2893* వ రోజు ....           27-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా!

మరొక శ్రమదాన వైభవం - @2893*

            బుధవారం (27.9.23) నాటి వేకువ 4.10 సమయం సంగతది! కేవలం 24 మంది తమ ఊళ్లోని ఒక - బైపాస్ వీధిలో - తమ బ్రహ్మకాల సుఖ నిద్రను వీడి - 150 గజాల నిడివిలో - రకరకాలుగా పాల్పడ్డ వీధి పారిశుద్ధ్య చర్యలు!

            ఊరు క్షేమంగా స్వస్తంగా ఉంటే తప్ప తాము సైతం నింపాదిగా ఉండలేమనే ఇంగిత జ్ఞానం వాళ్లది! తక్కిన గ్రామస్తుల్లాగా వీధుల దుమ్మూ, ధూళీ, రోడ్ల మార్జిన్లలో ఎండు పుల్లల, చివికిపోతున్న తాటాకులు, వానలకు హద్దూ పద్దూ లేక పెరిగిపోతున్న పిచ్చి మొక్కల - పచ్చికల, తుక్కులడ్డుపడి అడుగు ముందుకుపడిన మురుక్కాల్వల, గుంటలు పడుతున్న రోడ్ల దుస్థితిని గాలికొదిలేయని బలహీనత వాళ్లది!

            గ్రామ భాగాల్ని పరిశీలిస్తూ - ఎక్కడ ఏమరామత్తులు ఏ వేకువ చేయాలో ముందస్తు ప్రణాళికలతో - సాధన సంపత్తిలో - అక్కడ వాలిపోయి, విడివిడిగా - ఉమ్మడిగా జరుగుతున్న శ్రమ వేడుక తప్ప - ఉబుసు పోకగా - కాలక్షేపంగా, ప్రజల గుర్తింపు కోసం వెంపర్లాడే ఆషామాషీ శ్రమదానం కాదిది!

            ఏడెనిమిదేళ్ల తరబడీ తన పిల్లల్ని వదలి ఈ ఊరి కంకితుడైపోయిన ఒకానొక శాస్త్రి గారు గాని,

            పొరుగూళ్ల నుండి ఠంచనుగా 4.11 కు వచ్చి మురికి పనులకు దిగే కార్యకర్తలు గాని,

            వృత్తిపరంగా తలమునకలుగా క్షణం తీరిక లేని వైద్యులు, విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగులు గాని,

            ఈ భూమ్మీద ఇంత నిస్వార్థ సామాజిక కృషికి ఎక్కడైనా పూనుకొంటున్నారో చెప్పండి!

అదలా ఉంచి నేటి శ్రమదాన ప్రత్యేకతలేమంటే :

- 24 మంది సుమారు 40 పని గంటలు చిత్తశుద్ధితో చేసిన కృషి,

- తత్కారణంగా దింటకుర్తి వారి ఇల్లు మొదలు - మెండు వారి నివాసం దాకా ఉప రహదారీ, అందలి ఉద్యానాలూ, ప్రభుత్వాస్పత్రి ముందరా, సూరి డాక్టరు యడ్ల - కబేళా బజార్ల జంక్షన్లు చక్కగా మెరుగుపడ్డ వైనం,

- గణేష్ ప్రెస్ వారి ఇంటి ముందూ, అస్పత్రి గేటు దగ్గరా ప్రోగుబడ్డ కొమ్మల గుట్టల తొలగింపు,

- ఇంకా చీపుళ్లతో 150 గజాల వీధికి జరిగిన సన్మానం,

            ఆస్పత్రి గోడ వెలుపలి రేకుల షెడ్డు మీది ఎండూ పచ్చి కొమ్మల్నీ, తుక్కునీ నిచ్చెన పైకెక్కి ఒకాయన దించడంలో చొరవా,

            అన్నిటికన్నా 6:00 సమయంలో - కబేళా వీధి మలుపు దగ్గర పెద్ద తుక్కు గుట్టను 10 నిముషాల్లోనే ఆరేడుగురు డిప్పలకెత్తి, ఎత్తైన ట్రక్కులో నింపిన దృశ్యమే చూడదగ్గ శ్రమ వేడుక!

నేటి కృషి సమీక్షా సమయంలో :

1) శంకర శాస్త్రి గారు మూడు నెలల పిదప శ్రమదానోద్యమ పునఃప్రవేశాన్ని కార్యకర్తలు నిండు మనసుల్తో స్వాగతించడమూ,

2) ఇక తన వంతుగా శాస్త్రీజీ 10 వేలు వ్రాయబోయి, అలవాటుగా ఐదే వేల చెక్కు విరాళంగా వ్రాయడమూ 

3) అడపా గురవయ్య గారి పప్పు చెక్క వితరణా, అతగాడు గుర్తు చేసిన రోజు వారీ సూక్తులూ

4) ఒకప్పటి భుజం నెప్పి మాని బరువు పనులు చేస్తున్న పసుపులేటి సత్యం గారి స్వచ్చ సుందరోద్యమ నినాదాలూ....

            ప్రభుత్వాస్పతి పరిసర సంస్కరణం కోసం రేపటి వేకువ కూడ మనం శ్రమించవలసింది శిథిల కస్తూర్బాయి ఆస్పత్రి భవనాల వద్దనే!

             ముక్త సరిగా

ముక్త సరిగా వ్రాయదగినవి మూడు సంగతు లిచ్చటన్

స్వచ్ఛ - సుందర చల్లపల్లికి శోభ తెచ్చిన వేవనన్

మొట్టమొదటిది శ్మశానం, రెండవది గంగులవారిపా

లెం బజారూ, కమ్యునిస్టుల వీధిగా అవి తేలెడిన్.

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.09.2023.

శంకర శాస్త్రి గారి విరాళం