2903* వ రోజు ....           07-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

ఫలించిన 2903*వ నాటి శ్రమదానం!

            అది శనివారం వేకువ నాలుగున్నరక్కాదు 4.16 కే మొదలైంది; 6.06 దాక - అంటే గంటా 50 నిముషాల పాటు కొనసాగింది; సదరు శ్రమ సంఘటనం NH 216 కు ఉత్తరంగా పంట పొలాల వద్దా, గంగులవారిపాలెం జంక్షన్ దగ్గరా - 2 రకాలుగా ఉండెను; వేకువ నిద్రను త్యజించి, అందరి ఆహ్లాదం కోసం పాటుబడిన కార్యకర్తలు 25 మంది!

            తొమ్మిదేళ్లకుపైగా చల్లపల్లిలో ఏదొక చోట కనిపించే నిత్య కృత్య సన్నివేశాలే ఇవి! ఐనా, చేసే కర్మ ప్రవీణులగ్గాని, చూసే నాలాంటి వాళ్లగ్గాని విసుగూ విరామాలుండవు! ఎంత బరువు - కరకు- మురికి పనులైనా ఒక మహత్తర లక్ష్యం కోసం ముందుకు పడుతున్న ఆ 50 - 60 అడుగులాగవు! ఆ చేతుల పనితనానికి తరుగుదలా ఉండదు!

             ఋజువులు కావాలంటే మీరొక్క పరి నేటి జై  స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సాప్ చిత్రాన్ని చూడండి - నాలుగైదేళ్ల నాడు L1C సంస్థ నుండి పని విముక్తుడైన ఒక ఉన్నతాధికారి బురదలో కాలు నిల ద్రొక్కుకుని పూల మొక్క చుట్టూ గడ్డి పీకి, పశువుల్నుండి రక్షణగా ముళ్లకంప కట్టుతున్న సన్నివేశాన్ని!

            76 ఏళ్ల - రిటైర్డ్ హిందీ పంతులు గారు (అసలాయనదీ ఊరేకాదు) అడుగడుగునా కార్యకర్తల్నభినందిస్తూ ప్రోత్సహిస్తూ శ్రమ దృశ్యాల్ని ఫోన్లో బంధిస్తూ చురుగ్గా తిరగడాన్ని!

            ఒక పెద్ద డాక్టరమ్మ, ఒక సాదా గృహిణి, ఒక గ్రామ సౌందర్య నిపుణుడు, ఒక సీనియర్ బడి పంతులు, మరొక మొక్కల సరఫరాదారుడు 2 రోడ్ల కూడలి రెండు ప్రక్కలా క్రోటన్ మొక్కల్నలంకరించేందుకెంత శ్రమిస్తున్నదీ!

            శివరాంపురం నుండి వచ్చి మరీ చల్లపల్లికి సహకారమందిస్తున్న వాళ్లూ!

            - ఇవన్నీ తమ సామాజిక బాధ్యతను గుర్తించి, నెరవేరుస్తున్న కొన్ని గురుతులు!

            బాట వెంట వాహనాల్ని పరిగెత్తిస్తూ - ఈ వేకువ - ఇక్కడ పాతిక మంది జనం ఏమిటో - అక్కడ గడ్డి చెక్కే కత్తుల గణ గణ లెందుకో - అవి రాళ్లకు తగిలి లేస్తున్న నిప్పు రవ్వలేలనో చూస్తూ పోయారు!

            ఏక కాలంలో పాతిక మంది బండ్రేవు కోడు కాల్వ దగ్గర - తమ కోసం కాక - తమ ఊరంతటి ప్రయోజన మాసించి చేసిన 7-10-23 తేదీ నాటి శ్రమదానమిది!

6.30 కు పనులు ముగించి, ‘సమూహ ఛాయాచిత్రంకోసం గుమికూడినప్పుడు -

1) బందరు ఉపరహదారికే మనం నెలో రెండు నెలలో శ్రమించక తప్పదు అనే కొందరి వ్యాఖ్యానాలూ,

2) తొమ్మిదేళ్ల శ్రమదానోత్సవానికి (12-11-23) వాగ్గేయ కారుడైన జయరాజు గారికి పంపుతున్న ఆహ్వానానికి ఒకటి రెండు సవరణలూ,

 3) RTC ఉద్యోగి తోట నాగేశ్వరావు గారి స్వచ్ఛ సంకల్ప నినాదాలూ,

4) గురవయ్యగారి పద్యాలాపనా...

            రేపటి శ్రమ ప్రయత్నం కూడ ఈ గంగులవారిపాలెం సమీపంలోనేనట!

            ఓనమాలు దిద్దుకొంది

పట్టి పట్టి పరిశుభ్రత పాఠాలను నేర్చుకొంది

వీధుల్లో శ్రమదానపు ఓనమాలు దిద్దుకొంది

అవసరపడి మురుగు కాల్వ అశుద్ధాలు తొలగిస్తూ

స్వచ్ఛోద్యమ చల్లపల్లి స-రి-గ-మ-లను పాడుతోంది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.10.2023.