2907* వ రోజు ....           11-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

నేషనల్ హైవే మీదనే 2907* వ శ్రమదానం!

          అది బుధవారం (11.10.23) వేకువ 4.14 (నిర్ణీత సమయం 4.30) కే 10 మందితో శ్రీరస్తుఅని మొదలై, 6.05 కు మొత్తం పాతిక మంది సేవలతో ప్రజాహ్లాద శుభమస్తుఅంటూ ముగిసెను.

          బండ్రేవుకోడు కాల్వ మీద – NH 216 పైన వంతెన హద్దుగా, 22 వ కిలోమీటరు రాయికి తూర్పుగా ఇవాళటి శ్రమదాన దృశ్యాల్ని ఆసక్తి ఉన్న వారు మన వాట్సప్ మాధ్యమంలో గుర్తించవచ్చు. ఆదివారం నాడిదే స్థలంలో హైవేకి ఉత్తరంగా కృషి జరిగితే - నేటి వేకువ దక్షిణ దిశగా జరిగిందన్న మాట!

          ఇంతకీ ఏ మా కృషి, ఎవరా కృషికారులు? నాలుగైదు నెలల నుండీ ఇప్పటికి కనీసం నాలుగు మార్లు గడ్డీపిచ్చి చెట్లను తొలగించినదిక్కడే! ఏటవాలులోతైన డ్రైను వైపు రకరకాల పూల చెట్లూ నీడ చెట్లూ నాటింది వీళ్లే!

          వానలెక్కువై, పూల మొక్కలను క్రమ్మేసి, ఏది గడ్డి గుబురో ఏది తాము నాటిన మొక్కో తెలియని చోట ఈ పూట కనీసం 30 మొక్కల పాదుల్నీ, చుట్టూతా శుభ్రపరచవలసి వచ్చింది!

          చీకటిలో - బాగా వాలు చోటులో అలా పనిచేస్తూ జర్రున కాలు జారి, ఒక శ్రమానందుడు పడిపోయి, మోచేయి గులక రాళ్లతో గాయమయింది గాని - లెక్కచేయక తన పనిని పూర్తి చేసేదాక విశ్రమించలేదు! ఔను మరి - వేకువనే లేచి, పొరుగూరు నుండి 3 కిలోమీటర్లు దాటి వచ్చిన వ్యక్తి అతడు!

          మనకెవరికన్నా స్ఫూర్తి కావాలంటే - ఒక సుందరీకర్త గబగబా చెత్త డిప్పను మోసుకెళుతున్న పని భంగిమనూ, ముఖంలో పని వ్యగ్రతనూ చూడండి!

          150 గజాల స్వచ్చ శుభ్ర రహదారి దక్షిణపు మార్జిన్ ను గమనించండి! వంతెన మూలల్లో శోధిస్తూ ఊడుస్తున్న ఇద్దరు నర్సుల్ని ఛాయా చిత్రంలో గమనించినా ఉత్తేజం వస్తుంది!

నేటి పని విరమణానంతర సమీక్షా సంగతుల్లో :

1) స్వచ్ఛోద్యమ ఖర్చులకు 2000/- విరాళమిచ్చేందుకు చుట్టపు చూపుగా వచ్చి, శ్రమించిన ఆకుల రాఘవరావూ,

2) శ్రమదాన స్ఫూర్తిదాయక నినాదాలిచ్చి, గ్రంథపఠన సూక్తిని విన్పించిన అడపా గురవయ్యా....

3) రేపటి శ్రమదానం కూడ బందరు మార్గపు 22 వ.కి.మీ. దగ్గరే అని ప్రకటించిన Dr.డి.ఆర్కే..

          ఆలోచనలున్న ఊరు

ఔనా! ఇది సామ్యవాద ఆలోచనలున్న ఊరు

అందరు తమతో బాటుగ స్వస్తులుగా నిలువ గోరు

వాతావరణంలో ఆభావనలున్నట్టి ఊరు

స్వచ్ఛోద్యమ తరంగాలు ఆ భావన లక్షణాలు ?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   11.10.2023.

ఆకుల రాఘవరావు గారు