2904* వ రోజు ....           08-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

                     ఆదివారం నాటి NH 216 మెరుగుదలచర్యలు - @2904*

            8-10-23 వేకువ 4.16 నుండి 2 గంటలపైగా సదరు చర్యలు జరిగాయి. రహదారి అదేగాని, పని చోటు

మారింది. బండ్రేవు కోడు వంతెనకు తూర్పుగా –శ్రీ చైతన్య అడ్డబాట దిశగా జరిగిన కృషి అది!

            రాదారి ఉత్తరం ప్రక్కన గతంలో నాటినపూల మొక్కల పాదుల్నిండా గడ్డి బలిసి, గడ్డేదో - పూల చెట్టేదో తెలియని స్థితిలో పాతిక మొక్కల పాదుల్ని సరి చేయడమే నేటి ప్రధాన శ్రమదానం!  వందల రోజుల పాటీ పనులు చేస్తున్న కార్యకర్తల కు నిజానికిదొకచిన్న విషయమేగాని - పని ఏ మాత్రం సాఫీగా సాగలేదు. కారణమేమనగా:

            మొక్కలున్న చోటు ఎత్తైన బాట ప్రక్కన నిలువువాలుగా ఉండడమూ, కాళ్లు జారడమూ, ముళ్ల కంపలో చేతులు దూర్చి పని చేయవలసి రావడమూ! అక్కడి దోమల - పురుగుల సంగతి చెప్పేదేముంది!  ఇక్కడ ఊడ్చిన వాళ్ళూ, కత్తుల్తో- దంతెల్తో పని చేసిన వాళ్లూ 20 మంది పైమాటే!

            ఐదారుగురు శ్రమదాతలు పెద్ద వంతెన దగ్గర గంటన్నర శ్రమించి, గడ్డి, పిచ్చి మొక్కలూ, ప్లాస్టిక్ – గాజు బుడ్లూ తొలగించి పోగేసినప్పుడు గాని - ఈ కాస్త చోటులోనే ఇంతగా వ్యర్ధాలున్నాయని తెలిసింది.  

            ఇంకొక ఆరేడుగురు ఇక్కడికి పడమరగా- గంగులవారిపాలెం బాట కూడలిలో నేలను చదును చేసి, పాదులు త్రవ్వి, ఎర్ర క్రోటన్ మొక్కల్ని బారులు తీర్చారు!  ఇక-ఈ మొక్కలన్నిటినీ 2 నెలల పాటు సంరక్షించి, అవి పుష్పించి, నాలుగైదడుగులు పెరిగినప్పుడు చూడాలి - అక్కడ దొరికే ఆహ్లాదం!

            అసలే ఆదివారం - మంచులోకి మారుతున్న కాలం - ఇప్పటికే ఈ ఒక్క 2.2 కిలో మీటర్ల  రహదారికే 100 కు పైగా రోజుల కార్యకర్తల  శ్రమదానం - ఈ 1600 కు మించిన చెట్ల,  పచ్చదనమూ, పూల పరిమళమూ ఇంకొక్క సంవత్సరం తరువాత ఈ బాట  సౌందర్యం - దాన్నూహించుకొంటూ ఈ ఉదయం 50/60 పని గంటల శ్రమ వేడుక- దటీజ్ స్వచ్ఛ సుందర కార్యకర్తలు!

            ఈ ఆదర్శ శ్రమ చేస్తూనో - దాన్నిచూస్తూనో ఇక్కడి వాళ్లు ప్రతి నిత్యం పొందే పరవశమలా ఉంచి, ఈ ఉదయ  సమయపు కృషిని ఇక్కడి నుండి హైదరాబాదు వెళ్తూ 2 కార్ల ప్రయాణికులు ఆగి, అబ్బురంగా చూసి వెళ్ళారు.

            రోజుటివలె కాక- ఎత్తు మట్టి దిబ్బల దగ్గర జరిగిన నేటి సమీక్షా సభలోసాధనాల సతీష్  నినాదాలు ప్రకటించగా.....

1) హుషారైన, 2) ఆలోచనాత్మకమైన పాటల్ని నందేటి శ్రీను పాడగా.... వారాంతపు శ్రమదానం ముగిసింది!

బుధవారం సైతం మన కలయిక ఇదే  NH 216 బందరు ఉపమార్గంలోనే!

 

                దేశమనగా మనుషులేనని

దేశమనగా మనుషులేనని తెలియనోళ్లెవరీ తరంలో?

సమాజం యెడ బాధ్యతన్నది తెలియదెవ్వని అంతరాత్మకు?

ఊరి శుభ్రత ఎంత ముఖ్యమొ వేరెవరో వివరింపవలెనా?

మోటు పనులకు సాహసించని మాట మాత్రం నిజంకాదా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.10.2023.