2892* వ రోజు ....           26-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

ఇవీ 2892* వ నాటి రెస్క్యూ దళ సేవలు!

            మంగళవారం 4.25 నుండి 6.08 నిముషాల దాక నిరాటంకంగా జరిగిన సదరు వీధి పరచర్యలు 5+2 మందికి చెందినవి. సంఘటనా స్థలం నిన్నటిదే – ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్మించిన NH-16 ఉపరహదారిలో – బండ్రేవు కోడు పెద్ద వంతెన వద్దనే!

            పని స్వభావం కూడ నిన్నటిదే - రహదారి ఉత్తరంగా 12 అడుగులు ఎడంగా - గతంలోవి కాక మళ్లీ నాటబోయే మొక్కలకు మార్కింగన్నమాట! మరి - చక్కగా తక్కిన జనం లాగ నిద్రపోక -3 ½ కే మేల్కొని, 4:20 కే అక్కడికి ఈ కార్యకర్తలేల చేరుకోవలె?

            ఊరికి దూరంగా ఉన్న రహదారితో వీళ్ళకేం పని? అంటే – అది వాళ్ల ఊరి ప్రక్కగా పోతున్నది, అక్కడికీ రహదారి నిర్మాతలే వాళ్ల నిబంధనల ప్రకారం – బాట కిరు వంకలా కొన్ని చెట్లునాటినా – ఈ కార్యకర్తలకదిచాలక - వారి అనుమతులు పొంది - ఇప్పటికే నాటిన సుమారు 1600 పూల మొక్కలు కాక - అదనంగా ఇప్పుడివీ!

            రోడ్డుకు దక్షిణంగా – 2 నెలల నాడు 30 మంది ప్రముఖ వైద్యులు నాటిన చెట్లిప్పుడు ఏపుగా - గుబురుగా పెరుగుతున్నవి. నిన్నా నేడూ కార్యకర్తలు బురదలో దిగి, మార్కింగ్ చేసినవి 58+27 అని వాళ్లు లెక్కిస్తుండగా తెలిసింది?

            కనుక - ఈ కార్యకర్తలది హరిత – పరిశుభ్రతా వ్యసనమో - తమ చల్లపల్లి మిగిలిన ఊళ్ల కన్న ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉండాలనే అభినివేశమో – వేలం వెర్రో - అది చిరకాలం నిలబడాలనే కోరుకొందాం!

            6.25 కు వీరు తూములూరి లక్ష్మణుడిననుసరించి గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు చేశారు.

            రేపటి శ్రమదానం కోసం మనం చేరవలసింది – వర్షం లేనిచో పోలీస్ ఠాణా వీధి, ఉన్నచో కస్తూర్భ ఆస్పత్రి వద్ద.    

            ఉత్తుత్తి కబుర్లతోనె

సుద్దులెన్నొ చెప్పుకొన్న - పెద్ద ప్లాన్లు గీసుకొన్న

ప్రయత్నమెంత చేసిననూ - రాద్ధాంతం నెరపిననూ

దినదినమేబది గంటల తీవ్ర శ్రమ దానం వలె

ఉత్తుత్తి కబుర్లతోనె ఊరికి మేలొన గూడున?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.09.2023.