2882* వ రోజు ....           16-Sep-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

సహర్షంగా గణింపదగిన 2882* వ శ్రమదానం!

            శనివారం (16-9-23) సాధారణంగా పెరిగే కార్యకర్తల సంఖ్య శలవు దినం కానందు వల్లేమో - పెద్దగా మార్పు లేదు - కేవలం 26 న్నొక్కరు! అందులో ఆరేడుగురు మహిళలూ, చూస్తేనే అబ్బే - ఈ 70 - 80 ఏళ్ల ముసలోళ్ళూ, శస్త్ర చికిత్సలు చేస్తూ గడిపే వైద్యులూ, పిల్లలకి పాఠాలు చెప్పుకు బ్రతికే బడి పంతుళ్లూ వీధులూడ్చి ముళ్ల మొక్కలు పీకి - కత్తుల్తో, దంతెల్తో ఏం పని చేస్తార్లేఅనిపిస్తుంది!

            ఇంచు మించుగా ఏ వేకువలోనైనా ఇలాంటి దృశ్యమే గాని - గ్రామానికి చెందిన యువతీయువకులూ, తీరుబడిగా ఊళ్లో అక్కడక్కడి కబుర్ల కాలక్షేపరాయుళ్లూ స్వచ్ఛంద శ్రమదానంలోకి వచ్చిన సందర్భాలు అరుదు!

            సుమారుగా 100 మంది నుండే వేకువనే రోడ్డెక్కి, పారిశుద్ధ్య కృషికి సంసిద్ధులయ్యే 25-30-40  మందీ! పైకి బలహీనంగా కనిపించే ఈ కొద్దిమందితోనే గ్రామంలో హరితవనాలూ, వీధుల శ్మశానాల బస్ ప్రాంగణాల - పబ్లిక్ స్థలాల పారిశుద్ధ్యం ఈ మాత్రంగా నిలుస్తున్నదే... మరి ప్రతి వార్డు ప్రతి వీధి నుండి వంతుల వారీగా శ్రమదాతలు బైటకొస్తే ఊరెలా మారిపోతుందో!

            ఇలా ఊహించడాన్ని అతిగా ఆశపడడమని ఎందుకనుకోవాలి? గ్రామేతర - రాష్ట్రేతర దేశాంతర వాసులెందరు ఎన్ని మార్లు చల్లపల్లిలో మురికి పనులకు పాల్పడంగా లేనిది ప్రతి వార్డు నుండీ 10 మంది - మొత్తమ్మీద 200 పైగా ఈ శ్రమ సంఘటనలోకి రానేరారని ఎందుకను కోవాలి?

            ఈ సందడి ప్రధానంగా బందరు వీధిలో దంత వైద్యశాల - ట్విల్స్ దుకాణాల కేంద్రంగానే ఏర్పడినా, ఇక్కడికి 1 ½  కిలోమీటర్ల దూరాన బండ్రేవు కోడు మురుగు వంతెన దగ్గర నలుగురైదుగురి సుందరీకరణం కూడ గణనీయమే! ఒక్క వీధిని నెల నాళ్లపాటు అందగించమన్నా వాళ్ళు పూర్తిగా సంతృప్తి పడరు.

            ట్రాన్స్ఫార్మర్మర్ల చుట్టూనూ, 2 నర్సరీల దాకానూ పిచ్చి ముళ్ల మొక్కల్ని కత్తుల్తో పనిబట్టడమూ, దంతెల్తో గుట్టలుగా లాగడమూ, నిలిపి ఉన్న రాకాసి ట్రక్కుల మాటున వీధి మార్జిన్లను శుభ్రపరచడమూ చిన్న పనులా?

            ముఖ్యంగా - ఒక కాంపౌండరూ, ఒక విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగీ కొందరం వారిస్తున్నా వినక - టాన్స్ఫార్మర్ క్రింద దూరి, గడ్డీ గాదం తొలగించి, చదును చేయడాన్ని ఊపిరి బిగపట్టి చూడవలసి వచ్చింది!

            సందట్లో సడేమియాఅన్నట్లు అదే సమయంలో - అదే చోట ఎర్ర మట్టి దింపుడు కోసం పెద్ద ట్రక్కూ - అందువల్ల ఇరుకైన వీధిలో కాస్తంత ట్రాఫిక్ ఇబ్బందీ!

            చివరకు 6.25 వేళ - ట్విల్స్ వస్త్ర దుకాణం ఎదుట షణ్ముఖ శ్రీనివాసుని స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు పాతిక మంది గొంతుల్లో ప్రతిధ్వనించిన సన్నివేశం!

            రేపటి కార్యక్రమం కూడ యధాతథమే - భగత్ సింగ్ దంత వైద్యశాల ఎదుటే మన తొలి కలయిక!

            కలల రాచ సౌధం

గ్రామ మందు ఒక్క వీధి కలల రాచ సౌధం

అది గంగులపాలెం దారని అందరికీ విదితం

సామ్యవాద వీధి మొదలు చల్లపల్లి ప్రతి వీధీ

అలా రూపు దిద్దుకొనుట స్వచ్చోద్యమ విజయం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   16.09.2023.