2894* వ రోజు ....           28-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా!

2900* నాళ్లకు దగ్గరగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం!

            ఇవాల్టి శ్రమదానం మాత్రం 2894* వ నాటిది 28.9.23 గురువారమన్నమాట! 24 మందిమి వేకువ కర్మక్షేత్రం మాత్రం - అడపాదడపా 2-3 చోట్ల జరిగినా - ప్రధానంగా బైపాస్ వీధిలోని ప్రాత - శిధిల - కస్తూర్భా ప్రభుత్వాస్పతి ప్రవేశ ద్వారమే!

            ఇంకొక సవరణేమంటే - అసలది ఏనాడో ఏదాతో దానమిచ్చిన ముప్పాతిక ఎకరంలోని కట్టడాలకు ముఖద్వారంగా కనిపిస్తే గదా! ఏ గృహస్తులో ఒకటి - రెండు నెలల్లో వేసిన రకరకాల వ్యర్థాల్తో 2 - 3 అడుగులెత్తున - 15x40 అడుగుల వైశాల్యంతో క్రిక్కిరిసిపోయింది గదా!

            సైజులుగా కోసిన 15-20 కొబ్బరి చెట్ల కాండాలూ, ప్లాస్టిక్ గాజు సీసాలూ, లోపలే ఛండాలమున్నదో తెలియని గోనె సంచులూ, మూటలూ..... ఇంకా ఏ పెన్నిధులున్నవో వంగి చూడలేదు గాని, స్వచ్ఛ కార్యకర్తలందులో కాలు పెట్టగానే గుప్పుమని దుర్గంధాలు! - రోడ్డున పోయే వాళ్లక్కూడా! కార్యకర్తలకైతే గంటన్నర పాటు - ఆ కంపే ఇంపు గాను, చెమటకు తడిసిన బట్టల మీద మరకలే మహా సొంపుగాను మారిపోయినవి!

            మరి 35 గంటల పనితో అక్కడేం జరిగిందంటే: ముందుగా ఎండు పుల్లలూ, తరవాత మూటలూ, సీసాలూ, చెట్ల పచ్చి కొమ్మలూ, చివరికి కొబ్బరి చెట్ల కాండాల ముక్కలూ ట్రాక్టర్లోకి చేరి - అందులోంచీ కంపు బయల్దేరి, అప్పటికే 6.10 పని వేళ ముగిసి, ఇంకొన్ని వ్యర్ధాలు మిగిలాయి,

            ఇక విద్యుత్తీగల జోలికి పోతున్న కొన్ని చెట్ల కొమ్మల్ని శిక్షించే నిపుణుడొకాయన ఒకరిద్దరి సాయంతో తీరిక లేకుండా గడుపుతుంటే

            ముగ్గుర్నలుగురు చీపుళ్లతో బైపాస్ బాటను ఊడుస్తుంటే - ఇక్కడి మినీ డంపింగ్ సృష్టించిన వారు మాత్రం తలుపులే తీయకుంటే నిచ్చెన మీదుగా త్రాళ్ల సాయంతో బరువైన కొబ్బరి చెట్ల కాండం ముక్కల్ని ట్రాక్టర్ మీదికెక్కించే క్రమంలో ఒకరిద్దరు ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడిన మాట వాస్తవం!

6.20 వేళ - నేటి ఆఖరి సమావేశంలో:

1) ఉదయ శంకరశాస్త్రి గారు ముమ్మారు పలికిన ఉద్యమ సారాంశ నినాదాలూ, ఆయన స్వరంలో హెచ్చు తగ్గులూ,

2) నేటి కంపు పనులు కష్టం పట్ల DRK గారి ఆశ్చర్యానందాలూ,

3) గురవయ్య గురువరేణ్యుని ప్రవచనాలూ కాక

            రేపటి వేకువ కూడ ఇదే బైపాస్ వీధి శిథిలాస్పత్రి ముఖద్వారం బాగుచేయడమే కర్తవ్యమనే నిర్ణయమూ...

            స్వచ్ఛోద్యమ సారధ్యం

సాహసించి అడుగేసిన స్వచ్ఛోద్యమ సారధ్యం

అనుసరించి, అధిగమించు స్వచ్ఛ సైన్య బలగం

ప్రతి వేకువ సృజన శీల ప్రగతి శీల ప్రయత్నం

చల్లపల్లి వీధులన్ని సౌందర్య ప్రపూర్ణం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.09.2023.