2913* వ రోజు ....           17-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

రెస్క్యూ దళం వారి 2913* వ శ్రమదానం!

          మంగళవారం వేకువ సైతం తొలుత 5 గురిదీ, క్రమక్రమంగా 4 గురిదీ మరొకమారు అదే వీధి. శాయినగర్ ప్రథమ వీధీ - ఆ పారిశుద్ధ్య –పరిశుభ్ర – సుందరీకరణ చర్యలూ ! అనగా నిన్నటి కృషికి పొడిగుంపుగానన్నమాట!

          ఈ వీధి మెరుగుదలలోనూ - అంటే ఊడుపులోనూ, పర్యవేక్షణలోనూ ఇద్దరు సీనియర్ వైద్య కార్యకర్తలూ, ట్రస్టు సంబంధీకులూ, వయోధికుడూ ఎంతో కొంత పాత్రలు నిర్వహించారు!

          క్రొత్తగా మొక్కలు నాటడం తప్ప - స్వచ్ఛ సుందర చల్లపల్లి సాకారత దిశగా ఎంతగా ప్రయత్నించాలో అంతగానూ ఈ 9 మందీ ప్రయత్నించారు కనుకనే ఈ వీధిలో 90% ఇప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది!

          కార్యకర్తల ప్రయత్నలోపం ఎప్పుడూ ఉండదు – ఈ వేకువ కూడ వీళ్లు రోడ్డు దుమ్ముపైన చతికిలబడి కూర్చొనీ, వంగొనీ, గడ్డి పీకారు, కొన్ని పూల మొక్కల పాదులు బాగు చేశారు; కసవులూడ్చి ఎత్తారు.

          నిజానికివన్ని ఎవరింటి పరిసరంలో వారు తీసుకోదగిన జాగ్రత్తలు! ఇప్పుడు దసరా నవరాత్రుల వేడుకల్లో మునిగిపోయినందున గానీ, ఈ వీధిలో కొందరు బాధ్యత వహించగలిగిన వారున్నారు! చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం పట్ల గౌరవ మర్యాదలు చూపే సహృదయులూ ఉన్నారు! కానీ

          ఈ ఉదయం కూడ 6.15 వేళ పద్మాభిరామం ద్వారం ఎదుట కార్యకర్తలు మాలెంపాటి డాక్టరు గారి నేతృత్వంలో స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను ప్రకటించారు!

          రేపటి వేకువ శ్రమదాన నిమిత్తం మనం కలిసి సాగవలసిన చోటు - బందరు వీధిలో పోలీస్ స్టేషన్ మలుపు వద్దనే!

          భవిత భద్రం అన్నమాటే

ముఖస్తుతులకు దిగుటకంటే - “ఆహ! ఓహో” అనుట కంటే –

ఒడ్డు నుండే సూచనలు, సలహాలు విసరే చర్యకంటే

ఎవరి ఇంటిని ఎవరి వీధిని వారు శుభ్రం చేసుకొంటే

స్వచ్ఛ సుందర చల్లపల్లికి భవిత భద్రం అన్నమాటే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   17.10.2023.