2905* వ రోజు ....           09-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

సందడి సందడిగా 2905*వ వేకువ సేవలు!

            సోమ - మంగళవారాలు రెస్క్యూ టీమ్ వంతు గనుక - 4.25 కే గంగుల వారి పాలెం వంట శ్రీను ఇంటెదురుగా వాళ్ళ బరువు పనులు మొదలై 6.10 దాక జరిగాయి. అవి అంతటితో ముగియక - జాతీయ రహదారి కూడలిలో- నిన్న నాటిన క్రోటన్ మొక్కల వద్ద మరి కొంత సమయం పొడిగించబడ్డాయి.

            డ్రైన్ ప్రక్కన బాగా ఎత్తుకు పెరిగి, కరెంటు తీగల్ని చుట్టు ముట్టిన పెద్ద చెట్టును ఏడడుగులుంచి, కొట్టేసి, ఒక ట్రాక్టరుకు సరిపడా ఆ కొమ్మ - రెమ్మల్ని నింపినదే నేటి ముఖ్య కార్యక్రమం! సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు దాక బాట ప్రక్క గడ్డీ, పిచ్చి మొక్కలు, తొలగించి, నేలను సమంచేసి, పాదులు త్రవ్వి, పూల మొక్కలు నాటడం ఇంకొక పని!

             ఇవాల్టి బరువు పనులు కొద్ది మంది రెస్క్యూ వాళ్లవే గాని, రాన్రానూ ఏడెనిమిది మంది పనిచోటి ఎదురింటి ఇల్లాలూ, నలుగురు పాదచార స్వచ్ఛ కార్యకర్తలూ, ఇంకొందరు కార్యకర్తలూ, గంగులవారిపాలెం వీధి ప్రేమిక పాదచారులొకరిద్దరూ కలిశారు - వారిలో కొందరు తలా ఒక మొక్క నాటారు కూడ!

            మనలాంటి కొందరికేమో ఇంత మంచి శుభ్రమైన - అందమైన వీధిలో ఇంకా చెట్లెక్కడ నాటాలీ, ఏం శుభ్రపరచాలి...”  అనిపిస్తుంది గాని- స్వచ్చ కార్యకర్తల ఆలోచన వేఱు, మరీ ముఖ్యంగా సుందరీకర్తల ఊహలు రెక్కలు విప్పితే గనుక- తట్టే కొన్ని అంశాలు! ఏతా వాతా - ఇప్పటికే మండల స్థాయిలో గుర్తింపు పొందిన ఈ వీధి మరొక ఏడాది గడిచాక అదేదో సినిమా పాటను గుర్తుచేసుకొంటూ-

            ఇంత అందం ఏం చేసుకుంటానురా.... అనుకోవాలేమో! ఇంతా జేస్తే- ఈ బజారుకు పూల మొక్కల అలంకరణం ఈ రోజు కూడ పూర్తిగానే లేదు!  ఎక్కడెక్కడ కాస్త ఖాళీ ఉందో ఏ పూల చెట్లింకా నాటాలో 6.00 సమయంలో చర్చించి, నిర్ణయం చేశారు!  బహుశా రేపటితో ఆ పనులు కూడ ముగియ వచ్చు!

            తెల్లారాక- తలొక చేయి వేసి, పనులు ముగించాక - అవన్నీ చూస్తుంటే నాకు వచ్చిన సందేహ మేమంటే:

            అసలివి రెస్క్యూ దళం పన్లా? మార్నింగ్ వాకర్ల తోడ్పాటా ? శ్రమదానమా - లేక సామాజిక శ్రమ వేడుకా....అని!

            6.30 అనంతరం - అప్పటిదాకా చెట్టెక్కి కత్తితో, దిగి గునపంతో బరువు పనులు చేసిన తూములూరి లక్ష్మణరావనే సీనియర్ కార్యకర్త ముమ్మారు ఉచ్ఛరించిన గ్రామ  స్వచ్ఛ - సుందర నినాదాలతో నేటి పని ముగింపు!

            అసలు హేతువనుకొంటే-

 ఔనన్నా కాదన్నా అందరి ఆరోగ్యాలకు

హరిత స్వచ్ఛ శుభ్రతలే అసలు హేతువనుకొంటే-

చల్లపల్లిలో ఆ పని సజావుగా సాగుతోంది!

ముప్పది నలుబది ఊళ్లకు మోడల్ గా నిలుస్తోంది!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

   09.10.2023.