2917* వ రోజు ....           21-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం !

శనివారం(21-10-23) నాటిది 2917* వ వీధి పారిశుద్ధ్యం!

          శ్రమదాతలైతే  33 మంది, అందులో కొందరు 4.18 కే కలుసుకొన్నది పొట్టి శ్రీరాములు వీధి దగ్గర, ఆ తదుపరి వచ్చిన వాళ్లు పారిశుద్ధ్య పనిముట్లు చేబూని, ఇసుకా దుమ్ము దులిపినది ½  కిలోమీటరు పొడవునా!

బస్ ప్రాంగణంలోకి వెళ్లలేదు గాని - ఆంజనేయుని పెద్ద గుడి ఉన్న 4 రోడ్ల కూడలి మీదుగా పడమర వీధి సగం దాక సదరు పారిశుద్ధ్య యాత్ర కొనసాగింది!

          బస్టాండు ప్రవేశ ద్వారం వద్ద నిలవ మురుగు కంపును తట్టుకోవడం కొందరికి కష్టమయింది. కార్యకర్తల్లో సగం మంది అనగా 16 మంది - అందులో ముగ్గురు జంట చీపుళ్లతోనూ, మిగిలిన వారు ఒంటి చీపురుతోనూ ఊడ్చి, మందంగా పేరుకొన్న దుమ్మూ - ఇసుకల్ని ప్రోగులు చేస్తూనూ, ముగుర్నలుగురు గోకుడు పారలు వాడుతూనూ – చిరు చీకట్లో లేస్తున్న ధూళి మేఘం మధ్య ఏడెనిమిది మంది వాలంటీర్ల శ్రమే అసలైన సుందర దృశ్యం!

          ఈ ఉదయం కూడ మట్టీ/ ఇసుక గుట్టలైతే లోడింగు పూర్తయింది గానీ - ప్లాస్టిక్ వస్తువుల, సీసాల గుట్టలూ, గడ్డి ప్రోగులూ కొన్ని మిగిలిపోయినవి.

          కట్టెలడితీలవారు, టైర్ల కొట్ల వారు, హోటళ్ల వారు గతం కన్న కొంత బాధ్యతగా ఉన్నారు గాని- ఈ పూట కార్యకర్తల్తో ఎవరూ సహకరించలేదు. అంత మాత్రాన శ్రమదానం ఆగుతుందని కాదు గాని, పూర్తి గ్రామస్తుల్లో సంపూర్ణ సామాజిక చైతన్య సమయం ఇంకెంత కాలానికి ?

          మొత్తానికి ఈ ఉదయం వాలంటీర్ల శ్రమ రాశితో బాటు పని వాసి కూడ ఎక్కువగానే ఉన్నది. ఆ సంగతి శ్రమ దాతల ముఖాల్లో సంతృప్తే  తెలియజేస్తున్నది.

          6.10 కి పని ముగించాక - ప్రారంభస్తలానికి రావడం - దూరమై ఆలస్యమయింది!  దానికి తోడు మల్లంపాటి వాని నిమ్మపళ్ల వితరణా, లంకే సుభాషిణి పప్పుండల పంపిణీ వల్ల -

          6.30 కి - మైకు లేని కారణాన కోడూరు వేంకటేశ్వరుని గర్జా సదృశ స్వచ్ఛోద్యమ నినాదాలు వినిపించినవి!

          కొద్ది పాటి చర్చ తర్వాత రేపటి శ్రమ కోసం అగ్రహారం తొలి వీధి - పాల విక్రయ కేంద్రం వద్ద అందరూ కలుసుకోవాలనే నిర్ణయం జరిగింది.

          ఒజ్జ బంతిగ గౌరవిస్తా!

అది వినాయక చవితి గానీ, ఏ శుభప్రద ఘడియగానీ

ముంచు వానలొ-మంచు సోనలొ - అంచనాల ప్రకారముగనే

ఊరి వీధులు తీర్చిదిద్దుట కుద్యమించే కార్యకర్తల

ఉత్తమ శ్రమదాన శీలత నొజ్జ బంతిగ గౌరవిస్తా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.10.2023.