2887* వ రోజు ....           21-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

నేటి శ్రమదానం 2887* వది!

            21-9-23 (గురువారం) కృషి కూడ బందరు – NH-16 వీధిలోనే ప్రధానంగా జరిగింది. నిన్నటి తరువాయిగా - అంటే కమ్యూనిస్టు వీధి మొదలు యడ్ల వారి వీధి వరకూ ఆ వీధి చెప్పుకోదగ్గంతగా శుభ్రపడింది. నికర కార్యకర్తలు 16 మంది,  నాబోటి ఒక మోస్తరు శ్రమదాతలిద్దరూ సదరు శుభ్రతా సంపాదకులు!

            గంగులవారిపాలెం రోడ్డులోనూ ఈ వేకువ 8 మంది పనిమంతులు తమ తమ నిర్దేశిత బాధ్యతలు చూసుకొన్నారు – 3గ్గురు గద్దగోరు పూల మొక్కల్ని శిల్పాకృతులుగా కత్తిరించడమూ, ఐదుగురు ఇంకొంచెం దూరంగా, ఇంకాస్త బండ పనులు – 3 పెద్ద చెట్ల సుందరీకరణం చూసుకోవడమూ.

            నేటి మరొక 10 అడవి తంగేడు మొక్కల కళాకృతులతో కిలో మీటరు పైగా రహదారి రెండు ప్రక్కలా అందంగా, అణకువగా వందలాది రంగురంగుల పూల చెట్లతో - దట్టమైన చిక్కని పచ్చదనంతో ఎంత ఆహ్లాదంగా ఉన్నదనీ!

            అక్కడ బందరు వీధిలో వేకువ 4.17 కుమొదలైన వీధి దుమ్ముదులిపే మహత్కార్యం - 6.06 కు పని విరమణ ఈల మ్రోగినా - ఐదారుగురి అయిష్టత వల్ల - 6.12 కు గాని ఆగలేదు! వీధి కాలుష్యం మీద వాళ్ల కసిని చూసి, పోలీస్ వీధి దాక వెళ్తారనుకొన్నాను గాని –

            ముత్యాల చంటి వీధి మొదటి 10 గజాలు ఆరేడుగుర్ని అక్కడ ఆపేయడంతో – రెండు ప్రక్కల డైన్ల గడ్డీ, మొక్కలు తొలగిస్తూనూ - ఆక్రమిత పాత ఫర్నీచర్ దుకాణం దగ్గర పేరుకొన్న దుమ్నూ - ఇసుకా ఊడుస్తూనూ సమయం గడిచి పోయింది!

            “ఫలితం సంగతి నా కొదిలేసి, నీ కర్తవ్యం నువ్వు పాటించుకో...!” అని గీతాచార్యుడు అర్జునుని వంకతో అన్ని కాలాల వారినీ ప్రబోధించాడంటారు. మరి - మనిషి బాధ్యతలేమో - కుటుంబ, సామాజికపరంగా ఉంటాయని పెద్దలు సెలవిస్తారు! అందులో రెండవది తొమ్మిదేళ్లుగా నెరవేరుస్తున్నదైతే - ఈ స్వచ్ఛ కార్యకర్తలే!

            6.20 పిదప తుది సమావేశంలో - కోడూరు వేంకటేశ్వరుడు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాల్ని గట్టిగా దబాయించే ముందు సభికులు 28 మంది కనిపించారు! ఈ శ్రమదానోద్యమ మూలతత్త్వం సంగతేమో గాని - ఇదొక సందడిగా మాత్రం అటూ - ఇటూ పనుల మీద తిరిగే వారికనిపిస్తుండవచ్చు!

            రేపటి వేకువ మన స్వయం విదిత కర్తవ్య పాలన కోసం మనం కలువదగిన చోటు బృందావన, సజ్జాప్రసాదు తదితరులచే పోలీస్ ఠాణా వీధి వద్దగా నిర్ణయించబడింది!

            నిర్లక్ష్యం నీడలోన

నిర్లక్ష్యం నీడలోన నిస్తేజపుపు ఆకృతితో

హరిత రహిత వీధుల్లో బహిరంగ విసర్జనతో

మురుగు కంపు ఉరవడితో పరువు తీసుకున్న ఊరు

ఇంత దర్శనీయముగా ఎట్లు మారిపోయెనొ గద!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.09.2023.