2880* వ రోజు ....           14-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

వివేక - విచక్షణాత్మక శ్రమదానం - @2880*

          అది ఈ గురువారం (14-9-23) వేకువ 4.13 కు మొదలై 6.09 కి ముగిసెను. దాన్ని నిర్వహించిన శ్రమకారులు 22 మంది - వారి కర్మక్షేత్రం బందరు మార్గంలోని కర్మల భవన - అమరావతి రాజ ప్రాసాద ప్రాంతం - అంతేగాక, 2 రహదారి ఉద్యానముల, 1 వ వార్డుకు చెందిన ముఖ్య వీధి, సజ్జా వారి వీధి, ఇటు కళా నర్సింగ్ హోమ్ వంటి చోట్లు కూడ!

          ఇందులో 3 గ్గురి పనిచోటు ఇచ్చటికి 1 కి.మీ. దూరాన గంగులవారిపాలెం బాటలో తూర్పు వైపున. నేను గమనించినంతలో డజను గద్దగోరు, బోగన్ విలియా పూల చెట్లు వీరి చేతుల్లో బడి చక్కని గుమ్మటాల్లాగా బుద్ధిగా బారులు తీరి నిలుచున్నవి! అందుకే వీళ్లకి సుందరీకర్తలనే పేరు!

నేటి శ్రమ సంగతిని స్థూలంగా చెప్పాలంటే:

1) రిజిస్ట్రార్ కార్యాలయం మొదలు సుమారు 100 గజాల సువిశాల బందరు వీధి దుమ్మూ - ధూళీ వదిలించుకొని, కొద్దిపాటి ప్లాస్టిక్, గాజు సీసాల్ని, పుల్లా పుడకల్ని పోగొట్టుకొని, 2 చోట్ల గడ్డీ - పిచ్చి మొక్కల్ని కోల్పోయి, ‘ఇది స్వచ్ఛ సుందర చల్లపల్లిలో వీధి సుమా!’ అనిపించేట్లు తయారైనది.

2) కాస్త ఆలోచించండి - ఈ స్వచ్ఛ కార్యకర్తలు కాక, ఏ ఊళ్లో ఎవరు ఇలా బ్రహ్మముహూర్తంలో, వంటికి బురద అంటించుకొంటూ - చల్లని వేళ కూడ చెమటలొలికిస్తూ - ఊరంతటి పారిశుద్ధ్య విధుల్ని నిర్వహిస్తూ - 2880 వేకువలు శ్రమిస్తారు? ఇవేమన్నా సొంతిళ్ల పనులా?

3) అసలు వీళ్లదొక ప్రత్యేక మానసిక స్థితే కాకుంటే - ఇన్ని లక్షల పని గంటల నిస్వార్ధ సామాజిక కర్తవ్యం నెరవేరేదా? వీళ్ల మానాన వీళ్లు వరస బెట్టి శ్మశానాల – కర్మల భవానాల - ముఖ్య వీధుల – మురుగు కాల్వల - అత్యుత్తమ నిర్వహణం చేసుకుపోతుంటే ప్రపంచ వ్యాప్త స్వచ్ఛ సుందరాభిమానుల వల్లనో, పాత్రికేయ మిత్రుల మూలంగానో, ఈనోటా - ఆనోటా స్వచ్చోద్యమ చల్లపల్లి పేరు వినిపించింది.

4) బురద సరే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర రిస్కుతో గూడిన పనులకు దిగడమే జాగ్రత్త పడదగిన అంశం!

5) పని విరమణ వేళకు ముందే – 5:50 కే తొంగి చూసిన వానమిత్రుడు ఈ పూట మంచి ఓర్పు చూపాడు - చిన్నపాటి తుంపరతో సరిపెట్టి - 6.20 తర్వాతే వృద్ధి చెందాడు!

          “ఎందరో మహానుభావులు...” అని కాకర్ల త్యాగరాజు పాడుకొన్నట్లు - ఈ స్వచ్ఛ - సుందరోద్యమాన్ని ఆశీర్వదిస్తున్న సహృదయులెందరో!

          ఈ నాటి గ్రామ శ్రమదానోద్యమ నినాదాల కర్త సజ్జా ప్రసాదైతే – సమన్వయ కర్తా, సంతోషభోక్తా డి.ఆర్.కె.ప్రసాదు.

          రేపటి వేకువ మన కార్యక్షేత్రం కూడ బందరు వీధిలోని ఇదే మునసబు వీధి కూడలి వద్దనే!

          తక్షణమె పరిష్కారం!

స్వచ్ఛ సుందరోద్యమాన అప్రకటిత రాజ్యాంగం

మాయా మర్మాలు లేని మంచి పారదర్శకం

అందులోన క్రమశిక్షణ, అంతర్లీన సంయమనం

తలలెత్తిన సమస్యలకు తక్షణమె పరిష్కారం!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  14.09.2023.