2889* వ రోజు ....           23-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!

2889* వ రోజుకు చేరిన శ్రమదాన వీరు!

            ఆ చేరిక శనివారం (23.9.23) నాటిది, శ్రమ ప్రదర్శనం గ్రామ ప్రధాన వీధికి బదులు వాన దేవుడి మీద అనుమానం వల్ల - గంగులపాలెం వీధిలో మురుగు కాల్వ దగ్గరే! పని ఘడియలు 4.17 to 6.05 AM! శ్రమదాతలు 24 మంది!

            నిజం చెప్పాలంటే - అసలీ వీధిలో ఈ వేకువ బాగు చెయ్యవలసిందేమీ లేదు, ట్రిమ్ చేసిన వందలాది పూల మొక్కల్తో, పచ్చగా - ఠీవిగా బారులు తీరి ఒద్దికగా నిల్చిన డజన్ల కొద్దీ చెట్లతో, సెల్ఫీ పాయింట్ తో, ఆహ్లాదకరమైన నీళ్ల ఫౌంటైన్ తో, ఉదయ - సాయం సంధ్యల్లో మంద్ర - మృదు - మధుర సాత్త్విక సంగీతాలతో, అత్యంత సుందరీకృత వీధి ఇది!

            దీని గతం కాని, వర్తమానం కాని గ్రామ చరిత్రలోనే ప్రత్యేకం! కాకపోతే - బందరు వీధిలో తడి రోడ్డును ఊడ్వడంకన్నా ముందనుకొన్నట్లు నిన్నటి లాగే వాన వీరుడి ప్రతాపాన్ని ఊహించుకొని - ఈ వీధి నెంచుకొన్నారు! లేదంటే - ఈ బజారుకన్న జరూరుగా బాగుచేయదగిన వీధులుండనే ఉన్నాయి!

మరి - ఈ శుభోదయాన రెండు డజన్ల మంది ఈ 200 గజాల వీధికి చేసిన మేలేమిటి?

1) కత్తుల వాళ్లు నలుగురు బాటకు దక్షిణాన అంతకు ముందు రోజుల్లో నరికి రోడ్డుకు, దన్నుగా వేసిన కొమ్మల్ని సైజుల్లో నరికి పేర్చడం,

2) రోడ్డుకు ఉత్తరాన - అనువైన వాతావరణం వల్ల వారం రోజుల్లోనే మళ్లీ పెరిగిన గడ్డినీ, మొక్కల్నీ, ఇతర వ్యర్థాల్నీ తొలగించడం,

3) ఇక రోడ్డును చీపుళ్లతో ఊడ్చే వాళ్ల సంగతి చెప్పేదేమున్నది? అసలే పచ్చని పొలం ప్రక్కన అందంగా ఉన్న బాటను అలవాటుగా - అలవోకగా శుభ్రపరిచారు,

4) ఒక వ్యాపారీ, మరొక రైతూ రోడ్డు మార్జిన్లలో ఇంకా ఏమైనా చేయదగ్గ పనులున్నాయా అని దుర్భిణీ వేసి చూశారు,

5) ఒకరిద్దరం మాత్రం 2013 లోనే స్వచ్చ సంకల్పం వల్ల దీనికి పట్టిన అదృష్టాన్నీ, గంటన్నర కాలంలో 20 మందికి పైగా నిస్వార్థ శ్రమదానం చేస్తున్న కమనీయ - రమణీయ దృశ్యాన్నీ ఆనందించాం!

            వానదేవుడీ వేకువ బాగా బుద్ధిమంతుడైపోయి, కార్యకర్తల జోలికే రాలేదు.

            6.25 కు వీధి మలుపులో జరిగిన సరదా - సమీక్షా సభలో;

- వేముల పాండు రంగ వ్యాపారి జన్మదినం పురస్కరించుకొని, అతని సోదరుడు షణ్ముఖ శ్రీనివాసుడు స్వచ్చోద్యమానికి 1000/- ఆర్థిక సహకారమూ,

- వడ్రంగి పని నిపుణుడైన సాధనాల సతీష్ ముమ్మారు కావించిన గ్రామ స్వచ్చ - సుందరీకరణ ప్రతిజ్ఞలూ, (ఇదే పనిని నిన్న నెరవేర్చిన వారు మట్టా మహాలక్ష్మి నర్సు!)

            రేపటి వేకువ వాన వెంటాడకపోతే పోలీసు ఠాణా వీధి మొదటా - చినుకులు పడితే బైపాస్ వీధిలోని - ఒకప్పటి కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి వద్దా కలువాలనే నిశ్చయమూ!

            ఏఊరైతే నేమిటి?

ఏఊరైతే నేమిటి - ఏహ్యతలను పెంచు పనికి

ముఖ్యంగా మొగదలలో ముంచెత్తే గుట్టలకి

ఒక శాతం ఊళ్లందుకు ఉజ్జాయింపుగ దూరం

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సాధన మాత్రం పూర్ణం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.09.2023.

షణ్ముఖ శ్రీనివాసుని విరాళం