2898* వ రోజు ....           02-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి!

మౌనముని సాక్షిగా 2898* వ రోజు శ్రమదానం!

          ఈ 2.10.23 బ్రహ్మ సమయాన తలా గంటన్నర పాటు - 4.14 to 6.10 AM - 200 గజాల బెజవాడ బాటను శుభ్రపరిచింది ఒకరో ఇద్దరో కారు సుమా! 33 మంది! ఇందులో కనీసం పాతిక మంది బట్టలు చెమటకు తడిశాయి - అందులో సగం మంది వంటికీ, గుడ్డలకీ బురద అంటుకొన్నది!

          ఇక్కడొక విశేషమేమంటే అసలీ వేళ సోమవారం కనుక శ్రమదానానికి ఆటవిడుపు, రెస్క్యూదళం వారిదే ఈవారం! ఐతే జాతిపిత జయంతి దృష్ట్యా - నిన్నటి ముగింపు వేళ - DRK గారు ఏ కొంతమందైనా రాగలిగితే  మహాత్ముని స్మారకం దగ్గర శ్రమిద్దాంఅనే అభ్యర్థనతో ఇందరు ఉత్సాహపడ్డారన్నమాట!

          ఒక ప్రాచీన మహాజాతిని తట్టి కదలించిన తరతరాలకు సరిపడా ప్రబోధించిన - మహానుభావుణ్ణి స్మరించుకొని, పునః పునరుత్తేజం పొందవలసిన శుభ దినమిది! అతని సందేశాన్ని ఆచరించవలసిన తరుణమిది!

          అందుకే చాల చోట్ల చాలా మంది చేస్తున్నట్లు - విగ్రహానికి దండలేసి, ఉపన్యసించి, చప్పట్లు కొట్టు కొనడం కాక - అతని అతి ముఖ్య ప్రబోధం స్వచ్ఛ శుభ్రతలకై శ్రమిస్తూ స్వచ్ఛ కార్యకర్తలు చేసిన నేటి శ్రమదానం సముచితమైనది!

          ఆ ఉద్దేశ్యంతోనే - ఇందరు విజయవాడ రోడ్డులో- ప్రభుత్వ పాఠశాల నుండి 6 వ పంట కాలవ దాక ఊడ్చారు, ప్లాస్టిక్ తుక్కులు ఏరారు, వంతెన వద్ద చట్టుగా మారిన మట్టి - ఇసుకల్ని గోకుడు పారల్తో గీకి, డిప్పల కెత్తి, చెత్త ట్రాక్టర్లో  నింపారు.

          లోతైన డ్రైన్ల అంచుల మీద పెరిగిన పిచ్చి - ముళ్ల మొక్కల్ని తొలగించారు, పూల మొక్కల్ని సంరక్షించారు.  ప్రత్యేకించి ఇద్దరు గ్రామ సుందరీకర్తలీ పనికే అంకితులయారు.

          నిన్న కాలికి దెబ్బ తగిలి, రాలేకపోయిన ఒక విశ్రాంత ఉద్యోగి ఈ పూట వస్తే వచ్చాడు - చెట్టు చిటారు కొమ్మపై నిలబడి, విద్యుత్తీగలతో చుట్టరికం పెట్టుకొంటున్న కొమ్మల్ని ఎలా నరుకుతున్నదీ  గమనించారా?

          మోకాళ్లు, నడుము బాగలేక - విశ్రాంతి తీసుకోవలసిన ఒక రైతు కూడ రావడం సరే - గొర్రుతో బరువు పని చేయడమూ, పొరుగూళ్ళ నుండి కూడ కొందరు శ్రమ వేడుకకు హాజరు కావడమూ విశేషం కదా!

           మహాత్ముని పాద పీఠం వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో:

          పృధ్వీశ్వరరావు గారి పాటా - స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలిచ్చి, గాంధీ గారి సూక్తుల్ని గుర్తు చేసిన గురవయ్య గారి మాటా,

          1,000/- విరాళం సొమ్ము తనది కాదంటూ మార్మికదాత షణ్ముఖ శ్రీనివాసుని వింతదానమూ,

          10 గంటలకు ఇదే చోట లయన్స్ వారి కార్యక్రమానికాహ్వానమూ..... ఇవీ విశేషాలు!

          2899 - 2900 వ నాళ్ళ (రేపటి - ఎల్లి ఉండి - మంగళ బుధవారాల) వేకువ శ్రమదానాలు గంగులవారిపాలెం దగ్గరి NH16. బైపాస్ రహదారి దగ్గర ఉండునట!

           అభినివేశం మెరుగుపడ్డది!

వేల దినముల -లక్షగంటల శ్రమలు జీర్ణంచేసుకొన్నది

కార్యకర్తల సహనమునకూ కఠిన శోధన జరుగుతున్నది

ఐనగానీ వీధి శుభ్రత హరిత భద్రత పెరుగుచున్నది

అంతకంతకు కార్యకర్తల అభినివేశం మెరుగుపడ్డది!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.10.2023.