2919* వ రోజు ....           23-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

2-3 ఊళ్లు దాటి బోడగుంటలో స్వచ్ఛంద సేవలు - @2919*

          ఎక్కడ చల్లపల్లి ఎక్కడ బోడగుంట? వేకువ 4.27 కే అంతదూరం వెళ్లి, ఈ సోమవారం విశేషించి విజయదశమి నాడు (23-10-23) చల్లపల్లి కార్యకర్తలూ, వాళ్లకుతోడు స్థానికులూ, రోడ్డు వార 26+3 మామిడి మొక్కలు నాటడమేమిటి?

          రహదారి వెంట మొక్కనాటి పెంచరా - కలవాడు లేనివాడు నిన్ను తలచురాఅని ఒక సినిమా కవి (తెనాలి రామకృష్ణ - సముద్రాల - సీనియర్ ఘంటసాల....) పాట గుర్తొస్తున్నది. అసలు విషయమేమంటే

          చల్లపల్లి స్వచ్చోద్యమకారుల్లో కొందరు రెస్క్యూదళం పేరుతో సోమ - మంగళవారాల గ్రామ సేవల అవకాశం దక్కించుకొన్నారు గదా! ఇక్కడి మరొక కార్యకర్త - తాతినేని వేంకటరమణ తన మనుమని, అల్లుని - కొల్లి లోచన్, కొల్లి మోహనకృష్ణ ల మొదటి, 30 వ జన్మదినం సందర్భంగా - ముందస్తుగా 31 చిన్న రసం మామిడి మొక్కల్ని (11-12 వేల ఖర్చుతో) రావివారిపాలెం - బోడగుంటల నడుమ నాటించారు.

          అందువల్ల ఊరి పొలిమేరలు దాటి రెస్క్యూ టీము ఆరేడుగురు కాక - స్థానిక గ్రామస్తులు కూడ పూనుకొని 28 అడుగులకొకటి చొప్పన బోడగుంట దాక 28 చెట్లు నాటి, 3 చెట్లను ఖాళీ చూసి నాటు కొమ్మని గ్రామస్తులకిచ్చి వచ్చారట!

          2300 ఏళ్ల నాడు అశోక చక్రవర్తి ఇలాగే చెట్లు నాటించాడని ఇప్పటికీ చెప్పుకొంటున్నాం! చెట్లు నరికించి, రహదార్లను త్రవ్వించే పాలకుల్నీ చూశాం! చరిత్ర అన్నిటినీ గుర్తుపెట్టుకొంటుంది.

          సరే - ఏదైతేనేం - అరేడు కిలోమీటర్లు పండగ పూట ప్రయాణించి, రోడ్డు ప్రక్క చెట్లు నాటే హరితీకరణాన్నిఅక్కడ 2 ఊళ్ల వారికంటించి వచ్చిన స్వచ్ఛ కార్యకర్తలభివందనీయులు!

          రెస్క్యూ టీంలో క్రొత్తగా చేరిన షణ్ముఖ శ్రీనివాస వ్యాపారి వినిపించిన స్వచ్చోద్యమ నినాదాలతో నేటి వేకువ బాధ్యతల పరిపూర్తి!

          నిత్య నూతన శ్రమ విరాళం

ఓ ప్రచేతన శీలులారా! ఓ మహోత్తమ శూరులారా!

సొంత ఊరిని సమార్చించే స్వచ్ఛ సుందర ధీరులారా!

ఒక్క పరి మీరనుసరించే ఉన్నతోన్నత సమయదానం

నిత్య నూతన శ్రమ విరాళం ఎట్లు సాధ్య విప్పి చెప్పుడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.10.2023.