2914* వ రోజు ....           18-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

నేటిది స్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో 2914* వ ప్రయత్నం!

          బుధవారం (18.10.23) వేకువ 4.18 నుండి జరిగిన ఆ ప్రయత్నంలో 27 మంది! వాళ్ల కృషితో గణనీయంగా బాగుపడిన గ్రామ విభాగం బందరు బాటలోని ATM కేంద్రమనబడే 200 గజాల రద్దీ ప్రాంతం! అంటే – సంత వీధి మొదలు పబ్లిక్ టాయిలెట్ల దాక!

          అక్కడే స్థానిక దేవతలూ, తిరుపతి పెద్ద దేవుడూ, బ్యాంకులూ, డజన్ల కొద్దీ షాపులూ, టిఫిన్ సెంటర్లూ, తోపుడు బళ్లూ, పళ్ల, కూరల అంగళ్ళూ, పిండి మిల్లూ వగైరాలు! ఇంకా అయ్యప్ప దీక్షలూ, శరన్నవరాత్రుల భక్త జనుల ఊరేగింపులున్నూ! వచ్చే పోయే వాహనాలూ, ఇసుక బళ్లూ....

          సుమారు 40 రోజులై ఉంటుంది - స్వచ్ఛ కార్యకర్త లీ NH216 రద్దీ రహదారిని ఊడ్చి! ఇక అక్కడెంత ఇసుక – దుమ్ము – కాగితం పొట్లాలు, డ్రైన్ల గడ్డీ, మురుగు నీట తేలియాడే ప్లాస్టిక్ వ్యర్ధాలూ వచ్చుంటాయో ఊహించుకోవచ్చు. దుకాణదారుల్లోనూ, ఆలయ సందర్శకుల్లోనూ బొత్తిగా స్వచ్ఛ స్పృహ లేదని కాదు – అందరిలో లేదనీ - అవగాహన చాలడం లేదనేదే ఇక్కడ విషయం!

          అందుకే రోజూ పాతిక – ముప్పై మంది స్వచ్ఛ కార్యకర్తలకు గంటన్నర చొప్పున చేతి నిండా పని! - ఒకటో, రెండో కాదు - 9 ఏళ్లుగా!

          ఒక్క ATM ల దగ్గరే సగం మంది శ్రమించవలసి వచ్చింది. 2 రకాల చీపుళ్లు చేబూని కొందరూ, గోకుడు పారల్తో కొందరూ, విశాల రహదారిని దుమ్ముదులుపుతుంటే,

          గడ్డినీ, వ్యర్థాల్నీ పీకి, ఏరి కొందరు ప్రోగులు పెడుతుంటే, ఒక ట్రాక్టర్ లోకి ఇసుక - దుమ్ము గుట్టల్నీ, ఇంకో టాటా ఏస్ లోనికి ఇతర వ్యర్దాల్ని సేకరిస్తుంటే - గంటన్నర కాలమిట్టే గడిచిపోయింది!

తెల్లారాక చూస్తే?

          20 x 150 గజాల దారంతా పరిశుభ్రం! అది సాధించిన కార్యకర్తల బట్టల్నిండా దుమ్మూ, కొందరి ముఖాల్నిండా చెమట చుక్కలు! అందరిలోనూ తామీ వేకువ చేసిన మంచి పని పట్ల సంతృప్తీ!

          6.20 వేళ ఆకుల దుర్గా ప్రసాదుని గళ వినిర్గళ గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాన్ని అందరూ పునరుద్ఘాటించారు.

          రేపటి వేకువ ATM ల దగ్గరే ఆగి, 3 రోడ్ల ప్రధాన కూడలి దాక శ్రమించాలని నిర్ణయించారు!

          అనకొండో అనిపిస్తది

పెను కొండలొ, ప్లాస్టిక్కుల అనకొండో అనిపిస్తది

చూస్తేనే డోకొచ్చే మస్తగు కాలుష్యం అది!

ఊరేదైన సర్వ సాధారణ దృశ్యం అది

అందుకు మినహాయింపొక అందమైన చల్లపల్లె!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   18.10.2023.