2881* వ రోజు ....           15-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

నేటి ప్రయోజనకర శ్రమదానం వయస్సు 2881*

            15-9.23భాద్రపద శుక్రవారం వీధి పారిశుద్ధ్య  శ్రమ జరిగింది బందరుమునసబు ఉభయ వీధుల్లో  ఐతే - జరిపింది 24 మంది, బాగుపడింది యాభైయ్యేసి గజాలు, కార్యక్రమాన్ని చూస్తూనూ - అభివాదాలు చేస్తూనూ- అటూ ఇటూ వెళ్లింది ఏ నూట ఏభైమందో!

            నేటి కర్మ ఫలితాన్ని ప్రస్తావించాలంటే - ముందుగా పేర్కొన దగింది బందరు వీధిలో జమిందారు గారి రాజ భవనమూ - ఉత్తరం ప్రక్కన వైజయంతమూ మధ్యగల కాలుష్య దుష్టశక్తి మీద పోరాటమే! అక్కడ రాత్రి వానకు బాట పైన దుమ్మూ - ఇసుకా కలిసిన అంగుళం మందపు పొర ఉన్నది. దక్షిణాన మినీ ఉద్యానాల్లో వద్దన్నా వినకుండా ఏపుగా పెరిగిన కలుపూ- పిచ్చిమొక్కలూ దట్టంగా ఉన్నవి !

            ఇకేముంది - 4.12 కు అక్కడికి చేరుకొన్న కొందరి చూపు ఆ వికారాల మీద పడటమూ, కత్తులూ-కొడవళ్లతో డజను మంది దాడి చేయడమూఆ 50 గజాల యుద్ధ భూమిలో ఎప్పట్లాగే కార్యకర్తలదే విజయం కావడమూ !

            ఒక పంచాయతీ వార్డు మాజీ ప్రతినిధీ, ఇంకో వ్యాపారీ గోకుడు పారల్తో గజాల బాటను గోకుతున్న వైనం –(అదేదో ఫొటోల కోసం కాదు-) ఎవరైనా దగ్గరగా గమనిస్తే- గంటన్నర కాలం వంచిన నడు మెత్తకుండా ఈ వేకువ వేళ ఎలా శ్రమించ గలుగుతున్నారు!అని ఆశ్చర్యపడకమానరు!

             మునసబు వీధిలో మురుగు కాల్వ ఒడ్డున జోడు కత్తుల వారు దంతెల వారు చెమటలు దిగ కారుస్తుంటే చూసి మన DRK డాక్టరు గారి కళ్లు కొద్దిగా చెమర్చి మన కార్యకర్తలు కాక ఈ దేశంలో ఇంతమురికి పను లెవరు చేస్తారండీ?” అనడమూ, మరొకాయన “తొమ్మిదేళ్లుగా అలవాటు పడ్డ ఈ చెత్త పనుల్ని ఈ కార్యకర్తలెందుకాపుతారండీ” అనడమూ!

             మళ్లీ ఈ రెండు చోట్లనే కాక ఒక కిలోమీటరు దూరంగా ముగ్గురు గంటన్నరకుపైగా గంగులపాలెం వీధి కందం తెచ్చిన - ఐనా అదుపు తప్పుతున్న పూలమొక్కల కొమ్మల్ని కత్తిరిస్తున్నారు!

            మూడు చోట్లా ఊడ్చిన, పీకిన, పోగుబడిన వ్యర్థాల్ని డిప్పలకెత్తుకొని, ఒక సంచార చెత్త వాహనంలో కెత్తుతూ నలుగురు తిరుగుతున్నారు.

            ఇదొక వాస్తవ దైనందిన శ్రమదాన సమాచారం! ఇందులో అతి శయోక్తుల్లేవు, ఆ సందర్భ వర్ణనల్లేవు, ఇవి మసి పూసి మారేడు పళ్ళు చేసేదీ కాదుగ్రాఫిక్సంతకన్నా లేవు! అంతా బహిరంగమే - అన్నీ పారదర్శకాలే!  ఈ రెండు డజన్ల మంది సంతోషంగా నిర్వహించిన 40 పని గంటల గ్రామ సామాజిక శ్రమదానం వేల రోజుల యదార్థ దృశ్యమే!

                  నేటి సమీక్షా కాలంలో తొణక్కుండా చల్లపల్లి శ్రమదానోద్యమ ఘనతను మూడు మార్లు నినదించిన వారు - వార్డు మాజీ సభ్యురాలు పసుపులేటి ధనలక్ష్మి!

        రేపటి వేకువ కార్యక్రమం భగత్ సింగ్ వైద్యశాల నుండి జరుగుననేది సమష్టి నిర్ణయం!

            మారిన వీధులు

తొమ్మిదేళ్ల శ్రమదానంతో మారిన వీధులు

శ్రమ బంధుర - సుమ సుందర గ్రామం దిశగా అడుగులు

వాస్తవం గ్రహించి ప్రజలు వచ్చేస్తారని ఆశలు

సహనంతో వేచి చూచు స్వచ్ఛ కార్యకర్తలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.09.2023.