2920* వ రోజు ....           24-Oct-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

రెస్క్యూ & బ్యూటిఫికేషన్ పనుల్లో మరొక వేకువ - @2920*

          మళ్లీ వేకువ 4:27 సమయమే - మంగళవారం (24.10.23) రోజున కూడ 6 గురు అసలు కార్యకర్తలకు మరో 6 గురి సహకారం లభించి, గంగులవారిపాలెం వీధిలో – మా ఇంటి ఎదుట జరిగిన గంటన్నర పారిశుద్ధ్య/ సుందరీకరణ పనుల వివరాలు :

          ఏ 40 రోజుల్నాడో కొంత పని జరిగి, ఈ నడుమ పడిన వానలకు మా ఇంటి బాహ్య ఉద్యానంలో బాగా గడ్డి పెరిగి, పూల తీగలూ – క్రోటన్ మొక్కలూ విచ్చలవిడిగా పెరిగినందున రెస్క్యూ దళం వారి చూపు దాని మీద పడింది.

          ఆ గడ్డిలోనే నేల మీద కూర్చొని కొడవళ్లతో కలుపంతా తొలగించడం నేటి ముఖ్య కార్యం. అడ్డదిడ్డంగా కరెంటు స్తంభానికల్లుకొన్న పూల తీగల్నీ - నూరు వరహాల్లాంటి పూల చెట్ల కొమ్మల్నీ అదుపు చేసింది మరొక కార్యం.

          ఇందుగ్గాను పూల - పండ్ల మొక్కల విక్రేత వేంకటరమణుడు క్రొత్తగా తెప్పించిన ‘Edge Cutter’ యంత్రానికి ఈ ఉద్యానం ప్రయోగశాలయింది!

          కలుపు మొక్కల - చెట్ల కొమ్మల వ్యర్థాలన్నిటినీ ఒక అయ్యప్ప దీక్షిత స్వచ్ఛ కార్యకర్తే ట్రాక్టర్లోకి చేర్చాడు!

          ఉదయపు వాహ్యాళి ముగించిన నలుగురు కార్యకర్తలు కూడ వచ్చి, గత రాత్రే అమెరికా నుండి వచ్చిన పాక్షిక సమయ కార్యకర్త కూడ కలిసి, క్రమంగా సందడి పెరిగింది!

          శ్రమ వేడుక 6:05 కు ముగిసిందో లేదో- దసరా భక్తుల - మైకు పాటల వేడుక మొదలయింది.

          శ్రమదానం ముగించగానే డజను మంది కార్యకర్తలూ కొద్ది గంటల ముందే U.S.A. నుండి వచ్చిన దాసరి స్నేహ ననుసరించి స్వగ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు ప్రకటించారు.

          రేపటి వేకువ సమయపు మన విస్తృత శ్రమదానం మొదలు కావలసిన చోటు విజయవాడ మార్గంలోని పురాతన శివాలయం దగ్గరే!

          కర్మిష్టుల సాహసం

ప్రతి వేకువ గంటన్నర ప్రగతి శీల సన్నాహం

అతి సాధారణ జీవుల అసామాన్య శ్రమదానం

కన్న కలల యదార్థతకు కర్మిష్టుల సాహసం

ఏదో ఒక వీధిలోన ఎగురు స్వచ్ఛ పతాకం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.10.2023.