2896* వ రోజు ....           30-Sep-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

పండ్ల మొక్కల అమరిక - @ 2896*

          శనివారం (30-9-23) వేకువ కూడ మరొకమారు గంగులవారిపాలెం వీధి ముస్తాబులోనే గడిచింది. రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తలు 23 మందే గాని, శాయి-భవఘ్ననగర్ ల నుండి కాస్త ఆలస్యంగానైనా 12 మంది కూడికతో బండ్రేవు కోడు కాలువ గట్టు రోడ్డు మీద సందడి ఇనుమడించింది.

ఈ ఉదయం విశేషమేమంటే -

1) తులనాత్మకంగా చూస్తే మహిళాధిక్యత  

2) 22 ముదురు మామిడి మొక్కల నాటుడు కోసం గోతులు త్రవ్వి, ఇసుక - సేంద్రియ ఎరువు - సేంద్రియ క్రిమి నిరోధక వేప పిండిని పోసి, నీరు పోసిన పన్లు,

3) మొక్కలు నాటని మిగతా కార్యకర్తలు? వాళ్లేమీ చేతులు ముడుచుక్కూర్చోలేదు - బాట మొత్తాన్ని ప్లాస్టిక్ రహితంగా, మొక్కల పాదుల్ని పచ్చిక రహితంగా, దుమ్మూ ధూళి విముక్తంగా మార్చారు,

4) ఇద్దరు మాత్రం కార్యకర్తలకు పనిముట్లనందిస్తూ, మంచి నీళ్లను సరఫరా చేస్తూ తిరుగుతున్నారు,

5) ఐదారుగురేమో అక్కడక్కడా పూల చెట్లకు సోకులు చేస్తూ ఆనందించారు.

6) నాకైతే - ఇన్ని రకాల మానవ శ్రమను నేత్రపర్వంగా చూడడమూ, పని వేళ ఎవరి ముఖాల్లో ఎంత పట్టుదలా, సంతృప్తీ నిండి ఉన్నాయో ఆలోచించడమే సరిపోయింది!

          ఒక అంచనా ప్రకారం - మొక్కల కొనుగోలు 10,000/-,  బలం ఎరువూ, చీడ ఎరువూ, ఇసుకా వగైరాలు 5,000 ఖర్చు కావచ్చు!  కార్యకర్తల కష్టం లెక్కించాలంటే హీన పక్షం ఐదారు వేలు! ఇంత వేకువ సమయాన ఊరి ఆహ్లాదం పెంపుకు ఈ 35 మంది ప్రదర్శించిన స్ఫూర్తిని ఎలా కొలువగలం?

          మొత్తానికి సుమారు 2 నెలలుగా - కిలోమీటరు వీధి సౌందర్యం కోసం కార్యకర్తల ప్రయత్నం 99% పూర్తయినట్లే! అందుకే నేటి సమీక్షా కాలంలో అందరి మాటల్లో, వదనాల్లో ఆ సంతృప్తి ప్రతిఫలించింది.

          ఆ ఊపులోనే ఒక పౌర శాస్త్రోపన్యాసకుడు - వేముల శ్రీనివాస్  చల్లపల్లి గ్రామ స్వచ్ఛ - సౌందర్య ప్రతిజ్ఞా నినాదాలను వేగంగా దంచి కొట్టాడు!

- ఇందరి సామూహిక కృషి ఫలిస్తే సమీక్షకుని సంతోషం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా?

తనకోసం, తన కుటుంబం కోసం పనిచేస్తే అది తన బాధ్యత!

ఊరంతటి సౌకర్యం కోసం అందరం కలిసి శ్రమిస్తే అది ఊరి వేడుక!

          రేపటి ఉదయం స్వచ్ఛ కార్యకర్తలూ, పంచాయితీ కార్మిక సిబ్బందీ కలిసి పూనుకోదగింది RTC బస్ ప్రాంగణ పారిశుద్ధ్యమని తీర్మానించారు!

        ఊహే కడు సుందరం

ఊరి మేలె తమ మేలను ఊహే కడు సుందరం

సేవలేమొ స్వచ్ఛందం శ్రమదానం ఐచ్ఛికం

 ప్రతి ఫలితం శ్రమతోనే రాగలదను ఇంగితం

రాగ ద్వేష రహితంగా గ్రామ హరిత తోరణం !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.09.2023.