2900* వ రోజు ....           04-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

సార్థకమైన 2900* వ శ్రమ సంగతి.

          బుధవారం (4.10.23) నాటి శ్రమదానం ఎందుకు సార్థకమంటే,

          4.20 - 6.55 నడుమ రెండున్నర గంటలు స్వచ్ఛ కార్యకర్తలు 30 మంది కాకుండా 15 మంది ఇతర ఊళ్ల నుండి కూడ వచ్చి శ్రమదానంలో ఎందుకు పాల్గొని, ఏమి చేశారంటే,

          ఒక సామాజిక, సామూహిక శ్రమ వేడుక ఎంత ప్రభావవంతమని ఆలోచిస్తే,

          ఒక ఆతిథ్య శ్రమ వృత్తాంతం ఎలా ఉండాలంటే,

          చల్లపల్లి సమీపంలో నేటి ఉదయం జరిగిన సంఘటనలు పూస గ్రుచ్చినట్లు చెప్పాలి!

          అందుగ్గాను వ్రాసే ఓపిక నాకున్నా - చదివే ఓర్పు అందరికీ ఉండాలి!  నేటి జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సప్ లోని  ఆడియో/వీడియో సమాచారం కూడ పనికొస్తుంది!

          అది గంగులవారిపాలేనికి కూతవేటు ఉత్తరంగా బందరు రహదారి-NH.216 ప్రక్కన విషయం! నిత్య కర్మిష్టులైన 30 మంది స్వచ్ఛ కార్యకర్తలు కాక - జీవిత బీమా సంబంధిత ఉన్నతాధికారులు కడు దవ్వుల్నుండి వచ్చి హుషారుగా పాల్గొని, కాలు జారుతున్న తడినేలలో తిరుగాడి, కదంబం, తురాయి వంటి 60-70 వృక్షాల్ని నాటిన సమాచారం!

          గట్టి నిబద్ధత, విజ్ఞతలతో 9-10 ఏళ్లుగా శ్రమిస్తున్న కార్యకర్తలకు ఇలా బైటి పెద్దలు వచ్చి, ప్రకటించే సంఘీ భావాలు మరింత శక్తినిస్తాయి! ఈ మూన్నాళ్లుగా ఈ బందరు రహదారి ప్రక్కల నాటిన 16 వందల చెట్లు ఎప్పుడు పెరిగి, పూలమొక్కలు విరగపూచి, బాటనెంతగా హరిత సుందరం కానిస్తాయా అని కార్యకర్తలు ఎదురు చూస్తారన్నమాట !

          ఇప్పటిదాక - 8+1 రహదార్ల వెంట స్వచ్చోద్యమకారులు నాటి - పెంచిన హరిత- పుష్ప సంపద లెక్క ముప్ఫై వేలట ! - అందులో ఈ సీజన్ లోదే 2 వేలకు పైమాట !

          ఆరున్నర నుండి అరగంట జరిగిన కృషి సమీక్షా వేడుకలో వక్తల ప్రసంగాల సారాంశంగాని, అంతకు ముందు నందేటి శ్రీనివాస గాయకుని పాట, పద్యంగాని వృక్షో రక్షతి రక్షితఃఅనే అంశంపైనే జరిగింది.

 

          LIC కే చెందిన జ్ఞాన ప్రసాదుని స్వచ్చోద్యమ నినాదాల తరువాత, ఆ సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజరు (SDM) గారి, మచిలీపట్నం హిందూ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపల్ మూర్తి గారి, B M గారి, అవనిగడ్డ, నాగాయలంకల శ్రమదాతల సందేశాలన్నీ *మానవ శ్రమ ప్రాధాన్యతను ప్రతిబింబించాయి*.

          నిన్నగాక మొన్న 5,000/- విరాళమిచ్చి, మళ్లీ నేడు కూడ  5,000/- సహకారమందించిన ప్రాతూరి శాస్త్రి గారూ అప్పటికప్పుడు అవనిగడ్డ బ్రాంచ్ LIC ఏజంట్స్ పక్షాన 5,000/- ప్రకటించిన మాదివాడ నిరంజన్ గారు, మనకోసం మనంట్రస్టుకు మహా ప్రస్థానం వాహనాన్ని బహూకరించే సంగతిని పరిశీలించిన LIC సంస్థ అధికారి సుధాకర్ బాబు గారు అభివందనీయులు!

          రేపటి వేకువ కూడ మనం కలిసి శ్రమించేది గంగులవారిపాలెం దగ్గరి రహదారి వద్దనేనట!

    రెండువేలా తొమ్మిదొందల దండి సేవలు!

ప్రశాంతముగా - ప్రమోదముగా ప్రశిష్టంగా- ప్రవిమలంగా

సుస్థిరముగా- సుమధురముగా శుభ్ర సుందర ప్రయత్నంగా

సహేతుకముగ- సహర్షముగా-సమూహంగా- సమైక్యంగా

రెండువేలా తొమ్మిదొందల నిండుమనసుల దండి సేవలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.10.2023.