2877* వ రోజు....           10-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

                               ఇది 2877* వ నాటి శ్రమదానం!

          ఈ ఆదివారం (10-9-23)వేకువ కార్యకర్తల కలయిక సంకేతం బందరు వీధిలోనే ‘ప్రభుత్వ ద్రవ్యనిధి’(SBI) వద్దనేగాని, వరుణుడి చిలిపి చేష్టల వల్లబాగా తడి బారిన రోడ్డు నూడ్చుట కన్న భారతలక్ష్మి వడ్లమర వీధిలోని గడ్డి- పిచ్చి మొక్కల పనే నయమనుకొని, శ్రమ కేంద్రాన్ని మార్చడమైనది.         

          వేకువ 4.17-6.08 వేళల నడుమ జరిగిన ప్రయత్నంతో-

          1) వడ్లమర వీధి పూర్తిగాను,

          2) సాగర్ ఉపమార్గం పాక్షికంగాను మెరుగైనవి!

          ఏ కారణం వల్లనో ధ్యాన మండలి వారు రాకున్నా - ఇద్దరు వైద్యులు భాగ్యనగరికేగినా- ఒక శాస్త్రి గారు ఏ విజయవాడలోనో ఉండి పోయినా – నేటి శ్రమదాతల సంఖ్య 31 గా ఉన్నది!  కనుకనే చెత్త లోడింగుతో సహా వీధి పారిశుద్ధ్య కృషి సజావుగా సాగింది!

          ఈ వీధి చిన్నదేగాని - తొమ్మిదేళ్ల నాడుదీనికొక గుర్తింపు దక్కేది - బ.మ. విసర్జనలోను – జంతు కళేబరాలతోను - ఇది ఏవీధినైనా ఛాలెంజి చేస్తుండేది. వాసిరెడ్డి కోటేశ్వర్రావనే ఒక ఒంటరి మొండి విశ్రాంతోపాధ్యాయునిపోరాట పటిమ వల్ల ఇప్పుడిది అందమైన ఇతర వీధుల్తో పోటీపడుతున్నది! అతడు గతించినఐదేళ్ల పిదప కూడ ఈ వీధిని శుభ్రపరిచే కార్యకర్తల కాతనిస్ఫూర్తి సోకుతునే ఉన్నది.

          బైపాస్ వీధి కలయిక వద్ద ఆగిన కార్యకర్తలు ఈ వేకువ సమయాన సాధించిన దేమందురా?

 

1) అదే వీధిలోని అపార్టమెంట్ల సమీపాన గడ్డి పీకి, చెక్కి పాక్షికంగా శుభ్ర- సుందరీకరణ,

2)3 గ్గురు సుందరీ కర్తలు వడ్ల మర దగ్గర - బైపాస్ వీధిలోని చెట్ల కొమ్మల క్రమబద్ధీకరణ,

3)16-17 మంది కత్తుల - దంతెల కార్యకర్తలు గంటన్నర పాటు శ్రమతోగాని వడ్లమర వీధి చివరి దాక- అంటే బందరు దారి దాక ఏపుగా పెరిగిన ముళ్ల – పిచ్చి మొక్కలు,కరెంటు తీగల్నందుకొంటున్న వేప కొమ్మలూ, ప్లాస్టిక్ తుక్కులూ, తెగి పడి, ప్రోగులు పడి,ట్రాక్టర్లో కెక్కి అంతిమంగా చెత్త కేంద్రానికి చేరాయి !

4)బంధన్ బ్యాంక్ ప్రక్క సందు కూడ కొందరు కార్యకర్తల ధాటికి శుభ్ర పడింది!

6.25కు నేటి అంతిమ సమావేశంలో:

-జీవిత బీమా ఉన్నతాధిపతి జాస్తి ప్రసాదుగారు వేగంగా మ్రోగించిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలూ,

- బుధవారం వేకువ కార్యకర్తల కలయిక సంగతీ (వాన లేకుంటే SRYSP సంస్థ ఎదుటా, ఉంటే సాగర్ బైపాస్ వీధి వద్దా) ప్రస్తావన కొచ్చినవి!

      శోభస్కర మగు వేడుక!

సంక్షుభిత ప్రపంచాన చల్లపల్లి శ్రమదానం

అనివార్యం – ఆదర్శం- ఆరాధ్యం- అవశ్యకం

అది తొమ్మిది వసంతాలు ఆగక ప్రస్థానించుట

సామాజిక శుభ సూచక శోభస్కర మగు వేడుక!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.09.2023.