2888* వ రోజు ....           22-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

అర్థంతరంగా ముగిసిన 2888* వ నాటి శ్రమదానం!

            భాద్రపద శుక్రవారం (22.9.23) వేకువ 4.15 - 5.00 నడుమ గంగులవారిపాలెం బాట - బండ్రేవుకోడు కాల్వ వద్ద జరిగిన ప్రయత్నమది! కార్తకర్తలు కేవలం డజను మంది! జరిగినది పట్టుమని ముప్పావు గంటైనా లేదు.

            వాన మంచిదే కావచ్చు గాని - స్వచ్ఛ కార్యకర్తల చిరకాల పరిచితుడే గాని వాళ్ళు నాటి, పెంచిన 30 వేలకు పైగా చెట్ల అవసరం దృష్ట్యా సానుకూలుడే గాని - సరిగ్గా వేకువ 4.40 కే ఠంచనుగా వచ్చి వాలాలా?

            ఈ వేకువైతే అతగాడు ఏమైనా సరే - కార్యకర్తల్తో అమీతుమీ తేల్చుకోవలసిందే!అనే దృఢ నిర్ణయంతోనే కనిపించాడు. అక్కడికీ వాన శీలాన్ని శంకించి పాతిక ముప్పై మందికి బదులు డజను మందే కార్యక్షేత్రానికి వచ్చారు.      

            తక్కిన అందరం తలకు టోపీలతో, సాధ్యమైనంత తడవకుండా చూసుకుంటున్నాం గానీ, ఒక మొక్కల సరఫరా దారుడు మాత్రం నిలువునా వానలో తడుస్తూ బాగా ఆనందించడం గమనించాను.    

            ఇక అప్పుడు 4:45 కు విరుచుకుపడిన వర్షం ఉరుములూ - మెరుపులూ కార్యకర్తల పనుల్ని ఎక్కడికక్కడ ఆపేశాయి!

            క్రింద బురద నీళ్లూ, పైన ఎడతెగని వాన ఇంకా అక్కడ పని సాగదని నిర్ణయించుకొని తిరిగి వచ్చేశారు

            ఐతే అప్పటికే ఒక సుందరీకర్త కాల్వ వంతెన - బైపాస్ మార్గాల నడుమ కొన్ని పూల మొక్కల్ని తీర్చిదిద్దాడు, నలుగురు ఆ తడిలోనే కొడవళ్లతో గడ్డి తీసి, పూల మొక్కల పాదులు సంరక్షణ చేశారు!

            స్వచ్ఛ కార్యకర్తలనే ఏముంది - పగలనకా, రాత్రనకా ఎందరు రైతులు ఎర్రని ఎండలో, వాన ముసురులో పని చేయడం లేదు!

            రేపటి వేకువ శ్రమదాన స్థల నిర్ణయం కోసం ఈ సాయంత్రం మన వాట్సప్ సందేశానికి నిరీక్షించండి!

            చాటి చెప్పు సత్యమదే!

ఎంత గొంతు చించుకొన్న ఏ ఏ నటనలు చేసిన

పత్రికలో - టీ.వీల్లో ప్రచారాలు పెంచినా

కావలసిందొక్కటే - అది కార్యాచరణం మాత్రమె

స్వచ్ఛోద్యమ చల్లపల్లి చాటి చెప్పు సత్యమదే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.09.2023.