యోగించే గౌరవ వృత్తులవలంబించే గడపదాటి బైటకురాని - గౌరవనీయులు, పెద్దలు, గృహిణులు - ఇలా పాచి, తుక్కు, దుమ్ము, మొరటు పనులకు దిగడమావంటి ప్రశ్నార్థకాలూ, ఆశ్చర్యార్థకాలూ ఈ ఉద్యమం తొలి 100 నాళ్లలోనే ముగిసినవి. వందలు వేలై, 2900 రోజుల్ని సమీపిస్తున్నవి.

          ఒక వ్యసనంలాగా ఆ పాతిక ముప్పై - నలభై మంది ఏనాడూ ఈ పాచిపనలు మాననూ లేదు, ఊరి వాళ్లు జాగృతులైపోయి, కార్యకర్తల సంఖ్య ఎప్పుడో తప్ప - వందల సంఖ్యకు చేరనూ లేదు!

ఈ వేకువైనా అంతే - ఇంత పెద్ద ఊరి నుండి అతికష్టమ్మీద 30 మంది పాల్గొన్న వీధి పారిశుద్ధ్యంలో

1) బందరు వీధికి ఉత్తరంగా మొలచి పెరిగిన గడ్డి పీకి, చెక్కిన ఆరేడుగురూ,

2) దక్షిణంగా సుమారు 130 గజాల పొడవునా చీపుళ్లతో దుమ్మూ - ధూళీ ఇతర వ్యర్థాల్ని ఊడ్చిన నలుగురూ

3) భూగర్భ మురుగు వ్యవస్థ దగ్గర మరి రెండు పెద్ద చెట్లను ప్రహరీ ఎక్కి అదుపు చేసిన నలుగురూ,

 

4) ముళ్ల బోగన్ విలియా చెట్ల కొమ్మల్ని ఒడుపుగా సుందరీకరించిన 5 గురి బృందమూ,

          శతధా - సహస్రధా అభివందనీయులు!

జూనియర్ కళాశాల ద్వారమెదురుగా 6.25 కు జరిగిన దైనందిన వీడ్కోలు/సమీక్షా సమావేశానికి ముందు

- జంకు లేకుండా అనుమకొండ గీతా హాసిని ముమ్మారు స్వచ్చ సుందరోద్యమ నినాదాల ప్రకటింపూ

- సుభాషిణీ ప్రధానోపాధ్యాయిని ప్రాయోజిత తినుబండారాలూ,

- అదొక గుప్త దానమో, వ్యక్తదానమో తెలియని ఒక వ్యాపారి విరాళం 700/-   

- విజయవాడ నోవాటెల్ హోటలో ప్రకృతి మైత్రిగా ఇటీవల జరిగిన విందూ,

- నిన్న పాగోలులో పర్యావరణహితంగా జరిగిన భోజన – భాజనాలూ,  

- శ్రీకాకుళంలో నిన్న ఒక వాస్తిక ప్రముఖుడావిష్కరించిన భక్తి పూరిత ‘భజరంగభళీ' శతక సంగతీ,

          రేపు మరొక మారు SBI దగ్గరనే మనం కలిసి శ్రమించదగు పని వివరాలూ..

          దృష్టిని బట్టే కనిపిస్తుంది...

దృష్టిని బట్టే కనిపిస్తుందీ స్పష్టని విన్నాను

నువ్వది వేదం అన్నావు - నేనది వాదం అన్నాను ॥

సంత మధ్యలో జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే

నువ్వది గేయం అన్నావు - నేనది గాయం అన్నాను

                              ॥ దృష్టిని బట్టే ॥

కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే

నువ్వది వినోదమన్నావు - నేనది ప్రమాదమన్నాను

                             దృష్టిని బట్టే ॥

ఊరి మెరుగుదల కోసం కొందరు ఉద్యమించుచుంటే

నీవు నిరర్థకమంటావు - నేనది సార్థక మంటాను

                             దృష్టిని బట్టే ॥

శ్రమదానం మన చల్లపల్లి కొక వర దానం అంటే

నువ్వది మోటు పనంటావు – నేనది నీటు పనంటాను

                                  దృష్టిని బట్టే ॥

తొమ్మిదేళ్ళుగా స్వచ్చ సైనికుల చెమట చిందుతుంటే

నువ్వది విచిత్రమంటావు – నేనది పవిత్రమంటాను  

                                      దృష్టిని బట్టే ॥

ప్రజారోగ్య పరిరక్షణ కోసం పాటు పడుతు ఉంటె

నువ్వది కీర్తి దురద అంటే – నేనది బాధ్యత అంటాను

                                      దృష్టిని బట్టే ॥

 

డ్రైను లోన దిగి కార్యకర్తలు బురద తోడుతుంటే

నువు ముక్కులు మూసి నిష్క్రమిస్తే – మేము నిలిచి సహకరిస్తాం

                                                          దృష్టిని బట్టే ॥

శ్మశానాల క్రమబద్దీకరణకు శ్రమకు పూనుకొంటే

భయపడి వెనకడుగేస్తావు – మేం నిలబడి పురోగమిస్తాము

                                      దృష్టిని బట్టే ॥

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.09.2023.