2884* వ రోజు ....           18-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

వీధి సౌందర్యకారుల బరువు పనులు - @2884*

            సోమవారం (18.9.23) నాటి వేకువ సదరు కర్తవ్య దీక్షితులు నికరంగా 6 గురే గాని, నాబోటి ఒకరిద్దరం కూడ వేలు పెట్టాం. షరా మామూలుగానే రెస్క్యూ దళం పనివేళల 4.23 - 6.15; కార్యరంగం మరొక మారు గంగులపాలెం మార్గంలోని బండ్రేవుకోడు ఉత్తరం గట్టు!

            అచ్చటి 2 మహావృక్షాల ఆకృతులు ఈ కార్యకర్తలకు నచ్చినట్లు లేవు, పైగా తాడి చెట్ల ప్రమాణంలో పెరిగిన ఆ ఏడాకుల చెట్లు గాలికి విరిగి పడే పరిస్థితి కూడా ఉన్నది కనుక ఎంత కష్టమైనా తమకు నచ్చినట్లు వాటిని మార్చుకొన్నారు!

            2 గంటల శ్రమానంతరం ఇప్పుడవి కాస్త బోసిగా అనిపించినా, ముందుముందవి ఈ బాటకు మరింత శోభను తెస్తాయనే వాళ్ల నమ్మకం! అందుగ్గానూ నిచ్చెనలే ఎక్కారో, మర రంపమే వాడారో, కత్తుల్తో శ్రమించారో, అంతిమంగా మురుక్కాలవలో పడిన కొమ్మల్ని త్రాళ్ళు కట్టి రోడ్డుపైకి లాగి, ముక్కలు చేసి ట్రక్కులోకి చేర్చారో - ఆ కఠిన శ్రమకు నేనే ప్రత్యక్ష సాక్షిని!

            కార్యకర్తల కఠోర శ్రమ బహుముఖంగా ఎలా ఫలితాలిస్తున్నదో గమనిస్తూ  - ఆశ్చర్యానందాలనుభవించే మా బోటి వాళ్లదొక అదృష్టం!

            వినాయక పర్వదినకారణమేమో గాని ఒక గరిష్ట వయస్కుడైన డాక్టరూ, మరో ఇద్దరు కరుడు గట్టిన కార్యకర్తలూ ఈ పూట రాలేదు ఈ టీముల్లో క్రొత్తగా సభ్యత్వం పుచ్చుకొన్న సజ్జా ప్రసాద మహాశయుడే ఈ నాటి స్వచ్ఛ సుందరోద్యమ నినాద కర్త!

            నమ్మెదరా ఈ కృషిని?

ఎక్కడైన విన్నారా ఈ శ్రమదాన నిబద్ధత!

ఎన్నడైన కన్నారా ఈ ఉద్యమ విశిష్టత!

కత్తి మీద సామంటే కాదన గలరా దీనిని?

తొమ్మిదేళ్ల పయనమన్న నమ్మెదరా ఈ కృషిని?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   18.09.2023.