2910* వ రోజు ....           14-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

2910* వ రోజుకు చేరిన స్వచ్ఛ సుందరోద్యమం!

          ఆ చేరిక ఈ శనివారం 4.19 - వేకువనే జరిగింది. ఆ నిముషాన కనిపించింది డజనుకు లోపే గాని, తుది సమావేశమప్పుడు లెక్కిస్తే – నినాదాలు చేస్తున్నది 31 మందిగా తేలింది!

          కార్య స్థలం లక్ష్మీపురం పంచాయతి పరిధిలో - బందరు ఉపమార్గంలో – శ్రీ చైతన్య విద్యాసంస్థ బాటకు దగ్గరగా. పని ముగింపు కాలం 6.05 ఐతే - సమావేశం ముగిసింది 6.30 కు!

          ఎవరికైనా ఈ శ్రమదానం ఒక రొటీన్ తంతుగా – అంటే - అదే చీపుళ్ల ఊడ్పుచప్పుళ్లూ, మొక్కల నాటుడూ, కలుపు పీకుడూ, ప్లాస్టిక్ సంచుల్లాంటి ఏక మాత్ర వాడకానికి పరిమితమైన వస్తువుల ఏరుడూ, మురుగ్గుంటలు బాగు చేసుడూ, గంటన్నర పిదప కాఫీ త్రాగుడూ, ఆ నాటి పని పురోగతిని చర్చించుడూ, మర్నాటి శ్రమ వివరం గుర్తించుడూ....వంటిదిగా అనిపిస్తుందేమో గాని –

          2910* నాళ్ళుగా రెప్పవేయక గమనిస్తున్న నాకు మాత్రం ఇదొక అరుదైన మంచి సామాజిక వేడుక సూచనగానూ, కుల మత గొడవల్లేని, స్వార్థం జాడల్లేని, మనుషులుగా పుట్టినందుకు చేస్తున్న కనీస కర్తవ్యం గానూ కనిపిస్తున్నది!

          తొమ్మిదేళ్ల నాడు - 12-11-2014 వేకువ అప్పటి జనవిజ్ఞాన వేదిక సంకల్ప బలం ఎంతటిదో - అప్పుడు గ్రామ బాధ్యత కోసం పడిన 14 మంది అడుగులెంత గట్టివో అని ఇప్పుడనిపిస్తున్నది! ఆ నాటి కొన్ని అనుమాన దృక్కుల్ని దాటుకొని, శ్రమదాన పాఠాల్ని నేర్చుకొని, స్వచ్ఛ కార్యకర్తలీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిణామం ఆశ్చర్యం కొలుపుతున్నది!

          అంతమంది నిర్ణీత స్థలంలో పరస్పరాభివాదాలు చేసుకొనే - సమంజస సత్కారాలకు ప్రేరణనిచ్చే ప్రబోధ గేయాలు వినే – ‘ఊరి మెరుగుదల’ అనే ఉమ్మడి లక్ష్యాని కంకితులయ్యే – అద్భుత దృశ్యం కవిత్వాలకూ, గానాలకూ అర్హం కాకపోతుందా?

- ఈ ఉదయం కూడ ఎలాగో కొన్ని పూల మొక్కల్ని NH216 కు ఉత్తరంగా ఇరికించారు,

- కదంబం లాంటి వృక్షాల్నీ నాటారు, I న్యూస్ కు చెందిన మధు, చింతలమడ నుండి నాని పాల్గొన్నారు.

          కోట పద్మావతి గారు ఉద్యమ నినాదాలు పలుకగా, Dr. DRK గారు సహర్షంగా సమీక్షించగా, నేటి శ్రమదానం ముగిసింది.

          రేపటి ప్రత్యేక శ్రమదానం శివరాంపురం ముఖ్య వీధిలో BDR ఇల్లు కేంద్రంగా జరుగుతుంది.

          అందరం పునరంకితం

పైకి కనిపించని సమాజం క్షణక్షణమూ చలన శీలం

మంచిగా వినియోగపెడితే మాటవింటది కాలచక్రం

అదే చాటుచు చెప్పుచున్నది స్వచ్ఛ – సుందర శ్రమ వినోదం

అందుకే స్వచ్చోద్యమానికి అందరం పునరంకితం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   14.10.2023.