2911* వ రోజు ....           15-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

ఆదివారం నాటి హరితానందం శివరాంపురంలో - @2911*

          15.10.23 - దేవీ శరన్నవరాత్రుల ప్రారంభాన – సదరు హరితహారం శివరామపురం నడిబొడ్డున 4.18 - 6.10 నడిమి కాలంలో కాస్త ఎక్కువ మంది చేత జరిగింది. ఆతిథ్య గ్రామస్తులూ, పంచాయతీ వారు, సందర్శకులు మొత్తం ఒక దశలో 40 మంది కన్పించారు.

          జరిగిందేమో ఒక సామాజిక పుణ్యకార్యం - 82 ఫల – పుష్ప వృక్ష జాతుల మొక్కలు ప్రధాన వీధికి తూర్పు - పడమరలుగా నాటడమే! మామిడి - నేరేడు - పండ్ల మొక్కలూ, సువర్ణ గన్నేరు వంటి పూల మొక్కల సింగారమే!

          అంతకు ముందు ఆ వీధి అస్సలు మొక్కలే లేక బోసిగా ఉందని కాదు - కదంబ, తాడి, కొబ్బరి చెట్లు పెరిగే ఉన్నాయి గాని, క్రమ శిక్షణతో - అదుపాజ్ఞల్లో పొందికగా కనిపించనప్పుడు - స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలూ - వారిలో ముఖ్యంగా శివరాంపురీయుడైన బాల దుర్గా రామ ప్రసాదూ చూస్తూ ఊరుకోలేకా - అంతకుముందు వేంకటాపురం నుండి ఇరు ప్రక్కలా నాటిన 400 చెట్లకు పొడిగింపుగానూ ఊరి ముఖ్య వీధిలో ఈ 82 చెట్ల అవతరణ!

          అందుకు గాను BDR దే నేటి చొరవా, ప్రేరణ! ఈ 4 కిలోమీటర్ల వేంకటాపురం రహదారి గానీ, నిన్నటితో ఒక కొలిక్కి వచ్చిన 2 కు పైగా కిలోమీటర్ల బందరు జాతీయ రహదారి గానీ, స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఫలితాలు! ఈ వేకువ వాళ్లు రానూ పోనూ ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణంచిన దారి గతుకులదే.

          చిన్నా - పెద్దా 82 చెట్లను నాటడం ఇందరు కార్యకర్తలకెంతో సేపు పట్టలేదు - అంతకుముందే కొన్ని చోట్ల గోతులు త్రవ్వడం వల్ల - కొలతల ప్రకారం ఏ పండ్ల మొక్కలెక్కడ, ఏ పూల మొక్కలెక్కడ నాటాలో నిర్ణయమైయున్నందున - అప్పటికే వేల సంఖ్యలో నాటి పెంచిన అనుభవజ్ఞులు కావడం చేత పని త్వరగానే ముగిసింది గాని - BDR ఆతిథ్యమే కాస్త ఆలస్యమై కార్యకర్తలిళ్ళకు చేరే సరికి 7.00 దాటింది!

          అల్పాహారానికి ముందు సమావేశం BDR ప్రకటించిన నినాదాలతో మొదలై, DRK గారి సమీక్షతోనూ - రత్నగిరి, బుజ్జి, EO రామకోటేశ్వరరావుల ప్రతిస్పందనలతోనూ గడిచింది. ఈ సందర్భంలో ప్రసంగించిన మోపిదేవి EO గారు ఇకపై శ్రమదానంలో తప్పక పాల్గొంటానని వాగ్దానించారు.  

          ఇప్పటికిదొక గ్రామ వీధి హరితాలంకరణం! ఈ చెట్లు పెరిగి, ఫలించి, పుష్పించినప్పుడది ఎనలేని ఆహ్లాద కారణం!

          మన బుధవారం నాటి చల్లపల్లి వీధి బాధ్యత మాత్రం పోలీసు ఠాణా వీధి వద్ద మొదలగును.

          అహం మీసం త్రిప్పుతుంటే

స్వార్ధములు తొడ కొట్టుతుంటే - అహం మీసం త్రిప్పుతుంటే –

బిడియములు, సందిగ్ధతలు మరి కొంత మందిని అడ్డుకొంటే –

అడ్డుగోడలు దాటుకొంటూ - బాధ్యతలు గుర్తుంచుకొంటూ

గ్రామ సేవకు దిగే వారలు కదా అభివందనార్హులు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.10.2023.