2901* వ రోజు....           05-Oct-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

                   ఈ గురువారం వేకువ శ్రమ వినోదం సంఖ్య 2901*

          5.10.23 బ్రహ్మ కాలాన 4.14 కే ఊరికి దూరంగా MTM రహదారి కడకు వెళ్లి 6.06 దాక తీర్దానికి తీర్ధం, స్వార్థానికి స్వార్ధం దక్కించు కొన్న కార్యకర్తల సంఖ్య 28!  తీర్ధమంటే - వేలాది గ్రామస్తులకీప్రయాణికులకీ దక్కబోయే ఆహ్లాదం, స్వార్థమంటే - గంటన్నర శ్రమతో వచ్చే మానసిక తృప్తీ, శారీరక పుష్టీ !

 

          పనిచోటు మరొక మారు నిన్నటిదే - గంగుల వారి పాలెం సమీపం! పని స్వభావమైతే- తాము నాటిన మొక్కల చుట్టూ పెరిగిన గడ్డి నిర్మూలన !  నిన్నటి ప్రధాన కార్యక్షేత్రం NH 216 కు దక్షిణ భాగమైతే నేడది ఉత్తరానికి మారింది.

 

ఇక్కడొక సందేహమేమంటే :

 

          ఓ 200 గజాల వీధి మార్జిన్ లో కొన్ని పిచ్చి - ముళ్ల మొక్కల్ని పీకి లేదా నరికీ, వరుస వానల్తో దట్టంగా అల్లుకొన్న గడ్డిని కోసీ లేదా పెకలించీ, ప్లాస్టిక్- గాజు సీసాల్నీ, సంచుల్నీ, కొన్ని పొట్లాల్ని ఏరీ, పనిలో పనిగా దంతెల్తో వ్యర్ధాల్ని గుట్టలుగా లాగీ నలుగురు చీపుళ్లకి పనిచెప్పిన పనుల్ని ఇలా రోజూ పని గట్టుకొని వివరించాలా అని ఎవరైనా ప్రశ్ని స్తారాఅని!

          శ్రమదానం 2901* నాళ్లు చేసింది నిజమేగాని - వాట్సప్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో ఈ ఊదర గొట్టుడేంటి అనిఎవరైనాగొణుక్కుంటారేమో అని!

 

          ఇలాంటి ప్రశ్నలకూ, శంకలకూ ప్రత్యుత్తరాలు చిల్లలవాగు గట్టు శ్మశానమూ, RTC బస్ ప్రాంగణమూ, చల్లపల్లి చుట్టూ ఎనిమిదో తొమ్మిదో రహదార్ల పూలవనాలూ, ప్రజా సౌకర్యార్థం నాలుగు చోట్ల స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్లూ, ఊరిని- పరిసరాల్నీ క్రమ్మేస్తున్న పచ్చదనమూ వగైరాలు!'

 

         ఈ దైనందిన సామాజిక మాధ్యమ వర్ణనలు స్వచ్చ కార్యకర్తలు చదివి గర్విస్తారని కాదు- వాస్తవాల నమోదు కోసం మాత్రమే!

          పాతిక- ముప్పైమంది తమ కోసం కాక - ఊరి మంచి కోసం ఇలా వంగి, కూర్చొని, నిల్చొని చిత్తశుద్ధి తో శ్రమించే దృశ్యం చల్లపల్లికే సొంతం!

 

          అటు బండ్రేవు కోడు పెద్ద వంతెన, ఇటు గంగులపాలెం బాటల నడుమ ఇంత పెద్ద రహదారి ఈ ఉదయం ఈ మాత్రం మెరుగుపడిందంటే -28 మంది శ్రమే అందుకు మూలం!

 

          రోజుటికన్నా శ్రమదానం ముగింపు ఆలస్యమయిందంటే అందుక్కారణం కాఫీ వేళ

 

1) అడపావారి పప్పుచెక్కల, వీరసింహుని తిరుపతి ప్రసాదాల, తాడంకి ఆనందరావు కూరరటి కాయల పంపకం,

2) అదీగాక- ఎక్కడో అమెరికా మారుమూల - డాక్టర్ దోనేపూడి శరత్ తన 40 ఏళ్ల వృత్తి ముగింపు వేళ అక్కడి ప్రజలకోసం 20.8 కోట్ల దానం గురించిన మన DRK గారి వివరణ కూడ!

 

స్వచ్చ కార్యకర్తల ఆర్థిక సహకార విషయానికొస్తే –

 

1) కోడూరు వేంకటేశ్వర రావు గారి 520/-విరాళమూ,

2) డా. మాలెంపాటి  వారి 2000/- వితరణా  నేటి విశేషాలు.

 

రేపటి వేకువ మనకు చాలినంత పని ఇదే బైపాస్ మార్గంలోనని నిర్ణయించారు.

 

            చెక్కిన ఒక శిల్పం వలె

చెక్కిన ఒక శిల్పం వలె - చక్కని ఉద్యానం వలె-

నిక్కపు ముత్యంలాగా - మ్రొక్కక ఇచ్చిన వరముగ-

స్వచ్ఛ చల్లపల్లి లాగ ప్రతి ఊరూ వికసిస్తే.....

మనోల్లాస దాయకముగ ప్రతి వీధీ కనిపిస్తే....

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   05.10.2023.