2897* వ రోజు....           01-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

                               ఇది 2897*వ నాటి శ్రమ వేడుక !

          అసలే ఆదివారం- (1-10-23), ఆపైన పంచాయతీ కార్మికుల సమ్మేళనం- ఎన్నాళ్ల నుండో షణ్ముఖ శ్రీనివాసాది కార్యకర్తల నిర్ణయం - నాలుగైదు నెలలుగా శుభ్ర పరచ వీలు పడని RTC బస్ ప్రాంగణం -  దానికి తోడు “ స్వచ్ఛతేసేవ”  సందర్భం!  ఇన్ని కలిసి వస్తే ఇక చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమదానం ఏ స్థాయిలో ఉంటుంది?

 

          యధా ప్రకారమే పాతిక మంది అంకిత భావంగలకార్యకర్తలు - మరో 23 మంది పంచాయతీ సిబ్బంది,అధికారులు, పాత్రికేయులు - ఇంకా పాతిక మంది ప్రయాణిక ప్రేక్షకులు, అర్థరాత్రి నుండి మ్రోత మ్రోగిస్తున్నవరుణుడు శ్రమదాన వేళకు శాంతించాడు.

          కాని బస్టాండు వెలుపలా, ప్రవేశ ద్వారాల్లోనూ చిన్నపాటి చెరువుల్లా ప్రాంగణం లోతట్టు బాట ప్రక్కన పెరిగిన పరమేశుని కంప, రేగు, వేప వంటి మొక్కలూ, గడ్డీ, కంచె దాటి బస్సుల కడ్డుపడబోతున్న పూల చెట్ల కొమ్మలూ, ప్రయాణికులు వేచి యుండేచోట తగు మాత్రం దుమ్మూ- ఇసుకా - కాగితముక్కలూ!  బైట 2/3 స్వల్ప చెత్తకేంద్రాలూ!

 

          చక చకా కార్య రంగంలో దూకిన 1 ½  గంటల శ్రమదానంతో ఈ అస్త వ్యస్తతలన్నీ తొలిగిపోయి, 50 శాతం ఆవరణ అయినా  బాగుపడింది!  చేసిన - 40 మందికి పైగా పనివాళ్లకూ, చూసిన బస్సు ప్రయాణికులకూ  కనువిందు చేసింది.

           చివరి 15 నిముషాలు తప్ప - చినుకులు పడుతూనే ఉన్నవి. వానల వల్లనే పిచ్చి మొక్కలూ, గడ్డీ కత్తుల అవసరం పడక చేతుల్తోనే పీకేందుకు నేల మెత్త బడింది.

 

          అసలీ సువిశాల  ప్రాంగణం పూల తోటల్తో,  త్రాగు నీటి సౌకర్యాలతో, పచ్చదనంతో, అత్యాధునిక మూత్రశాలా సౌకర్యాలతో చల్లపల్లి ఘనతను చాటుతున్నదంటే - అదంతా స్వచ్ఛ కార్యకర్తల చెమట చలువ వల్ల కాదూ? అలాంటి ప్రదేశాన్ని ఎంతదీక్షగా వారు తీర్చిదిద్దుతారో వేరేచెప్పాలా?

- మురుగ్గుంటలో దిగి, నడక మరచిన డ్రైనుకు నడక నేర్పినా,

- ప్లాస్టిక్ తుక్కుల్ని- సీసాల్ని సంచులు-డిప్పల కొద్దీ ఏరినా,

-  ఆవరణ నంతా చీపుళ్లతో ఊడ్చినా స్వచ్ఛ కార్యకర్తల ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.

           6.06 కు పని విరమణ విజిల్ మ్రోగినా- లోడింగు ముగియందే సగం మంది ఆపలేదు.

 బస్టాండు ముఖద్వారం వద్ద 6.25 కుజరిగిన సమీక్షాసమయంలో :

1) పంచాయతీ కార్యనిర్వహణాధిపతి మాధవేంద్రరావు గారు స్వచ్చోద్యమ నినాదాలిచ్చి- అటు స్వచ్ఛతే సేవ కారక్రమాన్నీ, ఇటు స్వచ్ఛ సుందరోద్యమాన్ని చక్కగా వివరించగా,

2) డాక్టర్ DRK ‘ స్వచ్ఛ చల్లపల్లి విజయం అందరి సమష్టి కృషితోనే’  అనినొక్కి చెప్పగా

3) రేపటి శ్రమదానం విజయవాడ మార్గంలోని జాతిపిత స్మృతి వనంలోననే నిర్ణయంతో  నేటి కార్యక్రమం ముగిసింది.

           ఇది కద ఆదర్శం !

 శ్రమదాతల వదలకుండ వెంటాడిన వర్షం

 నలభై మంది ముగించిన శ్రమ విశేష పర్యం

 వేలమంది గ్రామస్తులు పొంద బోవు హర్షం

 ఏ గ్రామస్తులకైనా ఇది కద ఆదర్శం !

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.10.2023.