2925* వ రోజు .............           29-Oct-2023

 పర్యావరణహితం కాని - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడనే వద్దు!

శ్రమదాన సందడితో కళకళలాడిన బందరు ఉపరహదారి - @2925*

          ఆదివారం (29-10-23) నాటి వేకువ 110 నిముషాల పాటు సదరు సందడికీ, కళాత్మతకూ కారణం - ఈ మధ్య ఎన్నడూ లేనంత సంఖ్యలో - 46+3 మంది గంగులవారిపాలెం నుండి ముప్పావు కిలోమీటరు పర్యంతం శ్రమ వీరవిహారం చేయడమే!

          కార్యకర్తలెందరున్నా - యువరక్తంతో వచ్చే ఊపే వేఱు! గత కొన్ని వారాల ఆ కొరత ఈ ఉదయం సతీష్, నిరంజనాదులతో తీరింది. ఒక దశలో ప్రయాణికుల వాహన రొదల మధ్య - కొందరు ఔత్సాహిక కార్యకర్తల కేకల నడుమ - సందడి పీక్ కు చేరి, “ఓహ్! ఇంత నిబద్ధతా, ఇంత అభినివేశం గల ఉడుకు కార్యకర్తలుంటే చల్లపల్లి శ్రమదానోద్యమానికేం లోటు – ఇంకో దశాబ్దమైనా అది విజయవంతమౌతుంది” అనిపించింది!

          నిన్నటి బెజవాడ రోడ్డు పారిశుద్ధ్యం అర్ధాంతరంగా వదిలేసి, ఈ ఉపదారికి వాలంటీర్లు రావడానికి కారణం - ఇక్కడ బాటకు దక్షిణంగా 75 మొక్కలు నాటాలనే. ఎందుకో గాని 63 మొక్కలే నాటారని తెలిసింది!

 మరి ఇంతమందీ అంత సేపూ మొక్కలే నాటారా? అంటే -

          ఇందులో ఎవరి అభిరుచి వాళ్ళది. కొందరికి పూల మొక్కల మీద వల్లమాలిన ప్రేమ! కొందరికి రోడ్డు మార్జిన్లలో గడ్డి కనిపిస్తే అసహ్యం! ఊరికి దూరంగా ఉన్న సిమెంటు రోడ్డైనా సరే – దాని మీద మరకలు, దుమ్ము, పుల్లలు, ఆకులు ఉంటే మరికొందరు సహించరు! ఎవరి ప్రియమైన పారిశుద్ధ్య కృషి వాళ్ళు చేస్తేనే గదా సంతృప్తి?

          నాటే మొక్కలు మోసి, అందించే వాళ్లు, సమదూరంలో నిటారుగా మొక్కలు నాటేవాళ్లు, పాదుల్లో వేప పిండి చిమ్మే కార్యకర్తలు, ఇంకెక్కడైనా నాటిన మొక్కలు క్షీణించాయా అని శోధించే వాళ్లు... ఇవీ మరికొందరి బాధ్యతలు!

          అమెరికా నుండీ, బెజవాడ నుండీ వచ్చిన వాళ్లు సంతోషంగా రహదారిని మెరుగుపరుస్తుంటే - సమీప గ్రామ వార్డు నివాసులు పాల్గొనక పోవడమే కాస్త లోటు!

          ఉత్సాహంగా మొదలైన సమీక్షా సమావేశంలో ఆర్య – ఆరవ్ లు గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలందుకోగా, గ్రామ స్వచ్ఛ - సుందర వైద్యుడు గత నెల ఆయ - వ్యయాల పట్టికను చదవగా, ఆలోచన రేకెత్తించే పాటల్ని నందేటి కార్యకర్త ఆలపించగా – సందర్భోచిత సూక్తులు గురవయ్య వినిపించగా వారాంత శ్రమదానం ముగిసింది.

          బుధవారం నాటి శ్రమదాన ప్రణాళికను బైపాస్ వీధి మొదటి HDFC బ్యాంకు వద్ద నుండి మొదలుపెట్టాలని నిర్ణయించారు.

          ప్రకృతి ఒడిలో ప్రకృతి రక్షకు

వీళ్లు పీల్చే మట్టి వాసన – వెంట వెంటనె చెమట వాసన

పాదు త్రవ్వీ మట్టి లాగుడు, బురద తోడీ మట్టి పిసుకుడు

కంప కట్టే కాల మందున ఒంటికేమో ముళ్ల గీకుడు

ప్రకృతి ఒడిలో ప్రకృతి రక్షకు ప్రయత్నించే ప్రకృతి బిడ్డలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.10.2023.