2924* వ రోజు ..........           28-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

గ్రామ కాలుష్యంపై 33 మంది పోరాటం! - @2924*

          శనివారం వేకువ 4:20 – 6:13 వేళల మధ్య - అగ్రహారం 2 వ వీధి ప్రక్కన. దండమూడి కస్తూరి స్మారక బుల్లి ఉద్యానం దగ్గర జరిగింది అక్షరాలా యుద్ధమే! యుద్ధ విజేతల్లో 16 మంది అసలు కార్యకర్తలూ, నలుగురు నాబోటి కొసరు కార్యకర్తలూ -  అంటే ఆయుధాలందిస్తూ - దాహం తీర్చుతూ - సమరాన్ని కళ్లప్పగించి చూస్తూ - కెమేరాలో బంధిస్తుండే వాళ్లనుకోండి!

          సమర విజేతలు స్వచ్ఛ కార్యకర్తలనిపిస్తుంది గాని – అసలైన గెలుపు గ్రామ సమాజానిదే! ఎందుకంటే ఈ కార్యకర్తలు ఊరంతటికీ, అన్ని వర్గాలకే ప్రతినిధులు కనుక!    

          ‘అగ్రహారం తుది వీధి దాక కొందరు కాలుష్యం మీద దండెత్తారు గాని, ముళ్ల - పిచ్చి మొక్కల్ని, క్వార్టర్ మద్యం సీసాల్ని, ప్లాస్టిక్ తుక్కునీ పనిబట్టారు గాని, మెకానిక్ షెడ్ల, భోజన – ఫలాహార శాలల వ్యర్ధాల్ని తొలగించినదే పెద్ద పనైపోయింది!    

          రాజకీయుల ఫ్లెక్సీ మాటున ఏడెనిమిది గజాల్లోనే 50 చౌక మద్యం ప్లాస్టిక్ బాటిళ్లు ఒకాయన ఏరగలిగాడు!

          కార్యకర్తల సంఖ్య నిన్నటి కన్న పెరిగింది గాని - వార్డు ప్రాతినిధ్యం కనిపించలేదు. చీపుళ్ల మహిళలు మాత్రం బెజవాడ దారినీ, మార్జిన్లనూ శుభ్రపరిచారు!

          రోజువారీగా మనం గ్రామస్తుల ఉత్సాహపూరిత సన్నివేశాలెన్నో చూస్తుంటాం- అన్ని ఊళ్లలోనూ దేవుడి ఊరేగింపులూ, రాజకీయాల, కులాల, ఆధ్యాత్మిక ప్రవచనాల క్రీడా విజయాల, ఓటింగుల, మీటింగుల దృశ్యాలు క్రొత్త కాదు, కాని-

          బ్రహ్మముహుర్తాన తమ ఊరంతటి ఆహ్లాద – ఆనంద – అభ్యుదయాల కోసం 33 మంది మురుగు గుంటల్ని బాగుచేయడమూ, ఆ కంపుని భరిస్తూ, మురుగు మచ్చల్ని బట్టలకంటించుకొంటూ, ముఖాల్నిండా మట్టి కొట్టు కొనేంతగా సామూహిక శ్రమ చేయడం ఈ గ్రామంలో తప్ప ఎక్కడా కనిపించదు!

          ఇదేదో లోకోత్తర మహాత్యాగమనీ, కనీవినీ ఎరగని గొప్ప సేవ అనీ కాక సమాజం పట్ల తమ కనీస కర్తవ్యమని కార్యకర్తలు భావించడంలోనే ఉన్నది ప్రత్యేకత!

సావకాశంగా కొలువు తీరిన సమీక్షా కార్యక్రమంలో :

- అమెరికా నుండి వచ్చిన స్వచ్చ కార్యకర్త, ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యురాలూ ఐన దాసరి స్నేహ ప్రకటించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

          రేపు 75 మొక్కలు నాటేందుగ్గాను గంగులపాలెం దగ్గరి బందరు ఉపరహదారిలో కలవాలనే నిర్ణయమూ

          తొమ్మిదేళ్ల పండుగ

త్వరలోనే వస్తున్నది తొమ్మిదేళ్ల పండుగ

సామాజిక బాధ్యత గల జనులకదొక వేడుక

సొంత ఊరి పట్ల శ్రద్ధ చూపుటకది సందర్భం

వందలు వేలుగ పౌరులు పాల్గొనుటే ముదావహం.

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.10.2023.