2912* వ రోజు....           16-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

                                        2912* వ ప్రయత్నం!

          అది సోమవారం (16.10.2023) కనుక పరిమిత సంఖ్యలో రెస్క్యూ దళం అనబడే కొందరు కార్యకర్తల కృషి 4.27 నుండి 6.12 దాకా గంగులవారిపాలెం బాటకనుబంధంగా - శాయి నగర్ తొలి వీధిలో జరిగింది.

          అలాగని ఆ నలుగురైదుగురికే  ఆ వీధి పారిశుద్ధ్య కృషి పరిమితమైపోలేదు. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు బడి పంతుళ్ళు, ఒక జర్నలిస్టు వగైరాలు నిముష క్రమంలో వాళ్ళతో కలిసారు. అలవాటైన ప్రాణాలు మరి. ఇంటి దగ్గర కాలం గడపలేరు కదా!

          వాళ్ళు సుందరీకర్తలో, రెస్క్యూ సభ్యులో, ఎవరైతేనేం గాని వీధి ఏదైతేనేం గాని వాళ్ళ పని షరామామూలే ముందు మురుగ్గుంట సంగతి చూస్తారు, తామంతకుముందు నాటిన మెట్ట తామర, గద్ద గోరు వంటి పూల మొక్కల క్షేమ సమాచారం పరిశీలిస్తారు, ఇంకేవైన కొత్త మొక్కలు నాటగలరేమో చూసుకుంటారు, వాట్సప్ చిత్రాలలో  చూపినట్లు వీధిని ఊడ్చేస్తారు, పాదుల్లో గడ్డేమైన మిగిలిందేమో చూసి పీకుతుంటారు....

          వేల రోజులుగా వాళ్ళిదే పనిలో ఉంటే మరి రాష్ట్రంలో కెల్లా చల్లపల్లి, ఆ చల్లపల్లిలో కూడా గంగులవారిపాలెం వీధి ఇంత పరిశుభ్రంగా సుందరంగా మారక ఏమవుతాయి?

          మిగిలిన చెత్త ప్రోగుల్ని ట్రక్కులోకి ఎక్కించుకుని 6.15 తరువాత పద్మాభిరామం గేటు దగ్గర వరుస క్రమంలో నిలబడి ఆ 15 మందీ ఒక పశు వైద్యుని నాయకత్వంలో గ్రామ స్వచ్చ సుందర నినాదాలను ఎలుగెత్తి చాటుతున్న దృశ్యం కూడా ప్రతి రోజూ వంటిదే.

          హర్షణీయం దర్శనీయం

స్త్రీలు వేకువ గడప దాటీ - వృద్ధులూ రోడ్డెక్కుతుంటే

ప్రముఖ వైద్యులు, వృత్తికారులు గ్రామ సేవకు కదలుతుంటే

వణిక్ ప్రముఖులు, కృషీవలురూ వచ్చి చీపురులందుకొంటే

దృశ్యమెంతటి హర్షణీయం! సమాజానికి దర్శనీయం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   16.10.2023.