2899* వ రోజు ....           03-Oct-2023

 

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

2899* వ వేకువ స్వచ్ఛ సుందరీకరణం!

            ఈ మంగళవార (3.10.23) ప్పూట కార్యకర్తల కర్మశాల గంగులవారిపాలెం దగ్గరి NH16 జాతీయ రహదారే! పాల్గొన్న కష్టజీవుల సంఖ్య - ఊరి జనాభా(24000) తో పోల్చితే 0.1% శాతమే - అంటే 24 మందే!  సంఖ్యను చిన్న చూపు చూసినా, వాళ్ల సంకల్పాన్ని తక్కువగా చూడవద్దు.

ఈ కాస్త మంది మొండి వాళ్ళు పాల్పడిన బండపనులేవో - వాటి మూల కారణాలేవో, తత్ఫలితాలేవో వాకబు చేస్తే:

- గత మూణ్ణాలుగు నెలల్నుండీ ఇదే NH 16 ఉప రహదారికి మధ్య మధ్య విరామాలతో స్వచ్ఛ కార్యకర్తల స్వేదం జమ పడుతూనే ఉన్నది.

- 1.2 కిలోమీటర్ల బాటకు రెండు దిశలా ఎన్నెన్ని రకాలోగాని, మంచి పూల మొక్కలూ, హరిత సంపన్న వృక్షాలూ16,- 17 వందలు నాటి, కంచెలు కట్టి, సంరక్షిస్తూనే ఉన్నారు.

- రేపసలే చల్లపల్లి శ్రమదానోద్యమంలో మరొక పెద్దమైలు రాయి - అనగా 2900* వ రోజు. మరో సందర్భంగా పెద్ద సంఖ్యలో వస్తున్న కార్యకర్తలూ, LIC మేనేజర్ల వంటి అతిథులూ సుమారు మరొక 100 మొక్కలు నాటే ప్రణాళిక ప్రకారం అక్కడ గడ్డి కోసి, పాదులు తీసే పనులే నేటి శ్రమదానం!

ఇందుగ్గానూ 4.14 - 6.06 సమయాల నడుము ఎవరికి వాళ్లు శక్తి వంచన లేకుండా సాగించిన కృషి వివరాలివి:

1) రహదారి ఉత్తరంగా తక్కువ దూరమూ, దక్షిణంగా ఎక్కువ దూరమూ, అంతకు ముందు నాటి, పెరిగిన అందమైన-పుష్పించిన సువర్ణ గన్నేరు తదితర పూలమొక్కల పాదుల గడ్డి తొలగించుట,

2) ఉత్తరపు కొసన నలుగురు కార్యకర్తలు మట్టి దిబ్బ మీది మొక్కల్ని, గడ్డినీ తొలగించి నున్నగా, చదునుగా చేస్తే ఒక పెద్దాయన ఆహా! బోడి కొండలా మార్చేశారు గదయ్యాఅని చమత్కరించుట,

3) ‘ఎంతమంది మున్నాం - రహదారి బారెంతఅని చూడకుండా ప్రతి కార్యకర్తా గంటన్నర శ్రమించిన వైనం -

4) ఎక్కడో ఆరేడు వందల కిలో మీటర్ల దూరపు దావణగెరె నుండి ఒక వేమూరి అర్జున కార్యకర్త వీడియో ద్వారా కార్యకర్తల పనిని చూస్తూ ప్రోత్సహించుట.

5) 6.25 కు మొక్కల రమణుడు ముమ్మారు స్వచ్ఛ సుందరోద్యమ సాంప్రదాయక నినాదాలు వినిపించుట,

6) ఒక ప్రక్క పంటి బిగువున మోకాలి నొప్పిని భరిస్తూనే శ్రమదానంలో పాల్గొన్న నేటి కృషి సమీక్షక వైద్యుడు ఇందరు కార్యకర్తల సామాజిక కర్తవ్యాల్ని చూసి మరో వంక సంతోషించుట,

7) రేపటి 100 పూల మొక్కలు నాటే కార్యక్రమ వివరణ

            అందుగ్గాను రేపు అనగా 2900* వ నాడు మనం ఈ బందరు ఉప రహదారిలోనే కలువవలెనను నిర్ణయం!

            చూడదగినది పాడదగినది

భుజం భుజమూ కలిపినప్పుడు - పనుల వేగం పెరిగినప్పుడు

ఒక్క పనికే ఇద్దరిద్దరు గ్రక్కునన్ కదలాడి నప్పుడు

అలసి దాహం తీర్చుకొని - పని ఆపి సేదలు తీరునప్పుడు

చూడదగినది అభినివేశము - పాడదగినది సన్నివేశము!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.10.2023.