2883* వ రోజు ....           17-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

38 మంది - 3 చోట్లు - 65 to 70 పనిగంటలు - 2883* రోజులు

    బాగా సూక్ష్మంగా చెప్పాలంటే ఆదివారం (17-9-23) వేకువ 4.12 - 6.10 వేళల నడుమ శ్రమదానమిదీ!

    స్థలాలు మూడేవంటే - బందరు రహదారిలో పూలమొక్కల కేంద్రాలు, మునసబు వీధి జంక్షనూ, వీటికి దూరంగా - బందరు NH-16 ఉపమార్గం దగ్గరా!

     పని మంతుల లెక్క సంగతికొస్తే - బందరు రోడ్డు కిరుప్రక్కలా పదేసి మంది వంతునా, 2వ చోట 3గ్గురూ, 1 1/2 కిలోమీటర్ల దూరాన - గంగులవారిపాలెం దగ్గర డజను మందీ! వీళ్లుకాక - మొబైల్ వాలంటీర్లు (= సంచార కార్యకర్తలు) కొందరూ!

     అసలిప్పటికే అవగాహన కొచ్చిఉంటుంది - ఇదేదో నలుగురైదుగురి మొక్కుబడి పారిశుద్ధ్య శ్రమ'దానం' కాదనీ, రోజులకు - వారాలకూ - నెలలకూ పరిమితం కాని ఒకానొక సమగ్ర సంచార - శ్రమ 'వేడుక' యంత్రాంగమనీ! 

    ఇక్కడ రికార్డింగు డ్యాన్సుల తరహా పాటల బదులు సామాజిక చైతన్య ప్రబోధక గీతాలు విన్పిస్తుంటవి, అవసరాన్ని బట్టి పారిశుద్ధ్య పనుల్లో సృజనాత్మక మార్పులుంటవి, ఉమ్మడి నిర్ణయాలుంటవి, ఈ సురోమని కాక హుషారైన పనికదలికలుంటవి.

      రకరకాల నేపధ్యాల - వర్గాల - వృత్తుల - ప్రవృత్తులకు చెందిన స్త్రీ బాల వృద్ధులొక ఉమ్మడి స్వార్ధ రహిత లక్ష్యసాధనకు శ్రమించే చక్కటి సన్నివేశమిదే! 

   గడ్డీ - పిచ్చి మొక్కల్ని మురుగు కాల్వ గట్టున కూర్చొని తొలగిస్తున్న వాళ్లు అక్కడ ఉచ్చలే ఉన్నవో - ఉమ్ములే ఉన్నవో ఆలోచించరు? 2 గజాలెత్తున్న దుమ్మూ - ధూళీ లేస్తుంటే, ముక్కులూ - తద్ద్వారా ఊపిరితిత్తులకిబ్బందనీ వెనకాడరు!

    బండ్రేవు కోడు వంతెన దగ్గర ముళ్ల - పూల చెట్ల కొమ్మల్ని తొలగించే కార్యకర్తలు ముళ్ళు - గుచ్చుకొంటాయని వెనుకాడరు! గంటన్నరకు పైగా వాళ్లదొక మూడ్, ఒక ట్రాన్స్!

    బారెడు ప్రొద్దేకే దాక మంచాల కంటుకోక - 'నా ఇల్లు - నా సొంత పనులని ఆగిపోక - ఊరూ, నేనూ ఉమ్మడిగానే సౌకర్యంగా, సజావుగా ఉండాలని తొమ్మిదేళ్ల తరబడీ దృఢ సంకల్పంతో ముందుకేగుతున్న స్వచ్ఛ కార్యకర్తల కన్నా ధన్యులెవ్వరు?

        ఈ సామూహిక శ్రమతో ఈ NH16 బత్తుల వారి ఇళ్ల దాక శుభ్రంగా, అందంగా కన్పిస్తున్నదిప్పుడు! ఐతే ఇక్కడికి దగ్గర్లోనే  - మొన్న మొన్ననే ఇంతగానూ బాగుచేసిన భారత లక్ష్మి వడ్లమర వీధి మొదట్లో ప్లాస్టిక్ వ్యర్ధ్యాల సంచులు పడి ఉండడం మాత్రం అభ్యంతరకరం!

   ఈ ఉదయం కూడ వర్షం తొంగి చూసి, కార్యకర్తల్ని పరామర్శించే వెళ్లింది.

    6.25 తరువాత సన్న చినుకుల్లోనే ధ్యానమండలి పక్షాన గోళ్ళ వేంకటరత్నం వినిపించిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతోనూ,

     బుధవారం కూడ ఇదే బందరు వీధి ప్రక్కన - చెరువు దగ్గర మనం కలుసుకోవలసి ఉంటుంది.

            కార్యాచరణంకావలె

ఏదో సాధిస్తామని ఎవరెవరో చెపుతుంటే

నమ్మే రోజులు కావివి - నమ్మించే దొక్కటే

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమదానాచరణం వలె

కనుల ముందు జరుగునట్టి కార్యాచరణంకావలె!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   17.09.2023.