2923* వ రోజు ..........           27-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

అలుపెరుగని గ్రామ స్వచ్ఛ సుందరోద్యమం - @2923*

          ఈ గురువారం (27-9-23) వేకువ కూడ అది 4.16 కే ప్రారంభం! నిన్న ముగిసిన కస్తూరి మామ్మ ప్రాయోజిత ఉద్యానం దగ్గరే మళ్లీ నేటి 25 మంది (అసలు కార్యకర్తలు 23 గ్గురే గాని - ఆలస్యంగా వచ్చిన ట్రస్టు ఉద్యోగులతో కలిపి) శ్రమదానం! కాకపోతే నిమ్మల తోట వీధి దిశగానూ, అగ్రహారం 2 వ బాట వైపుగానూ కొంత మేర జరిగిన పారిశుద్ధ్యం!

          నేటి ఉషోదయాత్పూర్వం బెజవాడ బాటలో శ్రీమంతుల క్లబ్బు కేంద్రంగా జరిగిన గ్రామ సామాజిక బాధ్యతలు ఒకరకంగా ప్రత్యేకం! చాల ఏళ్ల క్రితమే స్వచ్చోద్యమకారుల స్వయం నిర్దేశిత శ్రమదాన సమయం 4.30 - 6.00 నడిమి కాలం! ఐతే కొంతకాలమే నిలిచిందా నియమం ! మరీ - ఈ వేకువైతే 4.16 నుండి 6.32 దాక ముమ్మరంగా జరిగింది సమయదానం!

          బహుశా పాల వ్యాపార కూడలిలో నేడు పోగుబడ్డ వ్యర్థాల్ని వదిలేయడం సరికాదనే కొందరు కార్యకర్తలు పట్టుదలే నేటి కాల విలంబకారణం! 6.10 తర్వాత 16 మంది కంచె లోపల్నుండి, బెజవాడ బాట తూర్పు నుండీ పనలు పట్టీ, డిప్పల కెత్తీ ట్రాక్టర్లోకి విసరుతుంటే - ఇద్దరు వాటిని చాకచక్యంగా పట్టి సర్ది, త్రొక్కుతుంటే - బస్సులూ, ద్విచక్ర వాహనాలూ నెమ్మదించి నడుస్తుంటే - ఆ 20 నిముషాల పని కోలాహలమే - ఊపిరిసలపనిపని ముమ్మరమే – సదరు శ్రమ గ్రామ ప్రయోజనార్ధం కావడమే ఒక అద్భుతం!

          దీనికి తీసిపోని శ్రమ సౌందర్యం మరొకటి కూడ వీలైతే వాట్సప్ చిత్రంలో గమనించండి : గూళ్లు నొప్పి భరిస్తూ, ఆరేడుగురు ఊడ్చి ప్రోగులు చేసిన రాళ్ళూ - రప్పలూ, దుమ్మూ ఇసుకా చిన్న ట్రక్కు నిండి, నలుగురు కార్యకర్తలు దాన్ని1 కిలోమీటరు దూరంలోని నారాయణరావు నగర్ రోడ్ల గుంటనూ, ప్రభుత్వాస్పత్రి మలుపులోని లోతు గుంటనూ పూడ్చి, వాహన ప్రమాదాల్ని నివారించడం!

          ఏ గ్రామ సీమలకైనా ఈ చల్లపల్లి నుండి ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తీ ఎగుమతి జరుగుతున్నది ఇలాంటి శ్రామిక సన్నివేశాల నుండే! అమెరికా నుండి - నిన్న కూడ ఆంజనేయులు గారనే ఒక నరముల వైద్యుడు (Neurologist) కుటుంబ పరివారంగా వచ్చి, ఊరంతా సావకాశంగా తిరిగి చూసి వెళ్లిందొక సరికొత్త ఉదాహరణం!

          6.45 కు హడావిడిగా జరిగిన సమీక్షా సమావేశంలో ఉద్యమ నినాదాలను వినిపించినది అడపా గురవయ్య గారు!

          రేపటి వేకువ కూడ మనం కలుసుకోదగింది - ఈ బెజవాడ మార్గంలోని అగ్రహార సమీపంలోనే!

          సాఫల్యత కనువిందే!

స్వచ్ఛోద్యమ ఆంతర్యం పసిగట్టిన వారైతే,

వార్డులన్ని, వీధులన్ని అంది పుచ్చుకొని ఉంటే –

ప్రతి వార్జున డజను మంది పని పాటులు మొదలెడితే –

స్వచ్చోద్యమ చల్లపల్లి సాఫల్యత కనువిందే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.10.2023.