2916* వ రోజు ....           20-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

2916* వ నాటి గణనీయ శ్రమదానం!

          శుక్రవారం  (20-10-23) వేకువ సైతం 4.18 కే అది బందరు వీధిలోని ఇండియన్ బ్యాంకు వద్ద,, 3 రోడ్ల ముఖ్య కూడలిలోనూ, ఏక కాలంలో మొదలై అవనిగడ్డి వైపుగా పొట్టి శ్రీరాములు వీధి వద్ద 6.09 కి ముగిసింది. కాకపోతే కార్యకర్తల బలగం నిన్నటి కన్న పెరిగి, 31 కి చేరింది. నేటి శ్రమదానంలో 3 ముఖ్య ఘట్టాలు:

          అందులో మొదటిది వినాయకగుడి ప్రాంతంలో అక్కడ ఊడ్చిన దుమ్మూ, సైకిల్, చెప్పుల దుకాణాల దగ్గర వాటెడు ప్లాస్టిక్ వ్యర్ధాలూ సరే - డ్రైను నుండి ఎందుకంత ఘాటు కంపు వస్తున్నట్లు?

          ఈ చోటుకు ఉత్తరంగా ఉన్న కూల్ డ్రింక్/ సీతాఫలాల పెద్ద సైజు త్రోపుడు బండి చోటే 8 మందికి అసలైన పరీక్ష పెట్టింది. ఆ వ్యర్ధాల నిధిని కనిపెట్టింది ఒక మాజీ కేంద్ర ప్రభుత్వోద్యోగ కార్యకర్త! అంత బరువైన బండినీ అమాంతం ఎత్తి రోడు మీద పెట్టడమూ, తరగని దిక్కుమాలిన ఛండాలాలన్నిటినీ, డ్రైను వ్యర్థాల్నీ, 40 కి పైగా డిప్పలకెత్తడమూ చూస్తే మనసు చలించక తప్పదు! ఆ అష్ట కార్యకర్తలకీ “శ్రమ వీర చక్ర” “మురుగురత్న” “మట్టి పని వీర” వంటి బిరుదులెన్ని ఇచ్చినా తక్కువే!

          రెండోది మూడు రోడ్ల కూడలి. పూల, పండ్ల అంగళ్లు, టీ దుకాణాలూ, శీతల పానీయాల కొట్లూ - వచ్చే పోయే బస్సుల రద్దీ - అంతా అక్కడే!

          ఇక మూడో శ్రమదాన ప్రస్ధానం పెట్రోలు బంకు మీదుగా పోస్టాఫీసు వీధి దాటుకొని, వైశ్య వీధి దాక! ఎన్ని దుకాణాల ముందు ఎన్ని వ్యర్ధాల ప్రోగులు చేసిందీ వాట్సప్ చిత్రంలో చూడండి.

          CPM నుండి ఈ వేకువ ఇద్దరు – మధు, కరీముల్లా - శ్రమదాతల హాజరు! మొత్తమ్మీద నేటి వీధి పారిశుద్ధ్య కృషి ఎక్కడికక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ తో సాఫీగా జరిగిపోయింది. ఫలితంగా మరొక సువిశాల రద్దీ రహదారిలో సగ భాగం బాగు పడింది!

          ఐతే ఎవరిదీ ధన్యత? ఎవరిదీ మాన్యత? ఎవరిదీ ఈ గుర్తింపదగిన సామాజిక బాధ్యత? చూస్తూ కూడ సహకరించని ప్రేక్షక పాత్రధారులదా - సంతోషంగా శ్రమించిన 30 మందిదా....

          6.20 సమయంలో మైకు పని చేయక - ముమ్మారు  గ్రామ స్వచ్చోద్యమ సంబంధిత నినాదాలను ఆస్థాన గాయక శ్రీనుడు ప్రకటించగా -  

          రేపటి వేకువ శ్రమదాన వేడుక పొట్టి శ్రీరాములు వీధి దగ్గరి ఉలవల కొట్టు దగ్గర మొదలగునని  నిర్ణయించగా...

          వినుతించిరొ – గణుతించిరొ

ఎందరు సందర్శించిరొ – వినుతించిరొ – గణుతించిరొ

తమ గ్రామాల్లో సైతం శ్రమదానం మొదలెట్టిరొ

అందు సగం మందైనా అది కొనసాగించిన చాలును

చల్లపల్లి శ్రమ వేడుక సార్థకమగునను కొందును!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.10.2023.