2918* వ రోజు ....           22-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం !

          బెజవాడ బాటలోని 200 గజాల వీధి పారిశుద్ధ్య కృషి - @ 2918*

          శోభకృత్ నామ సంవత్సర – భాద్రపద -  విదియ - అష్టమి నాటి 35 మంది సామాజిక కార్యకర్తల ఆదివారపు సేవల వివరాలు తెలుసుకొందాంరండి!

          చల్లపల్లిలో సదరు కార్యకర్త జాతీయులు 150 మందికి పైగా ఉంటామండి! అందులో సగం మందైతే బాగా చురుకైన వాలంటీర్లండి! అందులో పాతిక - ముఫ్ఫై మందిమి ప్రతి వేకువా 4.30 - 6.30 మధ్య ఊళ్లో ఏ వీధిలో గలీజులుంటేనో - మురుగు కాల్వలు ముందుకు నడవక చోద్యం చూస్తుంటేనో- సంబంధిత ప్రభుత్వ శాఖ పట్టించుకోక రోడ్లు గుంటలు పడితేనో - శ్మశానాల్లో, బస్ స్టాపుల్లో, బడుల్లో, గుడుల్లో పరిశుభ్రత తగ్గితేనో అక్కడికి పోయి చాతనైనంత మెరుగుపరుస్తామండి!

          ఊరి వీధులే కాదు – మా ఊరి చుట్టూ రహదార్ల బారునా వేలాది చెట్లు నాటి, పూల మొక్కలు పెంచి, ఆహ్లాదకరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటామండి! 9- 10 ఏళ్ల నుండి మాకిదొక వ్యసనంగా మారిందనుకోండి! అన్నట్లు- ఈ గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ కారుల్లో పొరుగూళ్లవారు కూడ వచ్చి కలుస్తారండి! లేకపోతే  “ఈరోజు  సమాజ బాధ్యత తీర్చామనే” సంతృప్తి దక్కక నిద్రపట్టదట!

          ‘ Birds of Same feather Come together’  (ఏ గూటి పక్షులాగూటికి చేరతాయి) అన్నట్లు ఈ మురికి- బురద- పనుల్లో అప్పుడప్పుడూ బెజవాడ- హైదరాబాద్ - అమెరికా వంటి కొన్ని పక్షులు కూడ కలుస్తుంటాయండి ! చల్లపల్లికి దూరంగా ఉండి గ్రామ బాధ్యతలు పంచుకోలేని లోటును కొందరు మా స్వచ్చోద్యమానికి ఆర్ధిక- హార్దిక సహకారంతో తీరుస్తారండి! 

          ఈ స్వఛ్ఛంద శ్రమదాతల్లో అన్ని వయసుల-  సామాజిక వర్గాల -  వారూ ఉంటారుగాని-పాతికేళ్ల లోపు యువకులు తక్కువగా ఉండడమే దిగులండి! గంటన్నర శ్రమదాన వేళ ఏ కుల-మత- వర్గ ప్రాంతీయ - రాజకీయ ప్రస్తావనలూ ఉండక- “మనం పుట్టి -పెరిగి - జీవిస్తున్న ఊరికే మాత్రం ఉపయోగపడగలం”  అనేదే ఆలోచిస్తారండి!

          ఈ వేకువైనాఅంతేనండి - కావాలంటే వాట్సప్ ఫోటోలు చూడండి, ఎన్ని గుట్టల దుమ్ము – ఇసుక- చెత్తా ప్రోగులు చేశారో,ఒక బడి పంతులుగారు పాడుబడిన- బీడు పడిన దుకాణంలో దూరి ఎంతగా శుభ్ర పరచిందీగమనించండి. తక్కినవట్లా ఉంచి- ధూళి మేఘం మధ్య ఏడెనిమిది మంది పెద్ద ట్రక్కును ఇసుకా– దుమ్ముతో నింపే దృశ్య మాధ్యమాన్నైనా పరిశీలించండి !

6.30 కు ముగిసిన నేటి సమీక్షా సమావేశంలో :

1) గ్రామ సర్పంచి గారి పలహార పంపకమూ,

2) మాలెంపాటి డాక్టరు గారి దూధ్ పేడా వితరణమూ,

3)మల్లంపాటి రైతుగారి నిమ్మ పళ్ల పందేరమూ,

4) గోళ్ళ వేంకటరత్నం గారి స్వచ్చోద్యమ నినాద పరవశమూ,

5) గురవయ్య గురుని సూక్తి ముక్తావళి,

6) బుధవారం వేకువ కూడ మనం కలువదగిన చోటు ఇదే రోడ్డులో రామాలయం వద్దననే నిర్ణయమూ....

     ఇక ఉంటా మండి!

        ద్విగుణీకృతమౌతుంటది!

ఎంత వ్రాసినా ముగియదు, ఏ కోణం నుండైనా

ఎవరి శ్రమను పరీక్షించిన ఏ దోషం పొడగట్టదు

 అది స్వార్థం కానప్పుడు- అది సామూహికమైనందున

శ్రమదానపు సామర్థ్యం ద్విగుణీకృతమౌతుంటది!

ఇట్లు  నేటి స్వచ్చ సుందర శ్రమ దాతల తరపున

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.10.2023.