2921* వ రోజు ....           25-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

మళ్ళీ ఋజువైన శ్రమయేవ జయతేసామెత - @2921*

          బుధవారం - అనగా 25.10.23 వేకువ 4.16 - 6.10 మధ్య వేళలో అది రుజువు పరచిన కార్యకర్తలు 24 మంది. తమ శ్రమదానానికి వాళ్లెన్నుకొన్న గ్రామ భాగం బెజవాడ దారిలోని శివాలయ ప్రాంతం.

          పెద్ద పర్వదినాల్లో కొందరు సొంత ముక్తి కోసం భక్తి బాట పట్టి దేవుళ్లను ఊరేగిస్తుంటే - ఈ స్వచ్ఛ కార్తకర్తలెన్నుకొన్నది మొత్తం గ్రామ సమాజం యొక్క కాలుష్య విముక్తీ అందుగ్గాను ఒట్టి కబుర్లు కాక సుదీర్ఘ ప్రణాళికాబద్ధమైన శ్రమశక్తీ!

          వాళ్ళు వేకువ శుభ్రపరచింది కేవలం శివాలయం ముందే అనుకొనేరు - దాని ఎదుటి పంచాయతీ కార్యాలయ మార్గమూ, విజయవాడ దారిలోనే కోట గుమ్మాల, డజనుకు పైగా దుకాణాల ముంగిళ్ల, బిర్యానీ బళ్ల, టీ కొట్ల, టైర్ల షాపుల పరిసరాల్ని కూడా ఊడ్చారు - చెత్తా చెదారాలను ఏరారు - మూలమూలల్లో శోధించి, పిచ్చి మొక్కల పని బట్టారు!

          మురుగు గుంటల్లో పెరుగుతున్న గడ్డినీ, అడ్డు వస్తున్న ప్లాస్టిక్ తుక్కుల్నీ ఎంగిలాకుల్నీ వదిలి పెట్టలేదు. చీపుళ్ల వారు ప్రోగేసిన ఇసుకా దుమ్మే చిన్న ట్రక్కు సగానికి పైగా నిండింది! మురుగు గుంటల కంపూ, ఎంగిలి పలావు పొట్లాల వాసనలూ వాళ్లకేమన్నా క్రొత్తా?

          శ్మశానాల్లో పాటుబడిన కర్తవ్య పరాయణులకు వీధి పారిశుద్ధ్య కృషి ఒక లెక్కలోనిదా? కొందరైతే అగ్రహారం తొలి వీధి దాక - అంటే ఆదివారం శుభ్రపరచిన చోటికి కూడ వెళ్లి ఊడ్చి వచ్చారు!

          అతిపరిచయా దవజ్ఞా” - అన్నట్లుగా 2900 కు పైగా రోజుల్నుండి చూసి చూసి ఈ గ్రామ ప్రజలకు తమ ఊళ్ళో జరిగే అరుదైన సామూహిక - సామాజిక శ్రమదానం విలువ తెలియడం లేదు!

నేటి సమీక్షా సమావేశం కాస్త ఆలస్యమైన కారణమేమంటే :

- 41 ఏళ్ల నాడు తనకు పెద్ద ప్రమాదం జరిగిన కేరళ - పాల్ఘాట్ దగ్గరి చుంగమన్నం ఊరికి వెళ్లి, తనను రక్షించిన అప్పటి గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పి వచ్చిన ఉదంతాన్ని Dr. డి.ఆర్.కె గారు వివరించడం! (ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక చాదస్తం అనిపిస్తుంది గాని - 400 ఏళ్ల నాటి మహాకవి షేక్స్పియర్ కింగ్ లీయర్అనే నాటకంలో కృతజ్ఞతలేని తన కూతుళ్లనుద్దేశించి అరె! మనుషుల్లో ఉండవలసిన కృతజ్ఞతాభావం తోడేళ్లవంటి అడవి జంతువుల్లో ప్రవేశించిందే...అన్నాడు!)

          ఈనాటి నినాదాలు కూడా Dr. DRK గారివే!

          రేపటి మన శ్రమదానం విజయవాడ మార్గంలోని శివాలయం వద్ద నుండే మొదలు కాగలదు.

          DRK ఉవాచ!

ఇన్నాళ్ళీ మురికి పనులు ఎవరు చేయగలరనీ,

ఊరి కొరకు బరువు పనులకొప్పుకొందురెవరనీ

చిరుగు - బురద బట్టలతో చెమట కార్చుటిచట

గాక ఎక్కడైన కలదాఅని DRK ఉవాచ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.10.2023.