2909* వ రోజు....           13-Oct-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

                             ఈ శుక్రవారం శ్రమదానం ప్రత్యేకత - @ 2909*

          14.10.23 న కూడా వేకువ 4.19 కే – “ మంచు ఉంటే ఏమిటి - ఎక్కడా తగ్గేదేలే!

 అంటూ బందరు ఉప రహదారి మెరుగుదలకు ఉపక్రమించారు!  నేటి పాతిక మంది కార్యకర్తల్లో ఆ ఇద్దరే మహిళలూ, నలుగురు వృద్దులూ, నలుగురు డాక్టర్లూ, ముగ్గుర్నలుగురు బడి పంతుళ్లూ, ఉద్యోగులూ, రైతులూ, ఒక వ్యాపారీ!

          అది వీధి పారిశుద్ధ్యమేగానీ- మొరాయించిన మురుక్కాల్వలే గానీ- ఊరి చుట్టూ 8 రహదార్లే గానీ.... ఎక్కడే అవకరం కన్పించినా ఇందులో సగం మందికి నిద్ర పట్టదాయె! మరి మూడున్నరకే మేల్కొనకా - నాల్గుంబావుకే రహదారి సుందరీకరణకు దిగకా ఉండగలరా ?

           ఈ పరిస్థితిని చక్కటి సామాజిక బాధ్యతనాలో, దినదినమూ బ్రహ్మకాలపు తొలి అద్భుత దినచర్యనాలోశ్రుతి మించిన పట్టుదల నాలో, ఊరిని పట్టి పీడిస్తున్న ఏలిన్నాటి కాలుష్యం శని విరగడ నాలో- అదీ కాకపోతే వెర్రి అనాలో - ఎవరిష్టం వాళ్లది!

           ఐతే ఒకటి మాత్రం కాదనలేని యదార్ధం ! ఈ పిచ్చోళ్ల లక్షల గంటల శ్రమదానంతోనే:

- ఊరు ODF అయింది,

- కనీసం ముఖ్య వీధులన్నీ పరిశుభ్రపడ్డాయి,

- ఎక్కడా సందు లేనంతగా 30 వేల చెట్ల పచ్చదనం క్రమ్ముకొన్నది,

- చుట్టూ 8 రహదార్లు వృక్షాలంకృతములై ఇది స్వచ్ఛ శుభ్ర ... హరిత- సౌకర్య- సౌందర్య పరిపూరిత చల్లపల్లి సుమా!అని

ఋజువు చేస్తున్నాయి.!......

- కార్యకర్తలు బాగుపరచిన బస్ ప్రాంగణమూ, శ్మశానాలూ, కర్మల భవనాలూ, పార్కూ, రహదారి వనాలూ తిరి గివాళ్లనే ఏనాటి కానాడు పునరుత్తేజితుల్ని చేస్తున్నాయి !

          ఆ క్రమంలోనే ఈ ఉదయం సైతం తలా 100 నిముషాల వెచ్చింపుతో :

1) NH 21622 వ కిలోమీటరు దగ్గరి పూల చెట్లపాదుల గడ్డి, తీగలూ తొలగి, మొక్కలు మళ్లీ కనిపించాయి,

2) నష్ట జాతకపు 10 మొక్కలు గుర్తించబడి, వాటి బదులు క్రొత్త మంచివి రాబోతున్నాయి,

3) 200 గజాల రహదారి వాట్సప్ చిత్రంలో చూపినట్లు బాగా శుభ్ర పడింది. 

          నేటి శ్రమ వేడుక సమీక్షా సమయంలో రహదారి దద్దరిల్లేలా ఉద్యమ నినాదాలను గర్జించినది కోడూరు వేంకటేశ్వర మహోదయులు.

          బొత్తిగా తీరిక లేని పెద్ద వైద్యుడూ, ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడూ, లక్ష విరాళం ప్రకటించిన యువకుడూ - దాసరి వరుణుడు!

          రేపటి మన శ్రమదాన ప్రయత్నం కూడ ORC క్లబ్ రోడ్డు దగ్గరేనట ! 

             ఎవ్వరు వంద నార్హులు?

సుఖమునకు నిర్వచనమేదో - సంతసానికి అర్ధమేదో

సమూహం కృషి ఫలితమెట్టిదొ - ఐకమత్యం శక్తి ఎట్టిదొ

 మాటి మాటికి ఋజువు చేస్తూ ప్రజల మనసులు తట్టి లేపే

స్వచ్చ సుందర కార్యకర్తలు కాక ఎవ్వరు వంద నార్హులు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.10.2023.