2886* వ రోజు ....           20-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

గ్రామ కాలుష్యంపై పోరాటంలో త్రిముఖ వ్యూహం! @2886*

            బుధవారం (20-9-23) వేకువ 4.16 కే తొలి 10 మంది గుంపెడు కార్యకర్తలు బత్తుల వారి రామాలయం ప్రక్కన నిలవడమూ, అక్కణ్ణుంచి నిముష క్రమంలో మిగిలిన 14 మందీ వచ్చి కలిసి, పారిశుద్ధ్య పనులందుకోవడమూ, 3 చోట్ల ఎవరి శరీరాల్ని వారు అలయించి, 6.07 సమయం దాక గ్రామ సుస్థితి కోసం చాతనైనంత పాటుబడడమూ - టూకీగా గంటా ఏభై నిముషాల శ్రమదాన చరిత్ర!

వాలంటీర్లు శ్రమించిన 3 గ్రామ విభాగాలేవంటే:

1) గంగుల వారిపాలెం రోడ్డులో అలవి గాని పెరుగుదలతో, దట్టంగా క్రమ్ముకొన్న పచ్చదనంతో, క్రింద పూల మొక్కల ఎదుగుదలను నిరోధిస్తున్న 2 పెద్ద చెట్ల క్రమబద్దీకరణ 5 గురి ధ్యేయం కాగా -

            తొలుత ఒక ఒంటరి పోరాట యోధుడూ, తదుపరి అతడికి జతపడిన అదే వీధి కార్యకర్తా - కనీసం 10 గద్ద గోరు పూల మొక్కల్ని గుమ్మటాల్లాగా కత్తిరించిన తదేక దీక్ష!

2) నడుములు నొప్పెట్టి - చెమటలు దిగ్గారి గూళ్లరిగిన డజను మందిది రామాలయం ఎదుట చట్టుగా బిగిసిపోయిన 10 X2 గజాల జాగాలోని సిమెంటు ఇసుక దుమ్ము చోటే! 5 నిముషాలకొకమారు మంచి నీళ్లు త్రాగుతూ - బరువైన గునపాలతో - పారల్తో  - చెక్కుడు బరిసెల్తో - గోకుతూ, పొడుస్తూ లాగి డిప్పల్తో ట్రక్కులోకి చేరుస్తూ అక్కడ జరిగినదే గ్రామ కాలుష్యాల మీద అసలు సిసలు యుద్ధం!

            అది పనికిమాలిన వ్యర్థమేం కాదు - ఆ మట్టీ - ఇసుకా సిమెంటు మిశ్రం సాగర్ టాకీసు మూలమలుపులో కేంద్ర జల పథకం వారు త్రవ్వి నెల రోజుల్నాడు పూడ్చక వదిలేసిన గుంటల పూడికకు పనికొచ్చింది మరి!

            మిగిలిన కార్యకర్తల్లో ఇద్దరు కత్తుల్తో మురుగ్గుంటల ప్రక్క పిచ్చి మొక్కల్నీ గడ్డినీ తొలగిస్తుంటే

- తక్కిన వాళ్లకు చీపుళ్లతోనే పని! రైసు మిల్లు రోడ్డు మొదలు కమ్యూనిస్టు వీధి దాక 2 ప్రక్కలా ఊడ్చి ప్రోగు చేసిన దుమ్ము ఇవాల్టికలాగే మిగిలిపోయింది - లోడింగుకు సమయం చాల్లేదు!

            ఒకవంక తోటివాళ్లకు పయోగపడాలనే సద్భావన కుంచించుకుపోతున్న అన్నీ నాకే, నావే అనే స్వార్థం బలిసిపోతున్న ప్రస్తుత సమాజనికిక్కడ దశాబ్ద కాలంగా జరుగుతున్న సామాజిక బాధ్యతా చింతనా, దాని ఆచరణా మార్గదర్శకాలు కావాలి! ప్రతి వేకువా 50 - 60 పని గంటల శ్రమదానం ఎందుకు జరుగుతున్నదో సోదర గ్రామస్తులు ఆలోచించాలి.

            అసలీ శ్రమదానానికి మూల స్తంభమనదగ్గ పర్యవేక్షక కార్యకర్త ఈ ఉదయం కొంత అస్వస్తత వల్ల రాలేదు!

            6.20 వేళ ఏ నెల రోజుల తరువాతనో పునరంకితుడైన శివబాబు ముమ్మార్లు ప్రకటించిన ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతోనూ అడపా గురవయ్య ప్రవచిత సూక్తి ముక్తావళితోనూ నేటి వీధి పారిశుద్ధ్యం విజయవంతంగా ముగిసింది!

            ఇదే బందరు రహదారి మెరుగుదల కోసం రేపటి వేకువ కూడ మనం కలసి కదం త్రొక్కవలసిన చోటు కమ్యూనిస్టు వీధి ఎదురుగా వర్థన్ సిమెంటు దుకాణమే!

            అవాక్కవుదురు ఎవ్వరైనా

క్రమం తప్పని కార్యకర్తల కాయకష్టం వచ్చి చూస్తే -

మురికి బట్టల, చెమట ధారల మూలకారణమును గ్రహిస్తే

స్వచ్ఛ సుందర ఉద్యమంబును సరిగ్గా పరిగణన చేస్తే

అవాక్కవుదురు ఎవ్వరైనా మహాశ్చర్య నిమగ్ను లౌదురు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.09.2023.