2895* వ రోజు ....           29-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా!

బైపాస్ వీధిలోనే 2895* వ శ్రమదాతృత్వం

            ఈ శుక్రవారం (29.09.2023) వేకువ 4.13 కే కాలుష్యం మీద సమరం మొదలయింది. అది కూడా వరసగా మూడవ నాడు మళ్ళీ కస్తూర్భాయి స్మారక ప్రభుత్వాసుపత్రిలోనే.

            అందులో ఆరేడుగురు తప్ప మిగిలిన 16 మంది చేతుల్లో గొర్రు, గునపం వంటి ఆయుధాలు, ముఖాల్లో, కళ్ళలో కసి, పట్టుదల! ముందుగా కడమ ఐదారుగురి పరిస్థితి చూద్దాం. వాళ్ళు నిచ్చెన, కత్తెర్లు, కత్తులతో నిన్న మొన్నటి వలెనే నాలుగైదు చెట్లకు మంచి క్రాపులు వేశారు. (పని పూర్తయ్యాక క్షురకుడు తలను, మెడను దులిపినట్లే ఈ కార్యకర్త కూడా చెట్లను దులపడం గమనించాను)

            చీపుళ్ల మహిళలు, సీనియర్ వైద్యుడు బాటను, మార్జిన్లను ఊడ్వడం షరామామూలుగానే జరిగిందని వేరే చెప్పాలా.

నేను వ్రాసినా – మీరెవరైనా తీరిక చేసుకుని వచ్చినా అందరం అవశ్యంగా చూసి తీరవలసిన దృశ్యం ఇప్పుడు వివరిస్తాను:

            మనమైతే ఆ పని వద్ద గనుక నిలిస్తే ఆ కంపుకు ముక్కులు మూసుకోవలసిందే. స్థలం చిన్నదే – శిధిల ప్రభుత్వాసుపత్రి గేటు లోపల 7 – 8 గజాలే కానీ వాళ్ళు త్రవ్వింది,  బలంగా లాగింది ఏ 60 – 70 డిప్పలో నింపి ట్రాక్టర్లో నింపింది రెండు ట్రక్కులకు సరిపడా కాలుష్య దరిద్రాలు!

            ప్రతి రోజూ దగ్గరగా ఉండి కళ్ళారా చూస్తున్న నాకే గ్రామంలోని ఒక వీధిలో ఇన్ని వ్యర్ధాలు ఉంటాయని – వాటిని కదిలిస్తే ఇంతటి ప్రగాఢ దుర్గంధం చెలరేగుతుందని తెలియకపోతే నేనిలా రాస్తున్నది చదివితే నమ్మెదరో లేదో!

            మరి ఈ కార్యకర్తలు కాక మన సమకాలంలో ఛాంపియన్స్ ఇంకెవరు? సరే ఎలాగైతేనేం - ఆస్పత్రి వెలుపల ఉత్తర భాగం, ప్రవేశద్వారం ఇప్పుడు మళ్ళీ ఒక స్వచ్ఛ గ్రామంలోనిదే అని నమ్మకం కలిగింది.

            నేటి కార్యక్రమాన్ని సమీక్షించిన మన స్వచ్ఛ వైద్యునిది కూడా కార్యకర్తల కఠోర శ్రమ పట్ల ఇంచుమించు ఇదే అభిప్రాయం.

            ఈ వీధికే చెందిన గణేష్ ప్రెస్ యజమాని రాధాకృష్ణకు స్వచ్చ కార్యకర్తల తరపున తాతినేని రమణ ఒక పెద్ద బంగినపల్లి మామిడి చెట్టును బహూకరించారు.

            రేపటి వేకువ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మామిడి మొక్కల్ని నాటుటకు గాను కలుసుకోదగింది గంగులవారిపాలెం దగ్గరి NH-16 బందరు ఉపమార్గంలోనే!                               

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.09.2023.