2908* వ రోజు ....           12-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

నేటి శ్రమదాన పని దినం 2908* వది!

            గురువారం(12.10.23) వేకువ 4.16 కు కాబోలు అది మొదలై, 6.07 వరకు జరిగింది. నేటి పని చోటు కూడ బందరు రహదారిలో నూకలవారిపాలెం అడ్డ బాట దగ్గరే! నికరంగా, డజనున్నర మంది రహదారికి దక్షిణంగా శ్రమించగా - ఇద్దరు ఉత్తరం ప్రక్క చెక్కుడు పారతో - చీపురుతో పాటుబడ్డారు!

            గత 3 రోజులుగా పెద్ద వంతెన మురికి, దుమ్ము, చెత్త, పిచ్చి మొక్కలు వదిలిస్తున్న సుందరీకరణ కార్యకర్తలు ఈ వేకువ సైతం ఆ 50 - 60 అడుగుల విశాల వారధిపైనే మక్కువ పెంచుకొన్నారు! రేపు కూడ వాళ్లక్కడికే పరిమితమైనా ఔతారు!

            రోడ్డు దక్షిణాన జరిగింది నిన్నటి కృషికి పొడిగింపే! అది గట్టి - బరువు పని కాకపోవచ్చు గాని - బాగా జిలుగు విసుగు పని! పాదులు నిండి, చుట్టూ ముళ్ళ కంచెను క్రమ్మి, లోపలెక్కడో బిక్కుబిక్కుమంటున్న పూల మొక్కల్ని ఒకొక్క దాని వద్ద ఇద్దరు ముళ్ల కంపలోకి చేతులు దూర్చి, అక్కడే గడ్డి, మొక్కా మిగలకుండ - చేతులకు ముళ్లు గీరుకోకుండ ఎంత నేర్పు - ఎంత ఓర్పు ప్రదర్శించారో గమనార్హం!

            సుమారిరవై మొక్కల్నలా వెలుగులోకి తెచ్చి, కునారిల్లుతున్న మూడు పూలమొక్కల బదులు క్రొత్తవి నాటి గాని, పని విరమణ వేళకి వాళ్లకి మనః తృప్తి దక్కలేదు!

            నేనేదో ఈ శ్రమదానాన్ని తెగవర్ణించేస్తున్నారని కొందరనుకొంటారు గాని - ఈ ఏటవాలు చోట్ల, ముళ్ళ కంపల మధ్య, ఊరికి దూరంగా వచ్చి, ఇలాంటి పనుల్ని తొమ్మిదేళ్లు చేసే వాళ్లు మరెక్కడైనా ఉంటే చూపించండి! నిజంగానే ఇదొక సామూహిక శక్తి! ఊరి ఎడల దార్శనికత! వాళ్ళైతే అలవోకగానే ఈ పనులు చేసుకుపోతుంటారు చూసే నాలాంటి వాళ్లకు ఒక్కోమారు వళ్లు గగుర్పొడుస్తుంది!

గంటన్నర పైగా శ్రమించాక నేటి తమ కృషికి సంతృప్తి చెందాక - 6. 20 కి జరిగిన సమావేశంలో:

- స్వయంగా నేనే గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలకు పూనుకొన్నాను. DRK గారి సమీక్షతో నేటి శ్రమ వేడుక ముగింపు.

            రేపటి ప్రయత్నం కూడ నూకలవారిపాలెం అడ్డ రోడ్డు దగ్గరే!

            ప్రాపంచిక స్వస్తతకై

పర్యావరణం రక్షణ ప్రతి యొక్కరి బాధ్యత

ప్రాపంచిక స్వస్తతకై ప్రకృతితో సఖ్యత

అందరికీ ఆహ్లాదం - కొందరిదా బాధ్యత?

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సాధిస్తుందా ఘనత?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.10.2023.