2915* వ రోజు....           19-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

2915* వ వేకువ బాధ్యతల వివరాలు

          గురువారం (19-10-23) నాడవి 4.18 AM కే మొదలై, 6.05 కు ముగిశాయి! బాధ్యుల సంఖ్య 24, పని చోటు ATM ల నుండి 3 ముఖ్య రోడ్ల కూడలి దాక! ప్రోగుబడి, ట్రాక్టర్ సగం నిండిన ఇసుక – దుమ్ము మిశ్రమం కాక – కొంత గడ్డీ, ప్లాస్టిక్ వ్యర్థాలు, చిత్తు కాగితాలూ వగైరా!

          నిన్నటి, నేటి కృషితో సంత వీధి మొదలు – ఏడెనిమిది గజాలు మినహా గ్రామ ముఖ్య కేంద్రం దాక స్వచ్ఛ – సుందరోద్యమం ‘మార్కు’ స్పష్టంగా కనిపిస్తున్నది చూడండి! 3 వీధుల సెంటర్ కూడ  బాగుపడవలసిందే గాని...

          3 పండ్ల కొట్లూ, 3 టిఫిన్ బళ్లూ, బందరు బస్ స్టాపూ, బాటకు దక్షిణాన మోటారు బళ్ల షెడ్లూ, చిన్న కార్ల నిలుపుదల చోటూ కార్యకర్తల్ని ముందుకెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుపడ్డాయి! పెట్రోలు బంకు దగ్గరి టాన్స్ఫార్మర్ దగ్గర మాత్రం వ్యర్ధాలు తగ్గిపోయినవి!

          ఎవరి సైకిల్ షాపుల ఎదుట, బేకరీల ముందు, మందుల షాపుల దగ్గర వారు తమ దుకాణాలు మూసే వేళ కాస్త శుభ్రం చేసుకోవచ్చు గదా! ఆ విధంగా స్వచ్ఛ కార్యకర్తల పని భారం కొంత తగ్గించిన వారౌతారు గదా!

          “అందరి ఆరోగ్యం - అందరిదీ బాధ్యత” వంటి సూక్తులు కేవలం వినడానికేనా? గ్రామ శుభ్రత కార్యకర్తలదేనా? ద్విచక్ర వాహన విక్రయ దుకాణ ప్రాంతంలోనే ఐదారుగురికి మట్టి గోకే, ఊడ్చే పనిబడింది.

          తెల్లారే కొద్దీ ఆలయ సందర్శక భక్తులూ, దేవతా విగ్రహాల ఊగింపుదారులూ, ప్రయాణికులూ స్వచ్చ కార్యకర్తల శ్రమను ప్రత్యక్షంగా చూస్తూ వెళ్తున్నారు. మరి ఎందరిలో గ్రామ స్వచ్ఛ – శుభ్ర స్పృహ కలగిందో చెప్పలేము!

          రోడ్డైతే చూడ చక్కగా ఉంది గాని, దుమ్మూ - ధూళీ గుట్టలైతే ట్రాక్టర్లో కెక్కి తరలిపోదగిన చోటికి పోయినవి గాని, వ్యర్ధాల ప్రోగులు మాత్రం మిగిలిపోయినవి - అవి పంచాయతీ ట్రాక్టరు వంతన్న మాట!

          ఈ నాటి తుది సమీక్షా కాలంలో తన గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ సంకల్పాన్ని పునఃపునరుద్ఘాటించిన వారు గ్రామ ప్రథమ మహిళ కాగా – సోమర్ సెట్ మామ్ సూక్తులు వినిపించిన వ్యక్తి అడపా వారు! 

          రేపటి మన వీధి పారిశుద్ధ్య కృషి అవనిగడ్డ బాటలోని కూల్ డ్రింక్ దుకాణాల వద్ద ఆగి ప్రారంభించవలసి ఉన్నది!

          సమకాల మందు విశిష్టం

పరస్పరం అభివాదం, ప్రతి వేకువ శ్రమదానం

ఐతే అది ఊరంతటి ఆహ్లాదం నిమిత్తం

స్వార్థం వాసన సోకని సామాజిక చైతన్యం

కావుననే అది మన సమకాల మందు విశిష్టం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   19.10.2023.