2902* వ రోజు ....           06-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి!

ఉప రహదారి సుందరీకరణలోనే 2902* వ రోజు!

            శుక్రవారం(6.10.23) వేకువ 4.16 - 6.08 మధ్యస్థకాలంలో 24 మంది బందరు రహదారి (NH 216) - గంగులవారిపాలెం సమీపంలో మనసుపెట్టి, సొంత పనిలా భావించి, కావించిన శుభ్ర - సుందరీకరణమది! ఇందులోనే నలుగురిక్కడికి దూరంగా ఖాళీ చూసుకొని మరికొన్ని మొక్కలు నాటి వచ్చారు.

            ‘స్వచ్ఛ కార్యకర్తలెన్నాళ్లు శ్రమించినా - దాన్ని నేనెన్నాళ్ళు వర్ణించినా పనులయితే అవే గదా! కొద్ది మార్పుల్తో శ్రామికులూ వాళ్ళే కదా!’ అని స్థూలంగా  అనిపించవచ్చు గాని - చేస్తున్న పనుల్లో ఎంత సృజనాత్మకత! ఎంత నిబద్ధత! ఎంత వైవిధ్యం! పని వేళలో ఎన్నెన్ని భంగిమలో దగ్గరగా పరిశీలిస్తేనే తెలుస్తుంది.

            ఒక పెద్దాయన నడుము/మోకాలి లోపంతో ప్రక్కకు ఒరిగి నిలబడి చీపురుతో రోడ్డు మీద దుమ్ము - కాగితాలూ ఊడ్వడం గాని -

            మరొక వృద్ధ - భారీ కార్యకర్త తడి నేల మీద కష్టమ్మీద కూర్చోని ముందుకు జరుగుతూ బాట ప్రక్క గడ్డి చెక్కు దృశ్యం గాని –

            గంటన్నర పాటు ఇకేదీ పట్టించుకోక ఒక పోస్టల్ ఉద్యోగి మోకాళ్ల మీద కూర్చొని, తదేక దీక్షగా పిచ్చి - ముళ్ల చెట్లను నరుకుతున్న/ పీకుతున్న సంగతి గాని –

            ఇంకో రైతు రోడ్డుకు 12 అడుగుల దూరంగా బురదలో దిగి పూల మొక్కల చుట్టూ దట్టంగా పెరిగిన తీగల్నీ - గడ్డినీ నరుకుతున్న ఊపు గాని –

            వేకువనే లేచి, ఊరికి దూరంగా వచ్చి, రహదారిని ఊడుస్తున్న మహిళల పట్టుదల గాని,

            వేకువ పాదచారులుగా వచ్చి - తమ ఊరి కోసం జరుగుతున్న ఒక నిస్వార్ధ శ్రమదానాన్ని చూస్తూ - ఆగక, పట్టించుకోక వెళ్లడాన్నిగాని –

            దేన్ని విశేషంగా భావించకూడదు? ఇంత సుదీర్ఘకాలంగా ఒక గ్రామంలో జరుగుతున్న సామాజిక కర్తవ్యాన్ని ఎందుకు ప్రస్తావించకూడదు?

            ఇన్ని సమయ - ధన త్యాగాలతో ఒక యజ్ఞంలా జరిగే శ్రమ వేడుకను అదేదో సాధారణ విషయంగా, కేవలం ఒక వంద మంది బాధ్యతగా గ్రామస్తులెందుకు తీసుకొంటున్నారో తెలియదు.

నేటి అంతిమ సమావేశంలో ఒకానొక సుందరీకరణ స్పెషలిస్టు

- ఆకుల దుర్గాప్రసాదు వడివడిగా నినదించిన స్వచ్ఛ – సుందరోద్యమ సంకల్పంతో మొదలై,

- బాటకు రెండు ప్రక్కలా ఇప్పుడు రూపొందే వాకింగ్ ట్రాకే సిమెంటు రోడ్డుకన్న నడకకు యోగ్యమనే డాక్టరు DRK సూచనతోనూ

- అడపా వారి వివేకానంద వాణి పునరుద్ఘాటనతోనూ ముగిసింది.

            రేపూ – మరికొన్ని రోజులూ మన శ్రమదానం ఇదే రహదారి మీదనే అనే నిర్ణయమూ తెలిసింది!

            ప్రజా స్పందనలోపమెందుకొ

గత చరిత్రొక అనుభవంగా - వర్తమానం వాస్తవంగా

గ్రామ భవితను తీర్చిదిద్దే క్రమం తప్పని ఉద్యమంగా

ఇందరిందరు కార్యకర్తలు వేల దినములు శ్రమిస్తుంటే

ప్రజా స్పందనలోపమెందుకొ! బద్ధకించే పద్ధతెందుకో!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   06.10.2023.