2885* వ రోజు ....           19-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

మరొక చక్కని శ్రమదాన సమచారం - @2885*

            ఈ మంగళవారం 19.9.23 వేకువ 4.28 కే పార్రంభమై 6.14 వరకూ ముమ్మరంగా జరిగిన శ్రమ ప్రదేశం మళ్లీ గంగులవారిపాలెం దిశగా బండ్రేవుకోడు కాల్వ ఒడ్డే! శ్రమకర్తలు నాతో సహా 7 గురు! పూర్తిగా సంస్కరింపబడిన చెట్లు 2!

            వేల రోజులుగా విసుగూ విరామం లేకుండ జరుగుతున్న వీధి పారిశుద్ధ్య - నవీకరణ కర్మ కాండను మరీ వివరంగా వర్ణింపనక్కర లేదు గాని క్లుప్తంగా నేటి శ్రమ విన్యాసాలివి:

- 2 చెట్ల ఎత్తైన కొమ్మ లెక్కేందుకు 2 నిచ్చెనలెక్కి (అందులో ఒక దాని బలం మీద నాకనుమానమొచ్చింది) ఇద్దరు కత్తుల్లో పనిచేస్తున్న దృశ్యం,

- ఆ కొమ్మల్ని కాల్వ ఒడ్డుకు లాగి, సైజులుగా నరికి, పనికొచ్చే భాగాల్ని విడగొట్టి, వ్యర్థాల్ని ట్రాక్టర్ లో పేర్చడం,

- ఈ పనిలోనే ఒక చిన్న శుభవార్తేమంటే - ఒక బలమైన ఎడం చేతి వాని కత్తి దెబ్బ నుండి ఇప్పుడిది వ్రాస్తున్న చేయి తృటిలో తప్పించుకోవడం,

-  వీలైతే వాట్సప్ చిత్రంలో చూడండి - నేటి వ్యర్ధాలు ట్రక్కు నిండి ఎంతెత్తుగా నిండినవో!

- ఆకులూ - పుల్లలూ బాట మీద పడి ఉంటే నచ్చక - ఇద్దరు ఆ 30 - 40 గజాల మేర ఊడ్చిం తరువాతే - బృందావన కార్యకర్త నాయకత్వంలో అందరూ స్వగ్రామ స్వచ్ఛ పరిశుభ్ర - సౌందర్య సాధక నినాదాలను పలికి - గృహోన్ముఖలయ్యారు!

            బుధవారం నాటి మన రెగ్యులర్ వీధి పారిశుద్ధ్య ప్రక్రియ నిమిత్తం విస్తృత సంఖ్యలో కలవదగినది బందరు రహదారికి చెందిన రామాలయం దగ్గరే!

            ఘర్మ ధారల నిత్యదానం

కార్యకర్తల శ్రమ విధానం, గ్రామ భవితకు కనే స్వప్నం

కలయదార్థం చేసుకొందుకు ఘర్మ ధారల నిత్యదానం

స్వార్థమును మెడపట్టి గెంటుచు సమాజానికొనర్చు సాయం

ఎవరినైన కదల్చకుంటే ఎంత ఘోరం - దురన్యాయం !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   19.09.2023.