2926* వ రోజు ......... ....           30-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

అభివందనీయమైన స్వచ్ఛ సుందరీకరణం - @2936*

         వారం -సోమ, సమయం - వేకువ 4:27, మెరికల్లాంటి రెస్క్యూ వాలంటీర్లు - నలుగురు, స్థలం - గంగులవారిపాలెం వీధి సగాన, పని కాలం - గంటన్నర, పని చోటు సుమారు ½ కిలోమీటరు.

         అదీ - టూకీగా 30-10-23 న మబ్బు పట్టిన వేకువ జరిగిన శ్రమదాన విన్యాసం. ఆ కృషిని ఎంతమెచ్చుకొన్నా చాలదని నా అభిప్రాయం!

విషయాన్ని కాస్త విస్తరిస్తే:

- నేటి శ్రమదానం 2 విధాలుగా. మొదటిది మా ఇంటి ఎదుటి వీధి ఉద్యానాన్ని కలుపు తీసి, పాదులు సవరించిన పని. కాకలు తీరిన కార్యకర్తలకదెంతసేపు? అరగంటలో ఊదేశారు!

- 2 వ రకం శ్రమ వీధి బారునా కరెంటు పని వారు నరికి డ్రైన్ లో వదిలేసిన చెట్ల కొమ్మల తొలగింపు. ఇదే కాస్త కష్టమైన, ఆలస్యమైన పని.

         కొమ్మలు నీళ్లలో నాని, బురదలో గ్రుచ్చుకొన్నందున పెద్ద కొమ్మల్ని బైటకు లాగడమొకపనీ, ట్రాక్టరలో ఒదిగేలా ముక్కలుగా నరకడం మరొక పనీ, లోడింగూ, రోడ్డు ఊడ్పూ ఇతర పనులూ!

         ఐతే - ఈ పనుల్లో కాస్త ఆలస్యంగా వచ్చిన 7 గురు కార్యకర్తలు కూడ యధాశక్తిగా సహకరించారు.

         ఈ పనిలోనే ఒక మొక్కల పెంపకందారుడు కాళ్లు జారి, మురుగ్గుంటలో పడిన దృశ్యాన్నీ, పడినా సరే - పట్టుకొన్న కొమ్మని వదలని సంగతినీ, అతడు ఒడ్డుకు వచ్చేందుకు నేను చేయూతనిస్తున్న వైనాన్ని వాట్సప్ చిత్రంలో గమనించండి!

         వాట్సప్ గ్రూపులోనే ట్రాక్టర్ నిండిపోయి, పట్టక ఎంతెత్తుగా ఉన్నదో - ఇంకా వ్యర్థాలు వీధిలో ఎన్ని మిగిలిపోయినవో చూడవచ్చు.

         6.20 సమయంలో వీరు తమ బాధ్యతను, పట్టుదలను మాలెంపాటి డాక్టరు గారి నినాదరూపంలో ప్రకటించారు.

         శంకర శాస్త్రి గారు సమకూర్చిన కాఫీలాస్వాదించాక ఇళ్లకు పోయారు.

         'అందరితో పాటు' తాను

ఏ ఊళ్లో మిగిలున్నది ఈ సామాజిక బాధ్యత!

'అందరితో పాటు' తాను అనే కాస్త విజ్ఞత!

ఒక వేళున్నా సుదీర్ఘ శ్రమదాన ప్రస్థానం

మన సమకాలంలో ఉండుట మాత్రం ప్రత్యేకం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.10.2023.