2922* వ రోజు .......           26-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం మానేద్దాం !

26.10.23 (గురువారం) శ్రమదాన విశేషాలు - @2922*

          అవి ఎప్పట్లాగే వేకువ 4.18 - 6.05 సమయ మధ్యస్థాలు! 24 మంది సామాజిక బాధ్యతకు సంబంధితాలు! బెజవాడ బాటలో ఇంకొంత ముందుకు పురోగమించినా, ప్రధానంగా కర్మల భవన - తటాక - శివాలయములకే పరిమితాలు! ఒకరకంగా స్వఛ్ఛ చల్లపల్లి కార్యకర్తలకు తప్ప అనన్య సాధ్యాలు!

          ఎంతగా స్థిత ప్రజ్ఞులు కాకపోతే – ఈ డాక్టర్లు, బడిపంతుళ్లు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు ఇన్నేళ్లుగా ఆచరణ రూపంలో గ్రామస్తుల సంఘీభావం అంతంత మాత్రంగా ఉంటున్నా - మొండికేసుకొని ఈ పారిశుద్ధ్య పనులకు పాల్పడతారు?

          మరి వాళ్ళకు కూడ విసుగు తెప్పించే బాధ్యతారాహిత్యం అక్కడ కనిపిస్తే? నిన్న ఉదయం తాము శ్రమించిన చోట - రాత్రి చెత్తబండి తిరుగుతున్నా - మళ్లీ తెల్లారేసరికి కొన్ని దుకాణాల ముందు చెత్త ప్రత్యక్షమైతే? చెరువు గట్టు మూలన వేప - మేడి కొమ్మలతోనూ, టీ కప్పులతోనూ మినీ చెత్త కేంద్రం తయారైతే?......

          ఇది స్వచ్ఛ కార్యకర్తలకు విషమ పరీక్షా? గ్రామస్తుల సామాజిక చైతన్య వివక్షా? గ్రామ పాలక వర్గ ప్రయత్న లోపమా? ఎలా అర్థంచేసుకోవాలి? అన్ని టీ - కాఫీ కొట్లలోనూ గాజు గ్లాసులే వాడాలనే తీర్మానాలేమైనట్లు?

          శివాలయం ప్రక్క చెరువు మూల ప్రోగుపడ్డ వ్యర్ధాల కంపూ, అందులో గంటకు పైగా డజను మంది శ్రమించిన తెగింపూ నేటి శ్రమదాన ప్రత్యేకత అనుకోవాలి. వాట్సప్ చిత్రంలో పెద్ద ట్రాక్టర్లో ఎంతెత్తున చెత్త  నిండుతున్నదీ గమనించండి.

          సిమెంటు కొట్టు దగ్గర రోడ్డుపైన ఇసుక + దుమ్ము + సిమెంటు ధూళి + రాతి ముక్కలు ఎన్నంగుళాలు పేరుకుపోయిందీ, ముఖాలకు, ముక్కులకూ మాస్కులతో ఆరేడుగురెంతగా కష్టిస్తే అవి ఎన్ని గుట్టలయిందీ చూడండి! దండమూడి - కస్తూరి ఉద్యానం దగ్గర 10 x 3 గజాల జాగాలో గోకగా, ఊడ్వగా ఎన్ని గుట్టల వ్యర్ధాలు, దుమ్మూ వచ్చిందో కనిపిస్తూనే ఉంది గదా!

          ఆ విధంగా ఆ 100 గజాల బెజవాడ వీధి పారిశుద్ధ్య కృషిలోనే 2 డజన్ల కార్యకర్తలు తరించారు.

          6.15 కు ప్రారంభమై పది నిముషాల్లో ముగిసిన తుది సమావేశంలో నిన్నటి – నేటి, రేపటి వీధి సౌందర్య కృషి వివరాలు, ప్రణాళికలూ - ప్రస్తావనకొచ్చినవి.

          రేపటి వేకువ మన ప్రయత్నం శ్రీమంతు క్లబ్బు ప్రక్క వీధి నుండి జరగాలని నిర్ణయించారు.

          ఎందుకొ ఈ కవితలు!

అత్యుత్సాహం చూపే స్వచ్ఛ కార్యకర్తలతో

పదేపదే వర్ణిస్తూ పరవశించు వ్రాతలతో

ఇన్ని వేల దినాలుగా ఎందుకొ ఈ కవితలు!

ఎందరు గ్రామస్తుల్లో ఏ మాత్రం కదలికలు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.10.2023.