2906* వ రోజు ....           10-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

రెస్క్యూ & సుందరీకరణ పనులు - @2906*

            మంగళవారం(10-10-23) నాటి అట్టి పనులు కేవలం నలుగురు భద్రతా దళానివే కాదు - ఒక పొరుగింటి మహిళా కార్యకర్తతో సహా వారికి 7 గురు సహకరించారు! 4.25 కు మొదలై ఈ ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా 6.00 కు ముగిసిన సదరు వీధి సుందరీకరణ వివరాలివి:

            స్థలం - గంగులవారిపాలెం వెళ్ళే బాటలో 4 రోడ్ల కూడలిలో సన్ ఫ్లవర్ కాలనీ మార్గం రెండు వైపులా 30/40 అడుగులు !

            ఉద్దేశం - వందల కొద్దీ మనుషులు తిరిగే కూడలి శుభ్రంగా, పచ్చగా ఉంటేనే చాలదనీ, నిన్నటి వలెనే దట్టంగా పూల మొక్కలు నాటాలని!

            సంతోషం - ఇక్కడ కనీసం ముగ్గుర్నలుగులు స్థానికులు కూడ సుందరీకరణ భాగస్వాములైనందుకు!

            ఈ వీధి నివాసులు కాస్త చొరవ చూపాలే గాని మిగిలిన మరో 100 గజాల దూరం రెండు వైపులా మొక్కలు పెంచడం ఏమంత కష్టం?

            అసలు ఇష్టపడి నెరవేరుస్తున్న గ్రామ మెరుగుదల పనుల్లో కష్టమేమిటి - సులువేమిటి? ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే 3000 దినాల శ్రమదానం ఈ చల్లపల్లిలో జరిగేదా? 30 వేల చెట్లూ, పూల మొక్కలూ పెరిగేవా?

            ఒక సానుకూల దృక్పథం కల 10-15 మంది సహృదయులు బ్రహ్మ కాలంలో ఒక మంచి పనిలో ఉంటే - ఊరికి పనికొచ్చే ఊహలెన్ని వస్తాయో, ప్రణాళికలెన్ని రూపొండుతాయో  రోజూ చూస్తూనే ఉన్నాను!

            అందుకే – “క్రమం తప్పని ఓ ఉషోదయ బాధ్యతామయ శ్రమదానమా! వర్ధిల్లు”! అని చాల మంది కోరుకునేది!

            6.10 కి అయ్యప్ప దీక్షలో ఉండి, శ్రమచేసిన కస్తూరి విజయుడు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో మిగిలిన వారు ఏకీభవించారు!

            రేపటి వేకువ మన జాతీయ రహదారి – NH 216 సుందరీకరణ కోసం కలువదగిన చోటు - బండ్రేవు కోడు మీద పెద్ద వంతెన!

            ఎక్కడైన ఉండేదే

ఎక్కడైన ఉండేదే ఈ ద్వైధీ భావజాల

మొక వంకన స్వచ్ఛ - శుభ్రతొక ప్రక్కన గలీజుగా

పాల మీద మీగడ వలె కాలమె తేల్చేయగలదు

ఏది మంచి, ఏదనుచిత మేది సమంజసమన్నది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.10.2023.